తెలుగు న్యూస్  /  Lifestyle  /  Ganesh Chaturthi 2022 Special Story On Vinayaka Vrata Story In Telugu

Ganesh Chaturthi: వినాయక వ్రత కథ విన్నా.. చదివినా.. అపనిందలు దరిచేరవట.. మీరు చదివేయండి..

31 August 2022, 6:28 IST

    • Vinayaka Vratha Katha: వినాయక చవితి వచ్చేసింది. ఇప్పటికే అందరూ పూజా పనుల్లో నిమగ్నైపోయారు. ఈరోజు చేసే వినాయక పూజలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వినాయక వ్రత కథ గురించి. ఈ కథను చదివినా, విన్నా.. నీలాపనిందలకు దూరంగా ఉండొచ్చని శ్రీకృష్ణుడు తెలిపాడు. మరి కథేంటో ఇప్పుడు తెలుసుకుని.. నిందలకు దూరంగా ఉందాం.
వినాయక వ్రత కథ
వినాయక వ్రత కథ

వినాయక వ్రత కథ

Vinayaka Vratha Katha : వినాయక చవితి రోజు కచ్చితంగా వినాయక వ్రత కథ చదవాల్సిందే. లేదా వినాల్సిందే అంటున్నారు పండితులు. దీని వల్ల భక్తులు సకల సౌభాగ్యాలు పొందుతారని భావిస్తారు. వినాయక వ్రతకథ చదివేవారు.. లేదా పూజలో కూర్చునేవారు ముందుగా చేతిలో కొద్దిగా అక్షింతలు తీసుకోవాలి. కథ పూర్తైన తర్వాత వాటిని తమ శిరస్సుపై వేసుకోవాలి.

ఇప్పుడు కథలోకి వెళ్దాం..

పురణాల ప్రకారం... తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరునికి.. శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తోంది. పతి రాక కోసం ఎదురుచూస్తూ.. స్నానానికి సిద్ధమైంది. దీనిలో భాగంగా.. ఒంటికి నలుగుపిండిని అద్దుకుంది. ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారుచేసింది. చూడముచ్చటైన ఆ రూపం చూసి పార్వతికి ముచ్చటేసింది. తన తండ్రి ఉపదేశించిన మంత్రంతో పార్వతి ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసింది. ముద్దుగా ఉన్న బాలుడిని చూసి మురిసిపోయి.. బాలుని వాకిట కాపలాగా ఉంచి పార్వతి స్నానానికి వెళ్లింది.

విముక్తి పొందిన శివుడు అంతలో అక్కడికి రాగా.. బాలుడు తన తల్లి స్నానం చేస్తుందని.. లోపలికి వెళ్లడానికి వీలు లేదని శివుని అడ్డుకుంటాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు.. ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండిస్తాడు. బాలుడి అరుపు విన్న పార్వతీ దేవి.. జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు.

అతడి శక్తి సామర్థ్యాలను చూసి.. పరిశీలించి భాద్రపద శుద్ధ చవితినాడు గణాధిపత్యం కట్టబెట్టాడు శివుడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్లు, కుడుములు, పిండివంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడు నడవటానికి ఇబ్బందిపడుతూ కైలాసం చేరుకున్నాడు. వినాయకుని అవస్థలు చూసిన చంద్రుడు ఒకేసారి నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయని అంటారు. అలాగే చంద్రుని దృష్టి సోకి విఘ్ననాధుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్లు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతి దేవి.. పాపాత్ముడా నీ దృష్టిసోకి నా కుమారుడు అచేతనంగా పడివున్నాడు. కాబట్టి నిన్ను చూసివారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురు గాక అని శపించింది.

ఋషి పత్నులకు నీలాపనిందలు

పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ.. అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక, శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది. అగ్ని దేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు వారిని విడిచిపెట్టారు.

శాపగ్రస్థుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలపాలయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వతీదేవితో అమ్మా నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది. ఆ శాపాన్ని ఉపసంహరించుకుంటే బాగుంటుందని బ్రహ్మ కోరగా.. అప్పుడు పార్వతీదేవి దానిని సవరించింది. ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుడిని చూడకూడదని శాపాన్ని సవరించింది. ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుడిని చూడకుండా జాగ్రత్తగా ఉండి, సుఖంగా ఉన్నారు. ఇలా శ్రీకృష్ణుడు కూడా వినాయక చవితి రోజు చంద్రుడిని చూసి నీలాపనిందలకు గురయ్యాడు.

శ్రీకృష్ణుడికి తప్పలేదు..

సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడిని శ్రీకృష్ణుడే చంపి శమంతకమణిని అపహరించాడని.. సత్రాజిత్తు నిందించాడు. భాద్రపద శుద్ధ చవితిరోజు చంద్రబింబాన్ని చూడడం వల్లే ఈ నింద పడిందని శ్రీకృష్ణుడు అనుకున్నాడు. కానీ శ్రీకృష్ణుడు శమంతకమణిని వెతికి తెచ్చి.. తనపై పడిన నిందను పోగొట్టుకున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మావంటి వారికి ఏది గతి అని శ్రీకృష్ణుడిని ప్రశ్నించగా.. భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా వినాయకుని పూజించి.. ఈ శమంత కోపాఖ్యానాన్ని విని అక్షితలు తలపై వేసుకునే వారికి.. ఆరోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు.

ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితిరోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లు గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ కథను చదివి, విని తలపై అక్షతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి.