Thyroid causes male infertility: థైరాయిడ్‌తో మగ వారిలో సంతాన సామర్థ్యంపై దెబ్బ-can hypothyroidism hyperthyroidism thyroid disorders impact fertility in men and find tips to cope with it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Can Hypothyroidism Hyperthyroidism Thyroid Disorders Impact Fertility In Men And Find Tips To Cope With It

Thyroid causes male infertility: థైరాయిడ్‌తో మగ వారిలో సంతాన సామర్థ్యంపై దెబ్బ

HT Telugu Desk HT Telugu
Jan 23, 2023 06:08 PM IST

thyroid causes Male infertility: థైరాయిడ్ కారణంగా మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతింటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలతో పాటు, ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలో సూచిస్తున్నారు.

మగవారిల సంతానోత్పత్తి సామర్థ్యంపై థైరాయిడ్ ప్రభావం
మగవారిల సంతానోత్పత్తి సామర్థ్యంపై థైరాయిడ్ ప్రభావం (Andrea Piacquadio)

థైరాయిడ్ గ్రంథి శరీరంలో జీవక్రియను నియంత్రించడం, ఇతర విధులను నిర్వర్తించడంలో అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్ సమస్య వస్తే అది మగవారి సంతానోత్పత్తి సామర్థ్యంపై కూడా ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక స్థాయిలో థైరాయిడ్ హార్మోన్లు విడుదలైనప్పుడు గొనాడోట్రోపిన్ హార్మోన్ల ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయి. ఇది టెస్టిస్ పనితీరును, వీర్య కణాల నాణ్యతను ప్రభావితం చేస్తుంది. స్పెర్మ్‌లో అసాధారణతలు కూడా తక్కువ స్థాయిలో థైరాయిడ్ హార్మోన్‌ విడుదలవడంతో సంబంధం ఉందని వైద్యులు విశ్వసిస్తున్నారు.

హైదరాబాద్ కామినేని హాస్పిటల్స్ సీనియర్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ సందీప్ రెడ్డి హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌తో ఈ అంశాన్ని వివరించారు. ‘శరీరంలో జీవక్రియ, ఇతర విధులు నిర్వర్తించేందుకు అవసరమైన హార్మోన్లను థైరాయిడ్ గ్రంథి విడుదల చేస్తుంది. థైరాయిడ్ హార్మోన్ లోపం లేదా థైరాయిడ్ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల మగ వారి సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది…’ అని వివరించారు.

వీర్యం నాణ్యత, వీర్య కణాల సంఖ్య, స్పెర్మ్ డెన్సిటీ తగ్గడం వంటివన్నీ మగవారిలో హైపర్‌థైరాయిడిజమ్ లేదా హైపోథైరాయిడిజం వల్లేనని తేలిందని చెప్పారు. ‘మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తనిఖీ చేసే పారామీటర్లలో సెమెన్ పరిమాణం ఒకటి. థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్నప్పుడు వీర్యకణాల సంఖ్య తగ్గుతుంది. ఇక హైపోథైరాయిడ్ ఉన్న మగవారిలో టెస్టోస్టెరోన్, వీర్య ఉత్పత్తి తగ్గుతుంది. మగవారిలో ఫర్టిలిటీ సమస్యలు ఉన్నప్పుడు థైరాయిడ్ పనితీరును కూడా పరీక్షించడం చాలా ముఖ్యం. మగవారిలో థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయనప్పుడు దీనికి తగిన ఔషధాలు వాడాల్సి ఉంటుంది. హార్మోన్ లెవెల్స్ సాధారణ స్థితికి చేరుకున్నప్పుడు స్పెర్మ్ నాణ్యత పెరుగుతుంది..’ అని వివరించారు.

‘థైరాయిడ్ నుంచి హార్మోన్ల విడుదల తక్కువగా ఉండడం వల్ల అంగస్తంభన లోపం, వృషణాల పనితీరులో లోపం, వీర్యంలో నాణ్యత లేమి సమస్యలు ఉంటాయి. హైపోథైరాయిడిజం వల్ల అధిక హార్మోన్లు విడుదలవుతాయి. దీని వల్ల ప్రత్యుత్పత్తి వ్యవస్థ దెబ్బతింటుంది. స్పెర్మ్ కౌంట్ తగ్గడం, స్పెర్మ్ నాణ్యత తగ్గడం వంటి సమస్యలు ఏర్పడుతాయి. ఈ కారణంగా ఫర్టిలిటీ సమస్యలు ఉత్పన్నమవుతాయి. థైరాయిడ్ సమస్యలు ఉన్న మగవారు థైరాయిడ్ చికిత్సతో పాటు ఎరక్టైల్ డిస్‌ఫంక్షన్ (అంగస్తంభన లోపం), స్పెర్మ్ కౌంట్ తగ్గుదల వంటి వాటికి కూడా చికిత్స తీసుకోవాలి. మగవారిలో సంతానోత్పత్తి సమస్యలు ఉన్నప్పుడు సంబంధిత మూల కారణాలు తెలుసుకుని వాటన్నింటికీ చికిత్స అందించడం మేలు చేస్తుంది..’ డాక్టర్ వివరించారు.

