తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Languages Of Apology | మెట్టు దిగండి.. ఒక్క క్షమాపణతో బంధాలు నిలుస్తాయి, ఆనందాలు వెల్లివిరుస్తాయి!

Languages of Apology | మెట్టు దిగండి.. ఒక్క క్షమాపణతో బంధాలు నిలుస్తాయి, ఆనందాలు వెల్లివిరుస్తాయి!

Manda Vikas HT Telugu

27 May 2023, 20:28 IST

    • Languages of Apology: మీరు నోటితోనే క్షమించమని అడగాలని లేదు. క్షమాపణ చెప్పడానికి చాలా మార్గాలు ఉన్నాయి. క్షమాపణను మీదైన శైలిలో వ్యక్తీకరించేందుకు  ఇక్కడ భాషలు చూడండి.
Languages of Apology:
Languages of Apology: (Unsplash)

Languages of Apology:

Languages of Apology: క్షమాపణ చెప్పడంలో తప్పులేదు, క్షమాపణ చెప్పినంత మాత్రాన మీరేం తక్కువైపోరు. ఒక్కోసారి మీ తప్పులేకపోయినా మీరే క్షమాపణ చెప్పాల్సి రావచ్చు. మీ ప్రియమైనవారి కోసం లేదా మీకు అత్యంత కావలసిన వారి కోసం మీరు ఒక మెట్టుదిగి 'తెలిసో తెలియకో తప్పు జరిగిపోయింది, తప్పు నా వైపు ఉంది కావచ్చు, క్షమించగలరు' అని మీరు ఒక మెట్టు దిగితే, మీరు తగ్గినట్లు కాదు, ఎంతో ఎత్తుకు ఎదిగినట్లు, మీ ఔన్నత్యమే పెరిగిపోతుంది. ఎందుకంటే పంతాల కంటే బంధాలు ముఖ్యం. మీ ఒక్క క్షమాపణతో బంధాలు నిలుస్తాయి, మీ ఇంట్లోనే ఆనందాలు వెల్లివిరుస్తాయి.

చాలా సంబంధాలు చిన్నచిన్న గొడవలకే విచ్ఛిన్నమవుతాయి. ఇక్కడ కేవలం ఇగోలు అడ్డువస్తాయి. పంతాలు, పట్టింపులకుపోయి విలువైన బంధాలను తెంచుకునే వారెందరో. దీనివల్ల ఇరువైపులా చాలా నష్టం జరుగుతుంది, మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. సంబరంగా ఉండేచోట విషాదమైన నిశబ్దం రాజ్యమేలుతుంది. మనసులో అగ్ని రగులుతూనే ఉంటుంది. కానీ, మీరు మీ పంతాల కంటే మీ బంధాలు ముఖ్యం అనుకుంటే క్షమాపణ చెప్పి చూడండి. ఇలా చేయడం వల్ల ఎదుటివారే మీలాంటి మంచి మనిషిని ఇబ్బంది పెట్టినట్లు పశ్చాత్తాపపడవచ్చు. మీరే అందరి దృష్టిలో పరిణితి కలిగిన వ్యక్తులుగా నిలవవచ్చు.

మీరు నోటితోనే క్షమించమని అడగాలని లేదు. క్షమాపణ చెప్పడానికి చాలా మార్గాలు ఉన్నాయి. క్షమాపణను మీదైన శైలిలో వ్యక్తీకరించవచ్చు. క్షమాపణ వ్యక్తీకరించేందుకు కొన్ని భాషలు ఇక్కడ చూడండి.

మౌఖిక క్షమాపణ

నేరుగా క్షమాపణ అడగండి, జరిగిన తప్పుకు క్షమించమని కోరండి. వారితో అర్థవంతంగా మాట్లాడండి. మీకు నేరుగా క్షమించమని చెప్పే ధైర్యం లేకపోతే, క్షమించమని లేఖ రాయండి. లేదా మెసేజ్ చేసి మీ పశ్చాత్తాపాన్ని వ్యక్తపరచండి. అయితే అందులో మీ నిజాయితీ కనిపించాలి.

సేవ చేయండి

కొన్నిసార్లు మాటల కంటే మీరు వారి కోసం తీసుకునే చర్యలు, వారికి చేసే సేవల ద్వారా మీ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను సరిదిద్దడానికి ప్రయత్నించవచ్చు. మీరు బాధపెట్టిన వ్యక్తికి అర్ధవంతమైన దిద్దుబాటు చర్యలు చేపట్టడం, మళ్లీ అదే తప్పు జరగకుండా చర్యలు తీసుకోవడం ఇందులో భాగం.

సమయం కేటాయించడం

మీరు బాధపెట్టిన వ్యక్తి కోసం సమయం కేటాయించండి. వారిపై మీ కోపం తాత్కాలికమే కానీ శాశ్వతం కాదని తెలిసేలా చేయండి. వారిపై శ్రద్ధ చూపండి. ఆప్యాయంగా మాట్లాడటం, వారికోసం పనులు చేయడం, వారివైపు నిలవడం ద్వారా మీరు వారితో మీ సంబంధాన్ని పునరుద్ధరించాలనుకుంటున్నారని చెప్పకనే చెప్పవచ్చు.

బహుమతులు ఇవ్వడం

ప్రేమ భాషల మాదిరిగానే, కొంతమంది వ్యక్తులకు ఏదైనా అర్థవంతమైన బహుమతులు ఇవ్వడం కూడా చేయవచ్చు. వారు మీ బహుమతిని క్షమాపణగా స్వీకరించవచ్చు. మీతో మళ్లీ కలిసిపోవచ్చు.

భౌతిక స్పర్శ

ఒక్కోసారి మాటలు, నోటితో క్షమాపణలు, బహుమతులు ఏవీ కూడా పనిచేయకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మీ స్పర్శ ద్వారా వారికి క్షమాపణ తెలియజేయండి. భౌతిక స్పర్శ ద్వారా మీ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయండి, ఇది కూడా సయోధ్యను కోరుకునే మార్గం. ఇందులో భాగంగా మీరు చేతులు పట్టుకోవడం, వీలైతే కాళ్లు పట్టుకోవడం లేదా ఒక కౌగిలింత ద్వారా దగ్గరవ్వొచ్చు.