తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Epf Rule Change: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త; విత్ డ్రాయల్ నిబంధనల్లో కీలక మార్పు

EPF rule change: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త; విత్ డ్రాయల్ నిబంధనల్లో కీలక మార్పు

HT Telugu Desk HT Telugu

18 April 2024, 12:30 IST

  • EPFO withdrawal Limit: ఈపీఎఫ్ఓ చందాదారులకు శుభవార్త. విత్ డ్రాయల్ నిబందనల్లో ఈపీఎఫ్ఓ కీలక మార్పు చేసింది. వైద్య చికిత్స కోసం ఈపీఎఫ్ ఖాతా నుంచి నగదును విత్ డ్రా చేసుకునే పరిమితిని రూ. 50 వేల నుంచి రూ. 1 లక్షకు పెంచారు.

ఈపీఎఫ్ విత్ డ్రాయల్ పరిమితి పెంపు
ఈపీఎఫ్ విత్ డ్రాయల్ పరిమితి పెంపు

ఈపీఎఫ్ విత్ డ్రాయల్ పరిమితి పెంపు

EPFO withdrawal Limit increase: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రస్తుతం ఉన్న 68జే క్లెయిమ్ ల అర్హత పరిమితిని రూ.50,000 నుంచి రూ.లక్షకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. విత్ డ్రాయల్ అర్హత పరిమితిని రూ.50,000 నుంచి రూ.లక్షకు పెంచడానికి సంబంధించి ఈ ఏప్రిల్ 10వ తేదీన అప్లికేషన్ సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసింది. ఈ నిబంధన మార్పుకు సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఆమోదం లభించిందని తెలిపింది.

వైద్య చికిత్స కోసం రూ. 1 లక్ష

ఈపీఎఫ్ (EPFO) పాక్షిక ఉపసంహరణను ఫారం 31 ద్వారా అనేక ప్రయోజనాల కోసం అనుమతిస్తారు. వివాహ ఖర్చులు, రుణాలు చెల్లించడం, ఫ్లాట్ కొనుగోలు, ఇంటి నిర్మాణం.. మొదలైన అవసరాలకు, నిబంధనలకు లోబడి, ఈపీఎఫ్ నుంచి నగదును పాక్షికంగా ఉపసంహరించుకోవచ్చు. తాజాగా, 68 జే కింద ఉపసంహరణ పరిమితిని పెంచారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతా నుండి చందాదారుడు లేదా అతడి కుటుంబ సభ్యుల అనారోగ్య చికిత్స కోసం అడ్వాన్సులను క్లెయిమ్ చేయవచ్చు. ఇందుకు ఇప్పటివరకు రూ. 50వేల పరిమితి ఉండేది. తాజాగా, ఈ పరిమితిని రూ. 1 లక్షకు పెంచారు. లక్ష రూపాయల పరిమితికి లోబడి, చందాదారులు 6 నెలల మూల వేతనం, డీఏ (లేదా వడ్డీతో ఉద్యోగి వాటా) లో ఏది తక్కువైతే దానిని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫారం 31తో పాటు ఉద్యోగి, డాక్టర్ సంతకం చేసిన సర్టిఫికేట్ సీ ని కూడా సమర్పించాల్సి ఉంటుంది.

ఫారం 31 అంటే ఏమిటి?

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPFO) అకౌంట్ నుంచి, వివిధ అవసరాల కోసం నగదును ఉపసంహరించుకోవడానికి ఈపీఎఫ్ ఫారం 31ను సమర్పించాల్సి ఉంటుంది. ఫారం 31 ద్వారా ఇల్లు/ఫ్లాట్ కొనుగోలు, పేరా 68బీ కింద స్థలం కొనుగోలుతో సహా ఇంటి నిర్మాణం, పేరా 68బీబీ కింద ప్రత్యేక కేసుల్లో రుణం తిరిగి చెల్లించడం, పేరా 68 హెచ్ కింద ప్రత్యేక కేసుల్లో అడ్వాన్స్ లు మంజూరు చేయడం, పేరా 68కె కింద పిల్లల వివాహాలు లేదా పోస్ట్ మెట్రిక్యులేషన్ విద్య కోసం, పేరా 68 ఎన్ కింద శారీరక వికలాంగులకు అడ్వాన్స్ మంజూరు.. వంటి ఉపసంహరణలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పేరా 68ఎన్ఎన్ కింద పదవీ విరమణకు ఏడాది ముందు పాక్షిక నగదు ఉపసంహరణకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పేరా 68 జె కింద వైద్య చికిత్సల కోసం.

తాజాగా, 68 జే కింద చందాదారులు లేదా వారి కుటుంబ సభ్యుల అనారోగ్య చికిత్స కోసం ఈపీఎఫ్ (EPFO) ఖాతా నుంచి, నిబంధనలకు లోబడి, రూ. 1 లక్ష వరకు నగదును ఉపసంహరించుకోవచ్చు. ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగానికి మారినప్పుడు ఈపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ కూడా ఆటోమేటిక్ గా ట్రాన్ ఫర్ చేసే సదుపాయాన్ని ఈపీఎఫ్ఓ ఇటీవల ప్రారంభించింది.