Human Touch | టచ్ చేయండి.. మానవ స్పర్శ ఎలాంటి అద్భుతాలు చేస్తుందో తెలుసా?
చేతిలో చేయి వేయడం, ప్రేమతో హత్తుకోవడం, ప్రోత్సహిస్తూ భుజం తట్టడం వంటివి ఓ మనిషిపై చాలా సానుకూల ప్రభావం చూపుతుందని ఎన్నో అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. మానవ స్పర్శ మనిషి రోగ నిరోధక వ్యవస్థపైనా సానుకూల ప్రభావం చూపుతుందంటే నమ్ముతారా?
Human Touch ఓ మనిషి మానిసిక, శారీరక, భావోద్వేగపరమైన అంశాల్లో మానవ స్పర్శది చాలా ముఖ్యమైన పాత్రే. అప్పుడే పుట్టిన శిశువు.. అమ్మ స్పర్శ తగలగానే ఏడుపు మానేస్తుంది. అదీ హ్యూమన్ టచ్‌లో ఉన్న మ్యాజిక్. మనిషి మనుగడకు, సామాజిక బంధాలు మరింత దృఢంగా మారడానికి ఈ స్పర్శ చాలా అవసరం. ఎవరైనా కష్టాల్లో ఉన్న స్నేహితుడికి నాలుగు ఓదార్పు మాటలు చెప్పడం కంటే భుజం మీద చేయి వేసి, కాస్త దగ్గరకు తీసుకొని నేనున్నాను అన్న భరోసా ఇవ్వండి.
అది వాళ్లపై ఎంతటి సానుకూల ప్రభావం చూపిస్తుందో మీకే తెలుస్తుంది. అంతెందుకు క్లాస్‌రూమ్‌లో ఓ విద్యార్థిని టీచర్ ప్రశంసాపూర్వకంగా వెన్నుతడితే.. ఆ విద్యార్థి క్లాస్‌లో ఎంతో యాక్టివ్‌గా మాట్లాడే అవకాశాలు మూడు రెట్లు ఉంటాయని ఓ అధ్యయనం తేల్చింది. మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ ఈ టచ్ మ్యాజిక్ చేస్తుందని ఎన్నో అధ్యయనాలు తేల్చాయి.
టచ్ చేస్తే ఏమవుతుంది?
శారీరక స్పర్శ కారణంగా ఓ మనిషిలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ ఇద్దరు వ్యక్తుల మధ్య ఓ భావోద్వేగ బంధం ఏర్పడటానికి, సంతోషకరమైన జీవనం సాగించడానికి ఉపయోగపడుతుంది. స్నేహితులు, బంధువులు, మన ఇంట్లో వాళ్లు మనల్ని దగ్గరికి తీసుకున్నప్పడు వాళ్ల స్పర్శ మనలో తెలియని ఓ మంచి అనుభూతిని కలిగించడానికి ఇదే కారణం. అందుకే మానవ స్పర్శ చాలా శక్తివంతమైనది అంటారు. ఇది ఓ మనిషి మానసిక, శారీరక ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ స్పర్శ వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలేంటో ఒకసారి చూద్దాం.
స్పర్శతో సానుకూల ఆలోచనలు
టచ్ వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. ఈ ఆక్సిటోసిన్‌కు ఫీల్ గుడ్ హార్మోన్ అనే పేరుంది. ఇది పాజిటివ్‌గా ఆలోచించేలా, ప్రపంచంపై ఓ ఆశావహ దృక్పథాన్ని అలవరచుకునేలా ప్రోత్సహిస్తుంది. సాటి మనిషికి సాయం చేయడం, దయాగుణానికి సంబంధించిన భావనలను కూడా ఈ ఆక్సిటోసిన్ ఉత్పత్తి చేస్తుంది.
స్పర్శ.. ఆందోళన, ఒత్తిడికి ఓ మందు
శారీరక స్పర్శతో ఆక్సిటోసిన్ రిలీజ్ కావడమే కాదు.. ఇది శరీరంలోని డోపమైన్, సెరోటోనిన్‌ల స్థాయిలను కూడా పెంచుతుంది. ఇవి ఓ వ్యక్తి మూడ్‌ను నియంత్రించడానికి, ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనానికి తోడ్పడతాయి. ఆందోళనను తగ్గించడంలో డోపమైన్‌ది కీలకపాత్ర. మనకు ఆనందాన్ని కలిగించే మెదడులోని భాగాన్ని ఈ డోపమైన ఉత్తేజపరుస్తుంది. రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న పేషెంట్లలో మసాజ్ థెరపీ అనేది డోపమైన్, సెరోటోనిన్ స్థాయిలను పెంచినట్లు ఓ అధ్యయనంలో తేలింది. మసాజ్ థెరపీ వల్ల వీళ్లలో ఆందోళన, కుంగుబాటు ఆలోచనలు, కోపం తగ్గినట్లు గుర్తించారు.
స్పర్శ.. రోగ నిరోధక వ్యవస్థకు బూస్ట్
శారీరక స్పర్శ ఓ వ్యక్తి రోగ నిరోధక వ్యవస్థకు బూస్ట్‌లా పని చేస్తుంది. అంతేకాదు గుండె, రక్త సంబంధిత రోగాల ముప్పునూ తగ్గిస్తుంది. కొందరు మహిళలపై నిర్వహించిన ఓ అధ్యయనం ఈ విషయాలను స్పష్టం చేసింది. తమ జీవిత భాగస్వాములు ప్రేమగా హత్తుకోవడం వల్ల వీళ్లలో హార్ట్‌రేట్, బీపీ తగ్గినట్లు ఈ అధ్యయనంలో తేలింది.
సంబంధిత కథనం