Work stress management: వర్క్ స్ట్రెస్ మాయమయ్యేందుకు ఈ 11 టిప్స్ పాటించండి
25 January 2023, 10:28 IST
- Work stress management: వర్క్ స్ట్రెస్‌తో స్వల్పకాలిక, దీర్ఘకాలిక అనారోగ్యం ఎదురవుతుంటుంది. ఈ స్ట్రెస్‌ను అధిగమించడానికి ఈ 11 టిప్స్ అనుసరించండి.
వర్క్ స్ట్రెస్ అధిగమించేందుకు ఆచరించాల్సిన 11 టిప్స్
Work Stress: రిలేషన్‌షిప్స్‌లో ఒత్తిళ్ల గురించి మనం ఎక్కువగా మానసికంగా ఆలోచిస్తుంటాం. కానీ వర్క్ స్ట్రెస్ మనకు తెలియకుండానే మనల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. కొన్ని వృత్తి, ఉద్యోగాలు ఒత్తిడితో కూడుకున్నవైతే, కొందరు త్వరగా ఎదగాలన్న ఆకాంక్షతో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. నిజానికి ఏ ఉద్యోగం ఒత్తిడి లేకుండా ఉండదు. ప్రతీ ఉద్యోగం దానికి తగిన ఒత్తిడి వాతావరణంతో కూడి ఉంటుంది. డెడ్‌లైన్లు, టార్గెట్లు, సఖ్యత లేని మేనేజర్లు, కస్టమర్లు.. ఇలా అనేక రకంగా ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి రావొచ్చు. నిర్ధిష్ట వేళల కంటే ఎక్కువ సేపు పనిచేయాల్సి రావొచ్చు. అయితే ఈ ఒత్తిడికి మనం ఎలా రెస్పాండ్ అవుతున్నామన్నదాన్ని బట్టి మనం దానిని అధిగమించవచ్చు.
వర్క్ స్ట్రెస్ దుష్ప్రభావాలు ఇలా
- తలనొప్పి
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
- నిద్ర లేమి
- ఏకాగ్రత దెబ్బతినడం
- యాంగ్జైటి
- డిప్రెషన్
- ఇమ్యూనిటీ దెబ్బతినడం
- ఇరిటెబుల్ బొవెల్ సిండ్రోమ్
- డయాబెటిస్
- గుండె జబ్బులు
- వెన్నునొప్పి
- కండరాల నొప్పులు
- థైరాయిడ్
- హైబీపీ
ఇలా అనేక రకాల అనారోగ్య సమస్యలు ఒత్తిడి కారణంగా వేధిస్తుంటాయి. ఈ అనారోగ్య సమస్యలు మన పనితీరును కూడా ప్రభావం చేస్తుంటాయి. భావోద్వేగ ప్రవర్తనను దెబ్బతీస్తాయి. కాలక్రమంలో ఉద్యోగం, వృత్తిపై ఆసక్తి సన్నగిల్లుతుంది.
వర్క్ స్ట్రెస్‌ను ఇలా అధిగమించండి
1. భయబ్రాంతులను వీడండి
సాధారణంగా మీరు మీ పూర్తి సామర్థ్యంతో పనిచేసినప్పటికీ ఫలితం గురించి ఎక్కువ ఆందోళన పడుతుంటారు. ఉద్యోగంలో మన పైవారి నుంచి ఎలాంటి ఒత్తిడి లేకున్నా రిమార్క్ తెచ్చుకోవడం ఇష్టం లేక మనం సక్రమంగా చేస్తున్నామా? రిజల్ట్ వస్తుందా? అన్న బెంగతో ఒత్తిడి తెచ్చుకుంటాం. ఈ ప్రాజెక్టు సక్రమంగా పూర్తవుతుందా? అమోదం పొందుతుందా? లేకపోతే మన పరువు పోతుందా? రెమ్యూనరేషన్ అందుతుందా? వంటి భయబ్రాంతులకు లోనై స్ట్రెస్ పెంచుకుంటాం. అందువల్ల వాస్తవ అంచనాలకు రావడం ద్వారా ఈ భయాలను తొలగించుకోవచ్చు. స్ట్రెస్ తగ్గించుకోవచ్చు.
