Emotional Eating | మీ కోపం, మీ బాధ తినే తిండిపై ప్రదర్శిస్తున్నారా? అయితే ఇది చదవండి!
Emotional Eating: కోపంలో ఉన్నప్పుడు లేదా బాధలో ఉన్నప్పుడు అతిగా తింటారు లేదా అసలే తినరు. ఈ రెండు అనర్థదాయకమే అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పరిష్కార మార్గాలు ఇక్కడ చూడండి.
ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి, కుటుంబంలో గొడవలు జరగటం సర్వసాధారణం. ఈ తరుణంలో కోపం, బాధ, ఏడుపు వంటి విభిన్న భావోద్వేగాలు కలుగుతాయి. కోపంతో కొంతమంది అలిగి తిండి మానేస్తారు. బాధ కలిగినపుడు కూడా కడుపు మాడ్చుకుంటారు. మరికొంత మంది ఎక్కువ తినేస్తారు. భావోద్వేగాలు ఎక్కువైన సందర్భంలో తిండి మీద ధ్యాస లేకపోయినా తెలియకుండానే ఎక్కువ తినేస్తారు. సంతోషం కలిగినపుడు కూడా స్వీట్లు తినడం, తృప్తిగా తినడం చేస్తారు. కొంతమంది చాలా సంతోషంగా ఉన్నప్పుడు లేదా తీవ్ర బాధలో ఉన్నప్పుడు ఎక్కువ తినడం, మద్యపానం సేవించడం లాంటివి చేస్తారు. అయితే ఈ రకంగా తమ భావోద్వేగాలను తినే తిండిపై ప్రదర్శిస్తారు. దీనినే భావోద్వేగ పూరితంగా తినడం (Emotional Eating) అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఈ ఎమోషనల్ ఈటింగ్ శరీరంలొ కార్టిసాల్ స్థాయిలలో పెరుగుదలకు దారితీస్తుంది, ఇది గ్రెలిన్ హార్మోన్ పెరుగుదలకు దారితీస్తుంది. గ్రెలిన్ హార్మోన్ కార్బోహైడ్రేట్లు, స్వీట్లు ఎక్కువ తినాలనే కోరికలను కలిగిస్తుంది. ఇది చివరకు ఒత్తిడి, ఆందోళనలు పెంచడమే కాకుండా కడుపులో మంట, ఆసిడిటీ, తీవ్రమైన ఆకలి వంటి అనర్థాలకు దారితీస్తుంది. ఈ చర్య ఒక గొలుసులాగా పనిచేసే అధిక బరువు, పొట్టరావటం, మధుమేహం వంటి వ్యాధులకు కారణం అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
భావోద్వేగపూరితంగా తినడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ, ప్రధాన కారణాలు 4. అవేమిటంటే..
- పని ఒత్తిడి
- కుటుంబ సమస్యలు
- ఆర్థిక సమస్యలు
- ఆరోగ్య సమస్యలు
పరిష్కార మార్గాలు ఇవే!
ఈ సమస్యను పరిష్కరించడానికి మీ భావోద్వేగంపై దృష్టి మరల్చే పనిచేయాలని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఒత్తిడిని నియంత్రించుకోవాలని సూచిస్తున్నారు. అందుకు కొన్ని మార్గాలను వివరించారు. అవేమిటో ఇక్కడ చూడండి.
- మీరు కోపంలో లేదా బాధలో తింటున్నప్పుడు గబగబ తినేయకుండా, నెమ్మదిగా ఆహారాన్ని తినడానికి ప్రయత్నించండి. ఎక్కువ సేపు నమలండి, తద్వారా కడుపు నిండిన అనుభూతి కలిగి తగినంత తింటారు.
- మీకు ఇలాంటి సమయంలో ఆకలిగా ఉన్నప్పుడు, ఫాస్ట్ ఫుడ్ కోసం కాకుండా పండ్లు, కాల్చిన మఖానాలు లేదా ఉప్పు లేని పాప్‌కార్న్ వంటి చిరుతిళ్లు తినండి.
- కోపం, బాధ వంటివి కలిగినపుడు మీ మనస్సుకు ప్రశాంతపరిచే పద్ధతులను అభ్యాసం చేయాలి. యోగా, ధ్యానం వంటివి చేయాలి. శ్వాస వ్యాయామాలు చేయడం వలన ఒత్తిడి, ఆందోళన అదుపులోకి వస్తాయి.
- దీర్ఘకాలికంగా ఒత్తిడి, ఆందోళనలను ఎదుర్కొంటుంటే. ప్రతిరోజూ ఉదయం వేళ తేలికపాటి ఎండలో తిరగండి. గడ్డిపై చెప్పులు లేకుండా కొద్దిసేపు నడవండి.
- మీ స్నేహితులు, శ్రేయోభిలాషులు, ప్రియమైన వారితో తరచూ మాట్లాడుతుండండి, చాటింగ్ చేస్తూ ఉండండి. మంచి సినిమా చూడండి. సంగీతం వినండి లేదా మంచి పుస్తకం చదవండి.
ఆహార కోరికలు ఎక్కువగా కలుగుతున్నప్పుడు ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహారాలను స్టోర్ చేసుకోండి. కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, చక్కెర పదార్థాలు, ఆల్కాహాల్ పానీయాలను ఇంట్లో ఉంచుకోకండి.
సంబంధిత కథనం