Sunday Motivation: జీవితంలో ఈ సూత్రం పాటిస్తే ఎంతో నేర్చుకుంటారు.. ఎదిగేందుకు చాలా తోడ్పడుతుంది
Sunday Motivation: జీవితంలో ఎవరినీ తక్కువగా చూడకూడదు. ప్రతీ ఒక్కరి నుంచి ఎంతో కొంతైనా నేర్చుకోవాలి. ఏమీ తెలియని వ్యక్తి ఎవరూ ఉండరు. ఎదగాలంటే వినడం ఎంతో ముఖ్యం.
జీవితంలో రకరకాల వ్యక్తులు పరిచయం అవుతుంటారు. జీవన గమనం సాగే కొద్దీ అనేక మంది తారసపడుతుంటారు. కొందరితో బంధం సుదీర్ఘ కాలం కొనసాగితే.. మరికొందరితో పరిచయం త్వరగానే ముగుస్తుంది. కొందరు నచ్చితే.. మరికొందరిపై అయిష్టం ఉంటుంది. అయితే, జీవితంలో ఎవరు పరిచయమైనాా వారు చెప్పేది వినాలి. వినడం వల్ల నేర్చుకునే అవకాశం ఉంటుంది. తెలుసుకునేందుకు ప్రతీ ఒక్కరి దగ్గర ఏదో ఓ విషయం ఉంటుంది.
సర్వం తెలుసనే భావన వద్దు
జీవితంలో ఓ స్థాయికి వచ్చాక తమకు అన్నీ తెలుసునని కొందరు అనుకుంటూ ఉంటారు. ఎవరు ఏది చెప్పినా పట్టించుకునే పరిస్థితుల్లో ఉండరు. అయితే, ఈ ధోరణి జీవితంలో మరింత ఎదిగేందుకు నిరోధకంగా ఉంటుంది. ప్రపంచంలో చాలా విషయాలు మారుతుంటాయి. అలాగే, పరిస్థితులను ఒక్కొక్కరు ఒక్కో దృక్పథంతో చూస్తుంటారు. విభిన్న అభిప్రాయాలు ఉంటాయి. ఎదుటి వ్యక్తుల మాటలు, అభిప్రాయాలు వినడం ఎంతో ముఖ్యం. అన్ని విషయాలు నాకే తెలుసనే ధోరణి, మనస్తత్వం వీడాలి.
ప్రతీ ఒక్కరి నుంచి నేర్చుకోవాలి
జీవితంలో ఎవరు ఏది చెప్పినా ముందు వినేందుకు సిద్ధంగా ఉండాలి. అది నచ్చినా.. నచ్చకపోయినా ఆలకించాలి. ఎదుటి వ్యక్తికి ఏమీ తెలియదనే భావనను వీడాలి. ఎందుకంటే ఏమీ తెలియని వారు ఎవరూ ఉండరు. ప్రతీ ఒక్కరికి ఏదో ఒకటి తెలిసే ఉంటుంది. వినడం ద్వారా దాన్ని కూడా నేర్చుకునే అవకాశం దక్కుతుంది. అందుకే వీలైనంత వరకు జీవితంలో పరిచయడమైన ప్రతీ వ్యక్తి వద్ద నుంచి ఎంతో కొంత తెలియని విషయాలను నేర్చుకోవాలి. పని గురించైనా, జీవన విధానం గురించైనా.. ఏ అంశం గురించైనా కొత్త విషయాలు తెలుసుకోవాలి. ఎదుటి వ్యక్తి అభిప్రాయాలను వినడం ద్వారా కూడా ఒక్కోసారి జీవితంలోని కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం దొరికే అవకాశాలు ఉంటాయి.
నేర్చుకోవడం ద్వారానే ఎదుగుదల
జీవితం అనేది నిత్య అభ్యాసంగా ఉండాలి. ఏ దశలో ఉన్నా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. దీని వల్ల జీవితంలో ఎదిగేందుకు అవకాశాలు బాగా పెరుగుతాయి. అందుకే ఎవరైనా ఏ విషయమైనా చెబితే.. స్పష్టంగా విని.. అది సరైనదా.. కాదా అని విశ్లేషించుకోవాలి. ఉపయోగపడే విషయాలను మెదడుకు ఎక్కించుకోవాలి. హోదాపరంగా మన కంటే తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తులైనా ఏదైనా చెబితే.. సరైనదే అనిపిస్తే అహం అడ్డురాకుండా దాన్ని నేర్చుకోవాలి. ఇలా జీవితంలో చాలా మంది వద్ద నేర్చుకున్న విషయాలు ఎదిగేందుకు, సమస్యలను అధిగమించేందుకు ఎంతో ఉపయోగపడతాయి. అప్పటికప్పుడు కాకపోయినా భవిష్యత్తు కోసమైనా ఉపకరిస్తాయి.,