Healthy Snacks: ఈ 3 రకాల స్నాక్స్ తిన్నా బరువు పెరగరు! ఎనర్జీతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా..
Healthy Snacks: స్నాక్స్ తినాలని నాలుక లాగేస్తుంటుంది. అయితే, ఫ్రైడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది. అయితే, కొన్నింటిని స్నాక్స్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
శరీర బరువు నియంత్రణలో ఉండాలంటే తీసుకునే ఆహారం చాలా ముఖ్యం. పోషకాలతో కూడిన ఆహారాన్ని మోతాదు మేరకు తీసుకోవాలి. అలాగే, బరువు తగ్గాలనుకునే వారు స్నాక్స్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. స్నాక్సే కదా అని ఏవిపడితే అవి తినకూడదు. స్నాక్స్‌గా నూనెలో వేయించిన ఆహారాలు, ప్రాసెస్డ్, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్ లాంటివి తింటే శరీర బరువు పెరుగుతుంది. అందుకే ఆరోగ్యకరమైన స్నాక్స్ తినాలి. వీటి వల్ల బరువు పెరిగే రిస్క్ ఉండదు. ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉంటాయి. అలాంటి మూడు రకాల హెల్దీ స్నాక్స్ గురించి ఇక్కడ తెలుసుకోండి.
నట్స్
బాదం, వాల్‍నట్స్, పిస్తా, జీడిపప్పు లాంటి నట్స్‌ను స్నాక్‍గా తినవచ్చు. ఇవి రుచికరంగానూ ఉంటాయి. ఒకవేళ స్నాక్స్ తినాలని అనిపిస్తే ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్యాకెట్ తీసుకునే బదులు నట్స్ తినొచ్చు. ఆకలిని నట్స్ తగ్గిచ్చేస్తాయి. కడుపు నిండిన సంతృప్తిని ఇస్తాయి. నట్స్‌లో ప్రోటీన్, మెగ్నిషియం, ఐరన్ సహా కీలకమైన విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి తినడం తింటే బరువు తగ్గేందుకు తోడ్పడతాయి. వెయిట్ పెరిగే అవకాశాలు చాలా తక్కువ. నట్స్ తీసుకుంటే శరీరంలో శక్తి, చురుకుదనం పెరుగుతాయి. ఆరోగ్యానికి పూర్తిస్థాయిలో లాభాలను అందిస్తాయి.
విత్తనాలు
గుమ్మడి, అవిసె, చియా, పొద్దుతిరుగుడు విత్తనాలు (సీడ్స్) కూడా ఆరోగ్యకరమైన స్నాక్స్‌గా ఉంటాయి. చిప్స్ లాంటి స్థానంలో ఈ విత్తనాలు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఈ విత్తనాల్లో ఫైబర్, కాల్షియం, ఐరన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా-6, కీలకమైన విటమిన్లు సహా మరిన్ని పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి తినడం ఓవరాల్ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. మంచి ఎనర్జీ వస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా సీడ్స్ తీసుకోవాలి. విత్తనాలను నేరుగా తినడమో, కాల్చుకొని తినడమో, సలాడ్లు సహా ఇతర వాటిలోనూ కలుపుకొని తినొచ్చు.
పాప్‍కార్న్.. కానీ ఓ కండీషన్
పాప్‍కార్న్ కూడా హెల్దీ స్నాక్ ఆప్షన్‍గా ఉంటుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా క్యాలరీలు తక్కువగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి. ఇవి తింటే జీవక్రియ మెరుగవుతుంది. కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది. ఆకలి తగ్గిస్తుంది. దీంతో బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. అయితే, పాప్‍కార్న్ ప్లెయిన్‍గా తీసుకోవాలి. ఫ్లేవర్లు ఉండే పాప్‍కర్న్ తింటే క్యాలరీలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. అందుకే పాప్‍కార్న్ ప్లెయిన్‍గానే తింటే మేలు.
స్ట్రాబెర్రీలు, బ్లాక్‍బెర్రీలు లాంటి బెర్రీలను స్నాక్‍గా తీసుకున్నా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. నారింజ పండ్లను కూడా స్నాక్‍గా తీసుకోవచ్చు. బరువు తగ్గే ప్రయత్నంలో హెల్దీ స్నాక్స్ తీసుకోవడం కీలకంగా ఉంటుంది.