Deepika padukone: కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. డిప్రెషన్‌పై దీపిక
Deepika padukone on depression: దీపికా పదుకొనే తాను డిప్రెషన్‌తో ఎలా బాధపడిందో, ఎలా ఎదుర్కొందో చెప్పడానికి ఎప్పుడూ సంకోచించలేదు. డిప్రెషన్‌తో తన పోరాటంపై ప్రజల్లోకి వెళ్లి వివిధ సందర్భాల్లో దాని గురించి మాట్లాడిన పరిశ్రమలోని అతి కొద్ది మంది నటులలో ఆమె ఒకరు.
దీపికా పదుకొనే తాను నెలల తరబడి డిప్రెషన్‌తో ఎలా పోరాడిందో, ఆత్మహత్య ఆలోచనలతో సహా తన దారిలో వచ్చిన అనేక ఆటుపోట్లను ఎలా అధిగమించిందో మరోసారి గురువారం పంచుకున్నారు.
ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌లో దీపికా పదుకొనే మాట్లాడుతూ తాను డిప్రెషన్‌తో బాధపడుతున్నప్పుడు తన తల్లి తనను ఎలా రక్షించిందనే విషయాలను పంచుకున్నారు. ‘డిప్రెషన్ సంకేతాలు, లక్షణాలను గుర్తించినందుకు క్రెడిట్ అంతా మా అమ్మకే ఇస్తున్నాను..’ అని దీపికా పదుకొనే తెలిపారు.
‘నేను కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకున్నాను. అంతా బాగానే ఉంది. కాబట్టి ఆరకంగా బాధపడడానికి స్పష్టమైన కారణం లేదు. కానీ నేను ఎటువంటి కారణం లేకుండానే కుమిలిపోయేదానిని. అసలు నేను లేచేందుకే ఇష్టపడకపోయేదాన్ని. నిద్ర పోతే ఆ బాధ నుంచి తప్పించుకోవచ్చని నిద్ర పోతూనే ఉండేదాన్ని. కొన్నిసార్లు నేను ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలతో సతమతమయ్యాను..’ అని వివరించారు.
తన కష్ట సమయాల్లో ప్రియమైనవారు తనను ఎలా రక్షించారనే దాని గురించి మరింత వివరిస్తూ ‘నా తల్లిదండ్రులు బెంగళూరులో నివసిస్తున్నారు. వారు నా దగ్గరికి వచ్చిన ప్రతిసారీ నేను ధైర్యంగా ఉంటాను. అంతా బాగానే ఉందని పేరెంట్స్ కి చూపించాలని ఎప్పుడూ అనుకునే దానిని. ఒకరోజు వాళ్ళు వెళ్ళేంత వరకు బాగానే ఉన్నాను. వాళ్ళు బెంగుళూరుకి తిరిగి వెళుతుండగా నేను ఒక్కసారిగా ఏడ్చేశాను. మా అమ్మ నన్ను మామూలుగానే కొన్ని ప్రశ్నలు అడిగింది. బాయ్‌ఫ్రెండ్ వల్ల జరిగిందా? పని చేసే చోట ఏమైనా అయిందా? ఏదైనా జరిగిందా? అని అడిగింది. కానీ నా దగ్గర సమాధానాలు లేవు.. శూన్యం ఆవరించింది. ఆ సమయంలో నన్ను మా అమ్మ అర్థం చేసుకుంది. నిజంగా దేవుడే నాకోసం పంపినట్టు భావించాను..’ అని వివరించారు.
దీపికా పదుకొనే ఒక ఎన్జీవో నడుపుతోంది. ఇది ఒత్తిడి, ఆందోళన, నిరాశను ఎదుర్కొంటున్న ప్రతి వ్యక్తికి ఆశాజనకంగా ఉంటుంది.
'లైవ్ లవ్ లాఫ్' ఫౌండేషన్ వెనుక ఉన్న ఆలోచన గురించి దీపికా పదుకొనే ఇంకా మాట్లాడుతూ ‘నేను ఈ ఫౌండేషన్‌ను స్థాపించడానికి డిప్రెషన్ డయాగ్నసిస్ ఒక కారణం. మేం దీనిపై అవగాహనను కలిగించడానికి పనిచేస్తాం. మన చుట్టూ ఉన్న వారితో సున్నితంగా ఉండటానికి ఈ ఎన్జీవో దోహదం చేస్తుంది..’ అని వివరించారు.
ఆ కఠినమైన బాధను ఎలా అధిగమించిందనే విషయమై దీపికా పదుకొనే మాట్లాడుతూ ‘నా విషయానికి వస్తే.. నాకు ప్రొఫెషనల్ హెల్ప్ అవసరమైంది.. ఆపై నా ప్రయాణం కొనసాగింది.. మానసిక వైద్యుని వద్ద చికిత్స తీసుకున్నాను. అలా కొన్ని నెలలు సాగింది. మానసిక అనారోగ్యం అనే విషయాన్ని సమాజంలో చాలా చిన్నచూపు చూస్తారు. అందువల్ల నేను మొదట చికిత్స తీసుకోవడం గురించి ఆందోళనగా ఉన్నాను. చివరికి నేను మందులు తీసుకోవడం ప్రారంభించాను. మంచి అనుభూతి చెందడం ప్రారంభించాను..’ అని వివరించారు.
మానసిక అనారోగ్యంతో కూడిన ప్రయాణం ఒంటరిగా ఉంటుందని, మానసిక వ్యాధితో ఒక్క ప్రాణం కూడా పోకుండా చూసుకోవడమే తన ధ్యేయమని దీపికా పదుకొనే ముగించారు.