Spinach in Breakfast | పాలకూర పూరీ తినండి.. పచ్చగా వర్ధిల్లండి!
బ్రేక్ ఫాస్ట్ కోసం సౌత్ ఇండియన్ స్టైల్లో రుచికరంగా ఏదైనా తినాలనుకుంటున్నారా? అయితే పాలక్ పూరీతో ఈ ఉదయం ప్రారంభించండి. రెసిపీ ఇక్కడ అందించాం..
అల్పాహారం మీరు ఒక రోజులో చేసే అత్యంత ముఖ్యమైన భోజనం. ప్రతిరోజూ ఉదయం అల్పాహారం చేయాల్సిందే, ఆ విషయంలో ఏమాత్రం రాజీపడొద్దు. రోజంతా ఎన్నో పనులతో ఎంతో బిజీగా ఉంటాం, కాబట్టి అల్పాహారం చేసుకొని తినడం పెద్ద పని కాదు. అందుకు సమయం కూడా ఎక్కువ అవసరం లేదు. రోజు ప్రారంభం అవ్వగానే చురుగ్గా పనిచేయాలంటే కొంత శక్తి కావాల్సిందే. అల్పాహారం చేయకుండా ఉండిపోతే ఆకలివేస్తుంది. దీంతో ఏకాగ్రతతో ఏ పనిచేయలేము.
మనకు రోజూ అల్పాహారం చేయడానికి ఎన్నో రకాల రుచికరమైన వంటకాలు ఉన్నాయి. అందులో ఒకరోజు పూరి చేసుకోండి. పూరిలు ఎప్పుడూ చేసేలాగా కాకుండా కొత్తగా ట్రై చేయండి. ఇక్కడ పాలకూరతో కలిపి చేసేటవంటి పాలక్ పూరి రెసిపీని అందిస్తున్నాం. వీలైతే ఇది ప్రయత్నించండి..
కావాల్సినవి
- 250 గ్రాములు గోధుమ పిండి
- 200 గ్రాముల పాలకూర ఆకులు
- 2 పచ్చిమిరపకాయలు
- 2 టీ స్పూన్లు ఉప్పు
- 1 టేబుల్ స్పూన్ నూనె (పిండి తయారీకి)
- ఒక కప్పు నీరు
- పూరీలు వేయించడానికి సరిపడా నూనె
తయారీ విధానం
- పాలకూరను బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీటిని మరిగించండి. మరో చల్లటి నీటిని (ఐస్ కోల్డ్ వాటర్) సిద్ధంగా ఉంచుకోండి.
- ఇప్పుడు వేడినీటిలో పాలకూర అలాగే పచ్చిమిర్చి వేసి 10 సెకన్ల పాటు ఉంచడి. ఆ తర్వాత వెంటనే తీసివేసి నేరుగా చల్లని నీటిలో పాలకూర, పచ్చిమిర్చిని ముంచండి. చల్లబడిన తర్వాత, ఆ నీటిని పూర్తిగా తీసివేయండి.
- ఇప్పుడు ఈ పాలకూర, పచ్చిమిర్చిని మెత్తగా పేస్టుగా రుబ్బుకోండి.
- ఇప్పుడు గోధుమపిండిని తీసుకొని అందులో కొంచెం నూనె, నీరు పోసుకొని ఆపైన పాలకూర పేస్టును కలుపుకోవాలి. ఇలా మెత్తని పిండి ముద్దగా చేసుకొని 10 నిమిషాల పాటు పక్కనపెట్టండి.
- ఈలోపు పూరీలు గోలించడానికి ఒక కడాయిలో నూనె పోసి వేడిచేయండి.
- ఇదివరకు చేసుకున్న పిండి ముద్దను చిన్నచిన్న ముద్దలుగా చేసుకొని పూరీ కోసం చదునుగా మార్చి పూరీలుగా వేయించండి.
పాలక్ పూరీలు రెడీ అయ్యాయి. నూనెను ఫిల్టర్ చేసి ప్లేటులోకి సర్వ్ చేసుకోండి, వేడివేడిగా తినండి. ఈ పూరీలకు కుర్మా అవసరం ఉండదు. పెరుగుతో అద్దుకొని తినవచ్చు.
సంబంధిత కథనం