2. సమయ పాలన చాలా ముఖ్యం
సమయ పాలన, ప్రాధాన్యతల వారీగా టాస్క్ పూర్తిచేయడం వల్ల వర్క్ స్ట్రెస్ దగ్గరికి రాకుండా చేయొచ్చు. రోజూ మీ పని ప్రారంభించడానికి ముందు మీ ప్లానింగ్ పూర్తిచేసుకోవాలి. ఈ రోజు చేయాల్సిన టాస్క్ ఏంటి? ఎవరెవరికి మెయిల్స్ చేయాలి? ఏ అసైన్‌మెంట్స్ పెండింగ్‌లో ఉన్నాయి? వంటివన్నీ మీ ప్లానింగ్ షీట్‌లో ఉండాలి. అది మీ ముందు ఉండాలి. కేటాయించిన సమయాన్ని బట్టి ఒక్కొక్కటీ చేస్తూ పోతూ ఉండాలి.
3. బ్రేక్ తప్పనిసరి
మీ పనిపై ఫోకస్‌గా పనిచేయాలంటే మీరు కచ్చితంగా 50 నిమిషాలకోసారి బ్రేక్ తీసుకోండి. ఆ 10 నిమిషాల విరామంలో అటూఇటూ నడవడమో, దీర్ఘంగా శ్వాస తీసుకోవడమో చేయాలి. లేదా చిన్నచిన్న స్ట్రెచ్ ఎక్సర్‌సైజెస్ చేయాలి. భుజాలు, మెడ, వెన్ను భాగంలో ఉండే నొప్పుల నుంచి ఉపశమనానికి సంబంధించిన స్ట్రెచ్ వ్యాయామాలు చేయడం వల్ల మీరు రోజంతా ప్రశాంతంగా ఉండగలుగుతారు. పని ఒత్తిడిలో పడి లంచ్ చేయడం మరవొద్దు. ఇది మీ శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
4. ఆ అలవాట్లు మానుకోండి
కొందరు వర్క్ స్ట్రెస్ వల్ల ధూమపానానికి అలవాటు పడతారు. ఇది మీ బ్లడ్ ప్రెజర్‌ను పెంచుతుంది. నికోటిన్‌కు బానిసలుగా మార్చుతుంది. మీ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దీర్ఘకాలంలో క్యాన్సర్ సహా అనేక రోగాలకు బాట వేస్తుంది. స్ట్రెస్ తగ్గించుకోవడానికని మొదలు పెట్టే ధూమపానం మీ జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. సిగరెట్ తాగడం వల్ల స్ట్రెస్ తగ్గుతుందన్న మాట అపోహ మాత్రమే. మీరు నికోటిన్‌కు అలవాటుపడి, అది అందనప్పుడు మీ శరీరంలోని కండరాలు, నరాలు ఒత్తిడికి గురవుతాయి. మీరు సిగరెట్ తాగగానే నికోటిన్ అందడం వల్ల ఒత్తిడి తగ్గినట్టు అనిపిస్తుంది. ఈ తరహా ఒత్తిడి సిగరెట్ తాగడం వల్లే ప్రారంభమైందని గుర్తుంచుకోండి. ఈ అలవాటు లేనప్పుడు ఆ సమస్యే లేదని గుర్తుకు తెచ్చుకోండి. వెంటనే మానేయడంపై దృష్టిపెట్టండి. ఇక అడ్డగోలుగా కెఫిన్ ఉండే కాఫీ, టీలను తాగడాన్ని మానుకోండి. వీలైతే హెర్బల్ టీ, మజ్జిగ ప్రయత్నించండి.
5. మల్టీటాస్క్ నైపుణ్యాలున్నా..
మీరు ఒకే సమయంలో వేర్వేరు పనులు చేయగలగిలే సామర్థ్యం ఉన్నా సరే.. వాస్తవిక దృక్పథంతో ఆలోచించి మీ ముందున్న టాస్క్‌పై ఫోకస్ చేయండి. వర్క్ లోడ్ పెంచుకుని స్ట్రెస్ తెచ్చుకోకండి.
6. నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి
రోజూ కచ్చితంగా 8 గంటలు నిద్ర పోతే మరుసటి రోజు మీ పనులు నిరాటంకంగా సాగిపోతాయి. ఆహారం, నిద్ర క్రమశిక్షణ లేకపోతే దీర్ఘకాలంలో మీరు అనేక అనారోగ్యాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ జీవక్రియ సరిగ్గా సాగితేనే విజయవంతమైన కెరీర్ కొనసాగించవచ్చు. బ్రేక్ ఫాస్ట్ 12 గంటలకు చేయడం, లంచ్ స్కిప్ చేయడం, డిన్నర్ ఆలస్యంగా చేయడం వంటివి చేయొద్దు. అలాగే లంచ్ ఆలస్యంగా చేసి డిన్నర్ స్కిప్ చేస్తుంటారు. ఏవీ స్కిప్ చేయకుండా మీ జీవక్రియ సక్రమంగా సాగేలా చూడండి. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వకు కచ్చితంగా నిద్రపోయేలా చూసుకోండి. ఒకవేళ నైట్ షిఫ్ట్ అయితే ఆ మేరకు మీ నిద్ర వేళలను మార్చుకోండి. నిద్ర లేమి సమస్యలు ఉంటే అందుకు పరిష్కార మార్గాలు వెతకండి.
7. రోజూ వ్యాయామం తప్పనిసరి
ఆరోగ్యకరమైన ఆహారం మూడు పూటల తినడం, 8 గంటల నిద్ర ఎంత ముఖ్యమో రోజూ క్రమం తప్పకుండా వాకింగ్, లేదా తేలికపాటి వ్యాయామాలు కూడా అంతేముఖ్యం. కదలిక లేని జీవితం అనేక జీవన శైలి వ్యాధులను తెచ్చిపెడుతుంది.
8. జీవనశైలి వ్యాధులపై దృష్టి పెట్టండి..
మీ ఉద్యోగం, కుటుంబ బాధ్యతల వల్ల మీకు సమయం దొరకకపోవచ్చు. లేక రిలేషన్‌షిప్స్‌లో ఉండే కష్టాల వల్ల మీరు మీ ఆరోగ్యంపై దృష్టిపెట్టలేకపోవచ్చు. కానీ మీ చలనం లేని జీవనశైలి, ఒత్తిడితో కూడిన పని వాతావరణం వల్ల మీ జీవక్రియ దెబ్బతిని డయాబెటిస్, హైబీపీ, థైరాయిడ్, బ్యాక్ పెయిన్ వంటి సమస్యలు వస్తాయి. వీటికి సంబంధించి తరచూ పరీక్షలు చేయించుకుని తగిన మందులు వాడండి.
9. స్కిల్స్ నేర్చుకోండి
ప్రస్తుత మీ ఉద్యోగం మీకు మానసికంగా సంతృప్తినివ్వకపోతే మీ అభిరుచికి తగిన స్కిల్స్ నేర్చుకుని సంబంధిత ఉద్యోగంలో చేరండి. మీ అభిరుచి, ఆసక్తితో కూడిన ఉద్యోగం అయితే మీకు స్ట్రెస్ ఎదురవ్వకపోవచ్చు.
10. కొలీగ్స్‌తో సత్సంబంధాలు
మీ మేనేజర్, సహచర ఉద్యోగులతో సత్సంబంధాలు కలిగి ఉండండి. మీ ప్రవర్తన నిజాయతీతో కూడి ఉంటే అందరికీ నచ్చుతుంది. మీకు సౌకర్యంగా లేని రోజుల్లో వారి సాయం తీసుకోవడంలో తప్పులేదు.
11. సెలవు తీసుకోండి..
బాగా స్ట్రెస్ ఎదుర్కొంటున్నట్టు మీరు గమనిస్తే రీఛార్జ్ అవ్వడానికి సెలవు తీసుకోవడంలో తప్పులేదు. చాలా మంది తమ సెలవులు వాడుకుంటే రిమార్క్ వస్తుందని మొహమాటపడుతుంటారు. కానీ సెలవులను అర్థవంతంగా వాడుకుంటూ మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకుంటూ మీ పని ద్వారా ఎక్కువ ఫలితాలను తీసుకురావొచ్చు.