Depression impact on Fertility: పిల్లలు పుట్టే అవకాశాలపై డిప్రెషన్ దెబ్బ
Depression impact on Fertility: డిప్రెషన్ కారణంగా పిల్లలు పుట్టే అవకాశాలు సన్నగిల్లుతాయని అధ్యయనం తేల్చింది.
డిప్రెషన్ కారణంగా పురుషులు, స్త్రీలలో సంతానోత్పత్తి అవకాశాలు సన్నగిల్లుతాయని చెబుతూ ప్రతిష్టాత్మక అమెరికన్ జర్నల్ ఆఫ్ అబ్‌స్టెట్రిక్స్, గైనకాలజీలో ఒక అధ్యయనం ప్రచురితమైంది. 14 లక్షల పార్టిసిపెంట్లను పరీక్షించి డిప్రెషన్‌కు, పిల్లలు కలగకపోవడానికి, అలాగే తక్కువ సంఖ్యలో పిల్లలు ఉండడగానికి గల కారణాలను విశ్లేషించింది.
‘మహిళలు, పురుషుల్లో డిప్రెషన్ కారణంగా పిల్లలు పుట్టకపోవడం, లేదా తక్కువ సంఖ్యలో పిల్లలు ఉండడం సంభవించిందని అధ్యయన ప్రధాన ఫలితాలు చెబుతున్నాయి..’ అని హెల్సింకీ కొలిజియం నుంచి పరిశోధకుడు కాటెరైనా గొలొవైన వివరించారు.
ఇక పురుషుల్లో స్వల్పంగా డిప్రెషన్ ఉన్నా పిల్లలు పుట్టే అవకాశాలు సన్నగిల్లుతాయని తేలింది. డిప్రెషన్ లేని పురుషులతో పోలిస్తే డిప్రెషన్ ఉన్న పురుషుల్లో 33 శాతం తక్కువ అవకాశాలు ఉంటాయని అధ్యయనంలో తేలింది. అలాగే డిప్రెషన్‌తో లేని మహిళలతో పోలిస్తే డిప్రెషన్ ఉన్న మహిళల్లో సంతానం కలిగే అవకాశాలు 15 శాతం తక్కువగా ఉంటాయని ఈ రీసెర్చ్ తేల్చింది.
డిప్రెషన్ తీవ్రత సంతానం కలిగే అవకాశాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా పురుషుల్లో తేలికపాటి డిప్రెషన్ కూడా సంతానోత్పత్తిని ప్రభావితం చేయగా, మహిళల్లో డిప్రెషన్ తీవ్రత ఎక్కువగా ఉంటేనే ప్రభావం చూపింది. డిప్రెషన్, సంతానం కలిగి ఉండడం మధ్య అనుబంధంలో సామాజిక ఆర్థిక స్థితిగతుల తారతమ్యాలు ప్రభావితం చేశాయా? విద్యార్హతల్లో తారతమ్యాలు కూడా డిప్రెషన్, పిల్లలు లేకపోవడం మధ్య గల సంబంధాన్ని ప్రభావితం చేశాయా అన్న కోణంలో కూడా అధ్యయనం చేశారు.
‘సెకెండరీ, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ అర్హత కలిగిన పురుషులు, మహిళల్లో సంతానం కలిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. పిల్లల సంఖ్య కూడా తక్కువగా ఉంది. ఇక బేసిక్ ఎడ్యుకేషన్ కలిగిన పార్టిసిపెంట్లలో ఉన్న పురుషులకు ఈ రెండు అంశాల మధ్య సంబంధం కనిపించలేదు. కానీ డిప్రెషన్ ఎక్కువగా ఉన్నప్పటికీ మహిళల్లో సంతానోత్పత్తి అవకాశాలు మెరుగ్గా కనిపించాయి..’ అని కాటెరినా గొలొవైన వివరించారు.
డిప్రెషన్ త్వరగా ఎలా గుర్తించాలి?
త్వరగా కనిపెట్టి డిప్రెషన్‌కు సరైన సమయంలో చికిత్స తీసుకోవడం చాలా కీలకమని అధ్యయనం సూచించింది. తద్వారా సంతానోత్పత్తి మెరుగుపడుతుందని వివరించింది. మానసిక ఆరోగ్య నిపుణులు గానీ, అబ్‌స్టెట్రిషియన్-గైనకాలజిస్టు గానీ స్క్రీనింగ్ చేసి డిప్రెషన్ గుర్తిస్తారని వివరించింది. పురుషుల్లో డిప్రెషన్ తీవ్రతను పరిగణనలోకి తీసుకోవాలని, ఎందుకంటే స్వల్ప డిప్రెషన్ కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని విశ్లేషించింది.