తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ttd Trust Board Key Decisions On Special Darsh Tickets And Timings

Tirumala Brahmotsavam: బ్రేక్‌ దర్శనాల్లో మార్పులు... టీటీడీ తాజా నిర్ణయాలివే

HT Telugu Desk HT Telugu

24 September 2022, 19:30 IST

    • Tirumala Tirupati Devasthanams Trust Board: టీటీడీ ధర్మకర్తల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. బ్రహ్మోత్సవాల సమయంలో బ్రేక్‌ దర్శనాల్లో మార్పులు చేసినట్లు ప్రకటించారు. టీటీడీకి సంబంధించిన 960 స్థిర ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసినట్లు తెలిపారు.
టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు (ఫైల్ ఫొటో)
టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు (ఫైల్ ఫొటో) (twitter)

టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు (ఫైల్ ఫొటో)

ttd governing council decisions: తిరుమల బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలకు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండ‌డంతో విభాగాల వారీగా చేప‌ట్టిన పనులపై అధికారులు సమీక్షలు కూడా జరుపుతున్నారు. మరోవైపు శనివారం టీటీడీ ధర్మకర్తల మండలి భేటీ అయింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణ, తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని బ్రహ్మోత్సవాల సమయంలో బ్రేక్‌ దర్శనాల్లో మార్పులు చేసినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ప్రయోగాత్మకంగా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు బ్రేక్‌ దర్శనాలు ఉంటాయని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల అనంతరం టైమ్‌స్లాట్‌ టోకెన్ల జారీ ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. తిరుమల గదుల కేటాయింపులోనూ మార్పులు చేశామని... గదుల కేటాయింపు తిరుపతిలోనే చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టీటీడీ ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేశామని ప్రకటించారు. పూర్తి స్ధాయిలో బ్రేక్ దర్శనాలపై ప్రయోగాత్మకంగా పరిశీలించిన తరువాత అమలు చేస్తామని వెల్లడించారు.

మిగతా నిర్ణయాలు...

తిరుమలలోని గదుల్లో గీజర్‌లు ఏర్పాటుకు నిధులు విడుదల

టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాల కోసం 300 ఎకరాలు ప్రభుత్వం నుండి ఇదివరకే కొనుగోలు చేసాంమని, భవిష్యత్తు అవసరాల కోసం రూ.25 కోట్లతో మరో 130 ఎకరాలు కొనుగోలు చేస్తారు.

గోవర్థన సత్రాల వెనుక భాగంలో 95 కోట్లతో పీఏసీ-5 నిర్మించాలని నిర్ణయం

తిరుమలలో సామన్య భక్తులకు వసతి సదుపాయం పెంచుతూ నిర్ణయం

వకూళమాత ఆలయం నుండి జూపార్క్ వరకు 30 కోట్లతో కనెక్టివిటీ రింగ్ రోడ్డు నిర్మాణం

ఈవో సమీక్ష

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలకు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండ‌డంతో విభాగాల వారీగా చేప‌ట్టిన ఏర్పాట్ల‌పై టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి సమీక్షించారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం ఈ సమీక్ష జ‌రిగింది.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రెండేళ్ల తర్వాత మాడ వీధుల్లో భ‌క్తుల స‌మ‌క్షంలో వాహ‌న‌సేవ‌లు జ‌రుగ‌నున్నాయ‌ని తెలిపారు. ప్రతి ఉద్యోగీ బాధ్యతగా తమ విధులు నిర్వ‌హించాల‌ని కోరారు. విశేషంగా భ‌క్తులు విచ్చేసే అవ‌కాశం ఉండ‌డంతో ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని, అక్టోబర్ 1న గరుడ సేవ నాడు మ‌రింత అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు.

<p>పనులను పరిశీలిస్తున్న ఈవో ధర్మారెడ్డి</p>

సెప్టెంబరు 28న ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్న అన్నప్రసాదం కాంప్లెక్స్‌కు ఆనుకుని నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని ఈవో పరిశీలించారు. ముఖ్య‌మంత్రి ప‌ర్య‌టన సంద‌ర్భంగా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు.

ముఖ్య తేదీలివే…..

tirumala brahmotsavam 2022 dates: తిరుమ‌ల‌లో రెండేళ్ల తర్వాత భక్తుల సమక్షంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వ‌హించేందుకు టిటిడి స‌మాయ‌త్త‌మ‌వుతోంది. సెప్టెంబ‌రు 27 నుండి అక్టోబ‌రు 5వ తేదీ వ‌ర‌కు ఆల‌య మాడ వీధుల్లో వాహ‌న‌సేవ‌లు జ‌రుగ‌నున్నాయి.

-సెప్టెంబర్ 26న రాత్రి 7 నుండి 8 గంట‌ల మ‌ధ్య‌ అంకురార్పణ చేస్తారు. సెప్టెంబరు 27న మొద‌టి రోజు సాయంత్రం 5.15 నుండి 6.15 గంట‌ల వ‌ర‌కు ధ్వజారోహణం, రాత్రి 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు పెద్ద శేష వాహనంపై ఊరేగింపు ఉంటుంది.

-సెప్టెంబరు 28న రెండో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు చిన్నశేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు హంస వాహనంపై విహరిస్తారు.

-సెప్టెంబర్ 29న మూడో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు సింహ వాహనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు ముత్యపు పందిరి వాహనంపై ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు.

-సెప్టెంబర్ 30న నాలుగో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు సర్వభూపాల వాహనంపై దర్శనమిస్తారు.