Laapataa Ladies Review: ఆమిర్ ఖాన్ నిర్మించిన ఈ సెటైరికల్ కామెడీ మూవీ ఆకట్టుకునేలా ఉందా? లాపతా లేడీస్ రివ్యూ
04 May 2024, 15:53 IST
- Laapataa Ladies Review: లాపతా లేడీస్ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యాక సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీపై భారీగా ప్రశంసలు వస్తున్నాయి. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకోండి.
Laapataa Ladies Review: ఆమిర్ ఖాన్ నిర్మించిన ఈ సెటైరికల్ కామెడీ మూవీ ఆకట్టుకునేలా ఉందా? లాపతా లేడీస్ రివ్యూ
సినిమా: లాపతా లేడీస్ (హిందీ), స్ట్రీమింగ్: నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ
ప్రధాన నటీనటులు: స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్, ప్రతిభ రంట, రవికిషన్, ఛాయా కదమ్, దుర్గేశ్ కుమార్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: రామ్ సంపత్
నిర్మాతలు: ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్, జ్యోతీ దేశ్‍పాండే
దర్శకత్వం: కిరణ్ రావ్
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకురాలిగా రెండో సినిమాను ‘లాపతా లేడీస్’ పేరుతో తెరకెక్కించారు. ఈ కామెడీ సైటెరికల్ ఫీల్‍గుడ్ మూవీ నిర్మాణంలో ఆమిర్ ఖాన్ కూడా భాగస్వామ్యమయ్యారు. మార్చి 1వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది. అయితే, ఇటీవలే ఏప్రిల్ 26న ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఓటీటీలోకి వచ్చాక నెటిజన్ల నుంచి చాలా మంది సెలెబ్రిటీల వరకు ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ లాపతా లేడీస్ సినిమా ఎలా ఉందో ఇక్కడ చూడండి.
లాపతా లేడీస్ సినిమా స్టోరీ
2001 సంవత్సరం బ్యాక్‍డ్రాప్‍లో ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. దీపక్ కుమార్ (స్పర్శ్ శ్రీవాత్సవ), పూల్ కుమారి (నితాన్షి గోయల్)కు వివాహం అవుతుంది. ఆ తర్వాత దీపక్ సొంత ఊరికి వెళ్లేందుకు వారిద్దరూ ఓ రైలు ఎక్కుతారు. అదే ట్రైన్‍లో కొత్తగా పెళ్లయిన మరికొన్ని జంటలు ఉంటాయి. కొత్త పెళ్లి కూతుళ్లందరూ ముఖానికి ముసుగు వేసుకొని.. దాదాపు ఒకే రకమైన దుస్తులు ధరించి ఉంటారు. కొత్తగా పెళ్లయిన పుష్ప రాణి అలియాజ్ జయ (ప్రతిభ రంట) వద్ద రైలులో దీపక్ కుమార్, పూల్ కూర్చుంటారు. అయితే, దిగాల్సిన స్టేషన్ వచ్చిన తొందరలో రాత్రి వేళ పూల్‍ను కాకుండా పుష్ప రాణిని దీపక్ తీసుకెళతాడు. ముసుగు ఉండటంతో దీపక్‍ను పుష్ప చూడలేకపోతుంది. అయితే, గ్రామానికి వెళ్లిన తర్వాత ఆమె పూల్ కాదు.. పుష్పరాణి అని తెలుసుకొని దీపక్, వారి కుటుంబ సభ్యులు షాక్ అవుతారు. పూల్ కోసం దీపక్ వెతుకుతాడు. పూల్ ఓ రైల్వే స్టేషన్‍లో దిగి దిక్కుతోచని పరిస్థితులో ఉంటుంది. అసలు ఈ పుష్పరాణి ఎవరు? పూల్‍కు ఏమైంది? దీపక్‍కు ఆమె దొరికిందా? ఈ క్రమంలో ఎదురైన పరిస్థితులు ఏంటి? ఈ కథలో ఇన్‍స్పెక్టర్ శ్యామ్ మనోహర్ (రవికిషన్) పాత్ర ఏంటి? అనేవే ఈ సినిమాలో చూడాలి.
నవ్విస్తూనే.. సెటైరికల్‍గా..
సమాజంలో కట్టుబాట్లు, ఆచారాలు, కుటుంబ గౌరవం పేర్లతో అమ్మాయిల ఆకాంక్షలు, లక్ష్యాలు, సంతోషాలు ఎలా అణచివేతకు గురవుతున్నాయో ఈ మూవీలో దర్శకురాలు కిరణ్ రావ్ చూపించారు. పెళ్లి చేసుకొని అత్తవారింట్లో సేవలు చేసేందుకు అమ్మాయిలు ఉన్నారని గ్రామీణ ప్రాంతాల్లోని కొందరు కుటుంబ సభ్యులు ఎలా ఆలోచిస్తారోననే అంశాన్ని కూడా బలంగా తెరకెక్కించారు. పూల్, పుష్పరాణి అలియాజ్ జయ పాత్రలతో ఈ విషయాన్ని గట్టిగా చెప్పారు. ప్రపంచాన్ని చూడకుండా, ఏమీ తెలుసుకోకుండా వారిని ముసుగు వెనుకే దాచేస్తున్నారని చూపించారు. తన భర్త ఊరి పేరు కూడా గుర్తులేదని, వంట చేయడం మాత్రమే తన ఇంట్లో వాళ్లు నేర్పించారని పూల్ చెప్పడం ఆమె లాంటి అమాయక మహిళలను గుర్తు చేస్తుంది. లాపతా లేడీస్ అంటే తెలుగులో తప్పిపోయిన మహిళలు అనే అర్థం వస్తుంది. అయితే, మహిళల జీవితాల్లో ఏదో తప్పిపోయిందనే అర్థంతోనూ ఈ మూవీకి టైటిల్ పెట్టారనిపిస్తుంది. ఈ చిత్రంలో కొన్ని సీన్లు ఎంతో ఆలోచింపజేస్తాయి. డైలాగ్స్ కూడా అర్థవంతంగా ఉంటాయి. మంజు మాయ్ (ఛాయా కదమ్) చెప్పే కొన్ని డైలాగ్స్ మనసును సూటిగా తాకుతాయి.
