Spinach Health Benefits । రక్తహీనత ఉన్న వారు పాలకూర సూప్ తాగండి!
Spinach Health Benefits: ఆకుపచ్చని కూరగాయలు శరీరానికి అవసరమైన అన్ని ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి. వీటిలో పాలకూర విషయానికి వస్తే, దాని ప్రయోజనాల జాబితా చాలా పెద్దది. అవేంటో తెలుసుకోండి, పాలకూర సూప్ చేసుకోండి. రెసిపీ ఇక్కడ ఉంది.
ఆకుపచ్చని కూరగాయల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి మంచిది అని చిన్నప్పటి నుంచే మనకు పెద్దలు సలహా ఇస్తుంటారు. ఈ ఆకుకూరలన్నింటిలో పాలకూర చాలా రుచికరమైనది, ఇంకా ఎంతో శక్తివంతమైనది. మీరు పాపాయ్ కార్టూన్ షో చూసి ఉంటే అందులో పాపాయ్ క్యారెక్టర్ తనకు శక్తి అవసరమైనపుడు 'స్పినాచ్' తీసుకోవడం గమనించవచ్చు. అంటే అర్థం చేసుకోవచ్చు పాలకూరలో ఎన్ని పోషకాలు ఉంటాయనేది. ముఖ్యంగా పాలకూరతో స్మూతీలు, సూప్ తయారు చేసుకుంటే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మరి పాలకూరతో సూప్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ రెసిపీని అందిస్తున్నాము. అంతకంటే ముందు, ఈ సూపర్‌ఫుడ్ తీసుకోవడం వలన మీకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
Spinach Health Benefits- పాలకూరతో ఆరోగ్య ప్రయోజనాలు
పాలకూర తినడం వలన కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఈ కింద చూడండి.
కళ్లకు మేలు చేస్తుంది
నేషనల్ ఐ ఇన్స్టిట్యూట్ పరిశోధన ప్రకారం.. కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి, కంటి వ్యాధుల ప్రమాదాన్ని నివారించటానికి విటమిన్- ఎ పుష్కలంగా ఉండే ఆకుపచ్చని కాయగూరలు, ఆకుకూరలు తినాలని సిఫార్సు చేయడమైనది. ఈ సందర్భంలో పాలకూరలో మంచి మోతాదులో విటమిన్-ఎ, విటమిన్-సి ఉన్నాయి. ఇవి కళ్ళలో మచ్చలను తగ్గించడానికి పని చేస్తాయి. కంటిచూపును మెరుగుపరుస్తాయి.
బరువును నియంత్రిస్తుంది
అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నప్పుడు, చాలా మంది చేసేది ఆహారాన్ని తగ్గించడం. అయితే ఇలా చేయడం తప్పు. మీ బరువును నియంత్రించాలనుకుంటే, ఆహారం మానేయకుండా పోషకాలను అందించే ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా అందులో కేలరీలు తక్కువ ఉండాలి. పాలకూరలో కేలరీలు తక్కువగా ఉంటాయి, ఇది మీ బరువును నియంత్రిస్తుంది, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
రక్తహీనతను తొలగిస్తుంది
శరీరంలో ఎర్ర రక్త కణాలు తగ్గిపోవడం వలన రక్తహీనత ఏర్పడుతుంది. గర్భధారణ సమయంలో ఐరన్ లోపం ఇది సమస్యగా మారవచ్చు. NCBI (నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్) సైట్‌లో ప్రచురించిన పబ్‌మెడ్ సెంట్రల్ పరిశోధన ప్రకారం, పాలకూరలో మంచి మోతాదులో ఇనుము ఉంటుంది, ఇది రక్తహీనత ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
మరి ఇన్ని రకాల ప్రయోజనాలను అందించే పాలకూరను సూప్ రూపంలో తీసుకోవాలనుకుంటే, ఇక్కడ రెసిపీని చూడండి. ఏమేం కావాలి, ఎలా చేయాలి అనేది తెలుసుకోండి.
Spinach Soup Recipe కోసం కావలసినవి
- పాలకూర - 250 గ్రాములు
- పాలు - 1 కప్పు
- కార్న్‌ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు
- నల్ల మిరియాల పొడి - చిటికెడు
- ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినవి)
- వెల్లుల్లి - 2-3
- నెయ్యి - 1 టేబుల్ స్పూన్
- వెన్న - 1 టేబుల్ స్పూన్
- తాజా క్రీమ్ - 1 టేబుల్ స్పూన్
- ఉప్పు - రుచి ప్రకారం
- నల్ల ఉప్పు - రుచి ప్రకారం
- నీరు - అవసరమైన విధంగా
పాలకూర సూప్ తయారీ విధానం
- బాణలిలో నూనె వేడి చేసి, అందులో వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసి వేయించాలి.
- తర్వాత అందులో సన్నగా తరిగిన పాలకూర, ఉప్పు వేసి బాగా కలిపి మూతపెట్టి చిన్న మంటపై సుమారు 10 నిమిషాలు ఉడికించాలి.
- మరో పాన్‌లో వెన్న వేడి చేసి అందులో కార్న్‌ఫ్లోర్, పాలు వేసి క్రీమ్ సిద్ధం చేసుకోవాలి.
- ఇప్పుడు ఈ క్రీమ్‌లో అన్ని మసాలాలు, పాలకూరను కలపండి 1 గ్లాసు నీరు పోసి 10 నిమిషాలు ఉడికించాలి.
చివరగా క్రీమ్ కలపాలి. అంతే, వేడివేడి స్పినాచ్ సూప్ రెడీ.
సంబంధిత కథనం