Bollywood To Tollywood: టాలీవుడ్ సినిమాల్లో బాలీవుడ్ స్టార్స్ - తెలుగుతెరపై మెరవనున్న హిందీ టాప్ యాక్టర్స్ వీళ్లే
10 May 2023, 7:11 IST
Bollywood Stars in Telugu Movies: ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలు నటిస్తోన్నకొన్ని సినిమాల్లో బాలీవుడ్ అగ్ర నటులు కీలక పాత్రలను పోషిస్తోన్నారు. ఆ యాక్టర్స్ ఎవరంటే...
కొరటాల శివ, సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్
Bollywood Stars in Telugu Movies: ఇదివరకు బాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు దక్షిణాది నాయకానాయికలు ఆసక్తిని చూపించేవారు. బాలీవుడ్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కోసం ఎదురుచూసేవారు హిందీ సినిమాల్లో నటించడమే గ్రేట్ అఛీవ్మెంట్గా ఫీలయ్యేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్సైంది.
తెలుగు సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోండటంతో టాలీవుడ్లో అవకాశాల కోసం బాలీవుడ్‌తో పాటు ఇతర భాషలకు చెందిన అగ్ర నటీనటులు క్యూ కడుతోన్నారు. తెలుగు పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు. ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోలు చేస్తోన్న పలు సినిమాల్లో కీలక పాత్రల్లో బాలీవుడ్ అగ్ర నటులు కనిపించబోతున్నారు. ఆ సినిమాలు ఏవంటే...
అటు ప్రభాస్...ఇటు ఎన్టీఆర్
ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తోన్నాడు. ఇటీవలే హైదరాబాద్‌లో జరిగిన షెడ్యూల్‌తో సైఫ్ అలీఖాన్ ఈ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టాడు. ఇందులో ఎన్టీఆర్‌కు ధీటుగా పవర్ఫుల్ విలన్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తోన్నట్లు సమాచారం.
కోస్టల్ ఏరియా బ్యాక్‌డ్రాప్ కథాంశంతో రూపొందుతోన్న ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఎన్టీఆర్ మూవీతో పాటు ప్రభాస్ ఆదిపురుష్‌లోనూ సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రను పోషిస్తోన్నాడు. ఈ రెండు సినిమాలతో తెలుగు తన స్థానాన్ని పదిల పర్చుకునే ఆలోచనలో సైఫ్ అలీఖాన్ ఉన్నట్లు సమాచారం.
ప్రాజెక్ట్ కే మూవీలో అమితాబ్‌బచ్చన్
ప్రభాస్ హీరోగా సూపర్ హీరో కథాంశంతో రూపొందుతోన్న ప్రాజెక్ట్ కే మూవీలో బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్‌బచ్చన్ కీలక పాత్రను పోషిస్తోన్నాడు. ప్రభాస్ గురువు పాత్రలో అమితాబ్‌బచ్చన్ కనిపించబోతున్నట్లు సమాచారం.
తెలుగులో ఫుల్ లెంగ్త్ రోల్లో అమితాబ్‌బచ్చన్ నటిస్తోన్న తొలి సినిమా ప్రాజెక్ట్ కే కావడం గమనార్హం. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే ప్రభాస్ మారుతి కాంబినేషన్లో రూపొందుతోన్న కొత్త సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ నటిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ తాత పాత్రలో సంజయ్ దత్ కనిపించబోతున్నట్లు సమాచారం.
సైంధవ్ నవాజుద్ధీన్ సిద్ధిఖీ
వెంకటేష్, డైరెక్టర్ శైలేష్ కొలను కాంబోలో సైంధవ్ పేరుతో యాక్షన్ ఎంటర్టైనర్గా మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్ధీన్ సిద్ధిఖీ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ కు పోటాపోటీగా నవాజుద్ధీన్ క్యారెక్టర్ ఉంటుందని సమాచారం.
అలాగే పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమాలో బాలీవుడ్ అగ్ర నటుడు బాబీ డియోల్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో నటిస్తోన్నాడు. ఈ సినిమాలో అతడు ఔరంగజేబుగా కనిపించబోతున్నట్లు తెలిసింది. బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాతో బాలీవుడ్ సీనియర్ నటుడు అర్జున్ రాంపాల్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వీరితో పాటు మరికొందరు బాలీవుడ్ అగ్ర నటులు తెలుగులో నటిస్తోన్నారు.