అయితే, ఈ సీరియస్ అంశాలను ఎంటర్‌టైనింగ్‍గా తెరకెక్కించారు డైరెక్టర్ కిరణ్ రావ్. ఎక్కువ మందికి ఈ మూవీలోని సందేశం వెళ్లేందుకు ఇది కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ మూవీ ఎక్కువ శాతం సరదాగానే ఉంటుంది. అయితే, కామెడీ అంతా ఆర్గానిక్‍గా కథలోనే లీనమై ఉంటుంది. కావాలనే కల్పించినట్టుగా అనిపించదు. సమాజంపై సెటైర్‌ను ఎంటర్‌టైనింగ్‍గా, మనసులకు హత్తుకునేలా చూపించడంలో దర్శకురాలు సక్సెస్ అయ్యారు. పూల్‍కు దీపక్ ఐలవ్యూ చెప్పే సీన్ హృదయాన్ని తాకుతుంది. ఈ మూవీలో కాస్త సస్పెన్స్ కూడా అనిపిస్తుంది.
ఈ అంశాలను తెరకెక్కించేందుకు 2001 కాలాన్ని తీసుకోవడం కూడా చాలా ప్లస్ అయింది. అప్పుడప్పుడే మొబైల్స్ వస్తుండడం, రైళ్లు చిన్నచిన్న స్టేషన్లలో ఆగడం ఇలా ఈ కథకు ఆ సమయం సరిగ్గా సూటైంది.
ఆఖర్లో ఎమోషనల్‍గా..
లాపతా లేడీస్ సినిమా ఎక్కువగా సరదాగానే సాగుతుంది. అయితే, చివరి 20 నిమిషాలు ఈ మూవీకి మరింత బలాన్ని తెచ్చిపెడతాయి. ఎమోషనల్‍గా సాగుతుంది. మనసుకు తాకేలా సీన్లు ఉంటాయి. ఆలోచింపజేస్తాయి. ఈ కథను ఎలా చెప్పాలనుకున్నారో పర్‌ఫెక్ట్‌గా చెప్పారు డైరెక్టర్ కిరణ్ రావ్. విప్లవ్ గోస్వామి ఈ మూవీకి కథ అందించారు.
నటీనటులు ఇలా..
పుష్పరాణి అలిజాయ్ జయ పాత్రలో ప్రతిభ రంట అద్భుతంగా నటించారు. ఆమె పాత్ర హైలైట్‍గా నిలిస్తుంది. ఈ క్యారెక్టర్‌ను చాలా బలంగా రాశారు రైటర్. పూల్ కుమారి పాత్రలో అమాయకంగా తన నటనతో నితాన్షి గోయెల్ కూడా మెప్పించారు. దీపక్ కుమార్‌గా స్పర్శ్ శ్రీవాత్సవ యాక్టింగ్ సూపర్‌గా అనిపిస్తుంది. ఎమోషనల్‍గా చేశారు. వీరంతా దాదాపు కొత్తవారే అయినా నటనతో మెప్పించారు. ఇన్‍స్పెక్టర్ శ్యామ్ మనోహర్‌గా చేసిన సీనియర్ యాక్టర్ రవికిషన్ కూడా తన విభిన్న డైలాగ్ డెలివరీ, యాక్టింగ్‍తో అదరగొట్టారు. ఛాయా కదమ్‍ది కూడా బలమైన పాత్రే. మిగిలిన నటీనటులు కూడా తన పరిధి మేర నటించారు. అందరి యాక్టింగ్ కూడా సహజంగా అనిపిస్తుంది.
ఈ సెటైరికల్ మూవీని ఎంటర్‌న్‍మెంట్‍తో పాటు ఫీల్‍గుడ్‍లా, ఎమోషనల్‍గా తెరకెక్కించడంతో డైరెక్టర్ కిరణ్ రావ్ పూర్తిగా సఫలమయ్యారు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా కథనం సాగినట్టు అనిపించినా.. కాసేపటికే సినిమాలో లీనమైపోతాం. రామ్ సంపత్ సంగీతం, సినిమాటోగ్రాఫర్ వికాస్ నౌలఖా కెమెరాపనితనం కూడా మెప్పిస్తుంది.
మనసుకు సంతృప్తినిస్తుంది
మొత్తంగా.. లాపతా లేడీస్ సినిమా మెప్పించేలా ఉంది. అందరినీ ఆకట్టుకుంటుంది. లోతైన సీరియస్ విషయాలను ఎంటర్‌టైనింగ్‍గా తెరకెక్కించడంతో ఎక్కడా బోర్ కొట్టదు. పాఠాలు చెబుతున్నట్టు ఉండదు. మొదట్లో కాస్త స్లో అనిపించినా.. కాసేపటికే ఈ సినిమా ఎంగేజ్ చేస్తుంది. చివరి వరకు ఆసక్తికరంగా ఉంటుంది. మంచి సినిమా చూశామన్న సంతృప్తి మనసుకు కలుగుతుంది. కుటుంబంతో కలిసి చూస్తే మరింత బాగుంటుంది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రాన్ని మిస్ అవొద్దండి.
రేటింగ్: 3.75/5
టాపిక్