‘మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం మెరుగుపరచడానికి థైరాయిడ్ విధులు సాధారణ స్థితికి వచ్చేలా చూడడం ముఖ్యం. ప్రత్యుత్పత్తికి సంబంధించిన హార్మోన్లన్నీ సమతులంగా ఉండేలా చూడాలి. అప్పుడు హెల్తీ స్పెర్మ్ ఉత్పత్తి అవుతుంది. తగిన చికిత్సతో మగవారిలో ఫర్టిలిటీ సామర్థ్యం మెరుగవుతుంది..’ అని వివరించారు.

నోవా ఐవీఎఫ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ అనిందిత సింగ్ ఈ అంశంపై పలు సూచనలు చేశారు. ‘థైరాయిడ్ హార్మోన్లు ఎక్కువగా ఉన్నా, లేదా తక్కువగా ఉన్నా టెస్టిస్ విధులపై ప్రభావం పడుతుంది. థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉంటే స్పెర్మ్ పరిమాణం, సాంధ్రత, చలనశీలత తగ్గుతుంది. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం, స్పెర్మ్‌లో నాణ్యత లేకపోవడం, వృషణాల పనితీరు మందగించడం, అంగస్తంభన సమస్యలు వంటివన్నీ థైరాయిడ్ నుంచి హార్మన్ల విడుదల తక్కవగా ఉండడం వల్ల వస్తాయి. మగవారిలో థైరాయిడ్ సమస్యలు ఉంటే అవి ఫర్టిలిటీ సామర్థ్యంపై ప్రభావం చూపుతాయి..’ అని వివరించారు. హైపర్‌థైరాయిడిజమ్, హైపోథైరాయిడిజం వల్ల దుష్పరిమాణాలను ఆమె వివరించారు.

హైపోథైరాయిడిజంతో సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం

థైరాయిడ్ గ్రంథి తన విధులను చురుగ్గా నిర్వర్తించలేకపోవడం. అంటే హార్మోన్ల విడుదల తక్కువగా ఉండడం హైపోథైరాయిడిజం. ఈ సమస్య ఉన్న మగవారిలో కనిపించే లక్షణాల్లో ప్రధానమైనవి జీవక్రియ మందగించడం, అలసట, బరువు పెరగడం. మగవారిలో హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఏర్పడుతాయి. స్పెర్మ్ వాల్యూమ్ తగ్గుతుంది. మొటిలిటీ(కదలిక) తగ్గుతుంది. స్పెర్మ్ ఆరోగ్యంగా ఉండదు. లిబిడో తగ్గుతుంది. అంగం స్తంభన సమస్యలు ఏర్పడుతాయి. మగవారి సంతానోత్పత్తి సామర్థ్యానికి అవసరమైన టెస్టోస్టిరాన్ వంటి హార్మోన్ల విడుదల తగ్గుతంది.

హైపర్ థైరాయిడిజంతో సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం

థైరాయిడ్ గ్లాండ్ అవసరానికి మించి చురుగ్గా పనిచేయడం వల్ల వచ్చే సమస్య ఇది. బరువు తగ్గడం, చెమట పట్టడం, గుండె దడ వంటి లక్షణాలు వీరిలో కనిపిస్తాయి. థైరాయిడ్ హార్మోన్ స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు దానికి గల కారణాలు కనుక్కునే ప్రయత్నం చేయాలి. థైరాయిడ్ ట్యూమర్లు, హాషిమోటోస్ థైరాయిడైటిస్ అనే రెండు కారణాలను వైద్యులు అనుమానిస్తాయి. హైపర్ థైరాయిడిజమ్‌ను థైరాయిడ్ అబ్లేషన్ థెరపీతో నయం చేస్తారు.

మగవారిలో సంతాన సామర్థ్యం మెరుగుపడేందుకు సూచనలు

మగవారిలో సంతాన సామర్థ్యం మెరుగుపడేందుకు డాక్టర్ అనిందిత సింగ్ కొన్ని సూచనలు చేశారు.

  1. సరైన డైట్: థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు మాంసాహారం తక్కువగా తినాలి. ప్రోటీన్ కోసం తేలికపాటి మాంసాహారాన్ని (మేక, గొర్రె మాంసం) తినొచ్చు. కూరగాయలు తినడం పెంచాలి. చిక్కుళ్లు, గింజ ధాన్యాలు ఆహారంగా తీసుకోవాలి.
  2. బరువును అదుపులో పెట్టుకోవాలి: మగవారిలో సంతాన సామర్థ్యానికి, అధిక బరువుకు సంబంధం ఉంది. అందువల్ల బరువును అదుపులో ఉంచుకోవాలి.
  3. శారీరకంగా చురుగ్గా ఉండాలి: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా స్పెర్మ్ క్వాలిటీ పెరుగుతుంది. మీపై ఉన్న ఒత్తిడి కూడా తగ్గుతుంది.

‘హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం రెండూ స్పెర్మ్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయి. అయితే మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యానికి థైరాయిడ్ సమస్య ఒక అసాధారణ కారణమనే చెప్పాలి. అనుమానాస్పద లక్షణాలు ఉన్నప్పుడు థైరాయిడ్ టెస్టులు చేయించుకోవడం మంచిదే. బరువు తగ్గడం, పెరగడం, ఎనర్జీ లెవెల్స్‌లో మార్పులు, చెమట పెట్టడం, గుండె దడ వంటి లక్షణాలు కనిపిస్తే థైరాయిడ్‌గా అనుమానించాలి..’ అని వివరించారు.

WhatsApp channel

టాపిక్