Fall Asleep Naturally । ప్రతిరోజూ వేళకు నిద్రపోవాలనుకుంటే ఈ చిట్కాలు పాటించండి!-know how much sleep is required and tips to fall asleep quickly naturally ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fall Asleep Naturally । ప్రతిరోజూ వేళకు నిద్రపోవాలనుకుంటే ఈ చిట్కాలు పాటించండి!

Fall Asleep Naturally । ప్రతిరోజూ వేళకు నిద్రపోవాలనుకుంటే ఈ చిట్కాలు పాటించండి!

HT Telugu Desk HT Telugu
Jan 08, 2023 09:00 PM IST

Tips to Fall Asleep Naturally: నిద్రలేమి చాలా తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. సరైన దినచర్యతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. సహజంగా నిద్రపట్టేందుకు కొన్ని చిట్కాలు పాటించండి.

Tips to Fall Asleep Naturally
Tips to Fall Asleep Naturally (Pixabay)

ఈరోజుల్లో నూటికి కనీసం ముప్పై మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారని వివిధ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మనిషికి తిండి ఎంత ముఖ్యమో, నిద్ర కూడా అంతే ముఖ్యం. రోజూవారీగా వివిధ రకాల ఆందోళనలు, దీర్ఘకాలికమైన పనివేళలు, ఇతర రకాల ఒత్తిళ్లతో సరైన నిద్ర పోవడం లేదు. 18 ఏళ్లు పైబడిన అందరికి ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల రాత్రి నిద్ర అవసరం. ఇది ఎక్కువైనా, తక్కువైనా అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా నడివయసులో నిద్ర సమస్యలతో బాధపడేవారికి దీర్ఘకాలిక వ్యాధులు, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.

మరోవైపు సరైన నిద్ర లేకపోవడం వల్ల వయసు 30 ఏళ్లు దాటిన వారిలో కూడా అధిక రక్తపోటు, ఊబకాయం, గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని తేలింది.

రక్తంలో ఇన్‌ఫ్లమేటరీ సైటోకిన్‌ల పరిమాణం పెరిగితే నిద్రలేమితో బాధపడేవారిలో గుండె జబ్బులు, మరణాలు సంభవించే అవకాశం ఉందని కార్డియాలజిస్టులు అంటున్నారు. దీర్ఘకాలం పాటు కొనసాగే నిద్రలేమి సమస్య అనారోగ్యకరమైన ఇతర అలవాట్లకు కారణమవుతుంది. ఫలితంగా వ్యక్తుల్లో ఉత్పాదకశక్తి తగ్గిపోతుంది, ఎల్లప్పుడూ నీరసంగా ఉంటారు, జ్ఞాపకశక్తి మందగిస్తుంది. కోపం-చిరాకు పెరుగుతాయి. ఆహరపు అలవాట్లు మారతాయి, ఇవన్నీ తీవ్రమైన వ్యాధులకు దారితీస్తాయి. గుండె ఆరోగ్యం కోసం 7-8 గంటల పాటు అవాంతరాలు లేని నాణ్యమైన నిద్ర అలవాటును అనుసరించాలని కార్డియాలజిస్టులు సిఫార్సు చేస్తున్నారు.

Tips to Fall Asleep Naturally - రాత్రి త్వరగా నిద్రపట్టేందుకు కొన్ని చిట్కాలు

రాత్రివేళలో నిద్రరావటానికి నిపుణులు కొన్ని చిట్కాలను సూచించారు, అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.

- నిద్రవేళకు కనీసం 6 గంటల ముందు కెఫీన్ లేదా కార్బోనేటేడ్ పానీయాలు తాగకుండా ప్రయత్నించండి.

- రోజుకు 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోతే ఈ సమయాన్ని తగ్గించండి

- రాత్రి భోజనం తర్వాత ల్యాప్ టాప్, టీవీలు, మొబైల్‌తో సహా గాడ్జెట్‌లకు దూరంగా ఉండండి.

- మీ రోజువారీ జీవితంలో ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండండి.

- ధ్యానం మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది, బాగా నిద్రపట్టేందుకు సహాయపడుతుంది. కాబట్టి ఉదయం లేదా సాయంత్రం ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి.

- నిద్రవేళకు ముందు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి. పుస్తక పఠనం ద్వారా ప్రశాంతంగా నిద్రపోవచ్చు.

- మీ పడకగది లేదా ప్రదేశం నిద్రకు భంగం కలిగించే శబ్దాలు లేకుండాచూసుకోండి.

- మీరు పడుకునే బెడ్ మరియు మీరు ఉపయోగించే దిండు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోండి.

- పడుకునే ముందు మజ్జిగ, నారింజ పండు వంటి పుల్లని పదార్ధాలను పరిమితిలో తీసుకోవాలి

మధ్యాహ్నం వేళలో అరగంటకు మించి నిద్రపోవడం మానుకోండి. రోజూవారీగా ఒకే రకమైన నిద్ర ప్రణాళికను కలిగి ఉండటం వలన నిద్రలేమి సమస్యలు దూరమవుతాయి. మీకు తీవ్రమైన, దీర్ఘకాలిక నిద్ర సమస్యలు ఉంటే వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించండి.

WhatsApp channel

సంబంధిత కథనం