Migraine headache: మైగ్రేన్ తలనొప్పికి బీ విటమిన్ లోపమూ ట్రిగ్గర్ పాయింటే..-vitamin b deficiency causes migraine headache find vitamin b food sources ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Vitamin B Deficiency Causes Migraine Headache Find Vitamin B Food Sources

Migraine headache: మైగ్రేన్ తలనొప్పికి బీ విటమిన్ లోపమూ ట్రిగ్గర్ పాయింటే..

HT Telugu Desk HT Telugu
Jan 17, 2023 05:25 PM IST

Migraine headache: మైగ్రేన్ తలనొప్పి చాలా బాధాకరమైన అనుభవం. ఇది రావడానికి విటమిన్ బీ లోపం కూడా ఒకటని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Migraine Triggers: విటమిన్ బీ లోపం వల్ల మైగ్రేన్
Migraine Triggers: విటమిన్ బీ లోపం వల్ల మైగ్రేన్ (stock photo)

Migraine headache: మైగ్రేన్ తలనొప్పి ఒక నిస్సహాయ స్థితికి లోను చేస్తుంది. తలనొప్పి కంటే కూడా మైగ్రేన్ నొప్పిలో అవస్థ తీవ్రంగా ఉంటుంది. రోజువారీ పనులు కూడా చేసుకోలేని దుస్థితి ఏర్పడుతుంది. అకస్మాత్తుగా మైగ్రేన్ తలనొప్పి రావడానికి అనేక అంశాలు కారణమవుతుంటాయి. సూర్య కాంతిలో ఎక్కువ సేపు నిలబడినా, రాత్రిపూట తగిన విశ్రాంతి లేకపోయినా మైగ్రేన్ నొప్పి రావొచ్చు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే శరీరంలో విటమిన్ బీ లోపం వల్ల కూడా మైగ్రేన్ అటాక్ అవుతుంది. మైగ్రేన్ నివారణలో డైట్ ప్లాన్ కూడా కీలకపాత్ర పోషిస్తుంది. అందువల్ల మీ ఆహారం ద్వారా విటమిన్ బీ అందేలా చూడాలి.

మైగ్రేన్ తలనొప్పి ఇతర తలనొప్పుల కంటే భిన్నమైంది. ఈ నరాల సంబంధిత అవస్త తీవ్రమైన తలనొప్పికి దారితీస్తుంది. దీనితో పాటు వికారం కూడా తోడుగా వస్తుంది. వెలుతురు, శబ్దాలు కూడా అస్సలు పడవు. హార్మోన్లలో మార్పులు, కొన్ని రకాల ఆహారాలు, పానీయాలు, ఒత్తిడి, తగినంత వ్యాయామం లేకపోవడం కూడా మైగ్రేన్‌ నొప్పి పెరగడానికి దారితీస్తుంది. తలలో ఒకవైపు నిర్ధిష్టమైన ప్రాంతంలో నొప్పి తీవ్రంగా ఉంటుంది.

మైగ్రేన్ తలనొప్పిని చికిత్స ద్వారా తగ్గుతుంది. కానీ ఇందుకు చాలా సమయం పడుతుంది. ఇలాంటి సమయంలో మైగ్రేన్‌కు కారణమవుతున్న అంశాలకు దూరంగా ఉండడం ఉపశమనాన్ని ఇస్తుంది.

తలనొప్పి, ముఖ బాగంలో నొప్పికి సంబంధించిన జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం థయామిన్ లేదా విటమిన్ బీ మైగ్రేన్ నొప్పిని తగ్గిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ నొప్పి తగ్గుతుందని ఆ అధ్యయనం తెలిపింది.

విటమిన్ బీ లోపంతో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు వస్తుంది?

‘మానవ శరీరంలో మెటబాలిజం ప్రక్రియలో విటమిన్ బీ చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. కార్బొహైడ్రేట్లు, కొవ్వుల నుంచి శక్తిని ఉత్పత్తి చేసేందుకు, అంతిమంగా అది శరీర విధులకు శక్తిని వినియోగించడంలో విటమిన్ బీ ఒక ముఖ్యమైన అనుసంధానంగా పనిచేస్తుంది..’ అని డాక్టర్ నటాషా కుమార వివరించారు.

స్ట్రెస్‌, నిద్ర లేమి, జీవ గడియారాన్ని అనుసరించకపోవడం, పని ఒత్తిడి వల్ల విటమిన్ బీ ఎక్కువగా వినియోగం అవుతుంది. ఈ కారణంగా నరాల వ్యవస్థపై ప్రభావం పడి అలసట, తలనొప్పి వస్తుంది. ఇదే మైగ్రేన్‌కు దారితీస్తుంది. ఇది పక్షవాతానికి కూడా దారితీస్తుంది. దీనినే వైద్య పరిభాషలో స్పైనల్ కార్డ్ సబ్‌అక్యూట్ కంబైన్డ్ డిజనరేషన్ (ఎస్ఏసీడీ) అని అంటారు.

పరిశోధకులు తమ అధ్యయనంలో నివేదించిన ప్రకారం విటమిన్ బీలో థయామిన్ (విటమిన్ బీ1), రైబోఫ్లావిన్ (విటమిన్ బీ2) ఉంటాయి. తగినంతగా ఈ విటమిన్లు అందని పక్షంలో మైగ్రేన్‌కు ట్రిగ్గర్ పాయింట్‌గా మారుతుంది. థయామిన్ వల్ల మైగ్రేన్ పేషెంట్లలో ఉపశమనం లభిస్తుందని కూడా అధ్యయనం సూచించింది.

విటమిన్ బీ లోపం నివారించేందుకు మీ రోజువారీ డైట్‌లో విటమిన్ బీ ఉన్న ఆహార పదార్థాలను తప్పక తీసుకోవాలి. విటమిన్ బీ 1 ఉండే బఠానీ, హోల్ వీట్ బ్రెడ్, నట్స్ వంటివాటిని తీసుకోవాలి. ఇక విటమిన్ బీ కోసం పాలు, గుడ్లు, పెరుగు అవసరం.

విటమిన్ బీ అధికంగా ఉండే ఆహారాలు:

విటమిన్ బీ అధికంగా ఉండే ఆహార పదార్థాల్లో ముఖ్యమైనవి గుడ్లు, చీజ్, బఠానీ, నట్స్, లివర్, మష్రూమ్, మాంసం, చేపలు, తాజా అరటి పండ్లు, కమలా పండ్లలో విటమిన్ బీ 1 (థయామిన్) ఉంటుంది.

పురుషులైతే రోజువారీగా 1 ఎంజీ థయామిన్ అవసరం అవుతుంది. మహిళలైతే 0.8 ఎంజీ థయామిన్ అవసరం అవుతుంది. ఆహారం నుంచి సమకూర్చుకోవడం మంచిది. థయామిన్‌ను శరీరం నిల్వ ఉంచుకోలేదు కాబట్టి.. రోజువారీ డైట్‌లో థయామిన్ ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.

విటమిన్ బీ2 (రైబోఫ్లావిన్) తగినంతగా ఉండడం వల్ల నరాల వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ఇది పాలు, గుడ్లు, పుట్టగొడుగులు, పెరుగులో లభిస్తుంది. పురుషులైతే 1.3 ఎంజీ, మహిళలైతే 1.1 ఎంజీ రైబోఫ్లావిన్ అవసరమవుతుంది.

WhatsApp channel

టాపిక్