Winter Care For Kids: చలికాలంలో పిల్లల పట్ల ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి.. నిర్లక్ష్యం వహిస్తే వ్యాధుల రిస్క్!
Winter Care For Kids: చలికాలంలో పిల్లల పట్ల పెద్దలు మరింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు సోకకుండా కొన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలి. అవేవో ఇక్కడ తెలుసుకోండి.
చల్లటి వాతావరణం ఉండే శీతాకాలంలో ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పిల్లలపై వీటి ప్రభావం ఎక్కువగా పడే అవకాశం అధికం. ఈ కాలంలో చిన్నారులకు జలుబు, దగ్గు, జర్వం లాంటివి వచ్చే రిస్క్ ఎక్కువా ఉంటుంది. అందుకే పిల్లలు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా చలికాలంలో పెద్దలు వారి పట్ల జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించకూడదు. పిల్లల పట్ల తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
సరిపడా నీరు తాగేలా చూడాలి
సాధారణంగా చలికాలంలో ఎక్కువగా దాహం వేయదు. అందుకే పిల్లలు ఎక్కువ నీరు తాగరు. అయితే, తగినంత నీరు తాగకపోతే చలికాలంలో శ్వాసకోశ ఇబ్బందులు ఏర్పడతాయి. జలుబు, దగ్గు వచ్చే రిస్క్ పెరుగుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటికి వెళ్లడం కష్టమవుతుంది. అందుకే చలికాలంలో పిల్లల శరీరానికి సరిపడా నీరు తాగుతున్నారా లేదా అని పెద్దలు గమనిస్తూ ఉండాలి. వారికి నీరు తాగిస్తూ హైడ్రేటెడ్‍గా ఉండేలా చూసుకోవాలి. అవసరమైన కాచి చల్లార్చిన నీరు తాగిస్తే ఇంకా మంచిది.
వెచ్చగా ఉండేలా డ్రెస్సింగ్
పిల్లలను తీవ్రమైన చలి నుంచి రక్షించి వారి శరీరం వెచ్చగా ఉండేలా పెద్దలు జాగ్రత్త తీసుకోవాలి. అందుకే ఉన్ని స్వెటర్లు తప్పనిసరిగా వేయాలి. చలితీవ్రత ఎక్కువగా ఉండే చేతులకు గ్లవ్స్, కాళ్లకు సాక్స్ వేయాలి. బయటికి వెళితే బూట్లు వేయాలి. పిల్లల శరీరానికి నేరుగా చల్లగాలి తగలకుండా చూసుకోవాలి. పిల్లల శరీరంలో వెచ్చదనం తగ్గితే జ్వరం వచ్చే రిస్క్ పెరుగుతుంది. జలుబు, దగ్గు లాంటివి వస్తాయి.
వ్యాయమాలు చేయించాలి.. కాసేపు ఎండలో..
చలికాలంలో పిల్లలతో వ్యాయమాలు చేయించాలి. రన్నింగ్, జాగింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ లాంటివి చేయించాలి. వ్యాయామం వల్ల శరీరంలో వెచ్చదనం కూడా పెరుగుతుంది. ఫిట్‍గా ఉంటారు. వ్యాధి కారకాలతో శరీరం మెరుగ్గా పోరాడగలుగుతుంది. ఉదయం ఎండ వచ్చాక వారిని కాసేపు సూర్యరశ్మి తగిలేలా తీసుకెళ్లాలి. దీంతో శరీరానికి కాస్త వేడి తగులుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ డీ కూడా లభిస్తుంది. అయితే, ఎక్కువగా చలిగా ఉన్నప్పుడు పిల్లలను బయటికి తీసుకెళ్లకూడదు.
ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు
చలికాలంలో పిల్లల ఆహారం విషయంలో ఎక్కువ జాగ్రత్తలు అవసరం. వారి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిటెండ్లు ఉండే ఆహారాలను పిల్లలకు తినిపించాలి. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు కచ్చితంగా తినిపించాలి. నారింజ, బొప్పాయి, టమాటా, పాలకూర, క్యాలిఫ్లవర్, పన్నీర్, అల్లం సహా పోషకాలు పుష్కలంగా ఉండేవి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉండే వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో శరీరం మెరుగ్గా పోరాడుతుంది. ఇక, చలికాలంలో పిల్లలకు ఫ్రైడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినిపించకండి. వాటికి దూరంగా ఉంచాలి.
వైద్యుల దగ్గరికి..
చలికాలంలో పిల్లలకు ఏదైనా అనారోగ్యం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. నిర్లక్ష్యం చేస్తే చలికాలంలో త్వరగా తీవ్రత పెరుగుతుంది. అలాగే, పిల్లలకు అన్ని టీకాలు వేయించారో లేదో చెక్ చేసుకోవాలి. అవసరమైతే జ్వరం రాకుండా వ్యాక్సిన్ వేయించాలి. పిల్లలు తరచూ చేతులు కడుక్కునేలా శుభ్రత నేర్పించాలి.