తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Cm Chandrababu : మరోసారి ఏపీ ముఖ్యమంత్రిగా 'చంద్రబాబు' - రాజకీయ ప్రస్థానంలోని ముఖ్య విషయాలివే..!

AP CM Chandrababu : మరోసారి ఏపీ ముఖ్యమంత్రిగా 'చంద్రబాబు' - రాజకీయ ప్రస్థానంలోని ముఖ్య విషయాలివే..!

12 June 2024, 6:56 IST

google News
    • TDP Chief Chandrababu Naidu : నవ్యాంధ్రకు టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రిగా సేవలు అందించనున్నారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆయన... ఇవాళ ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు

AP Chief Minister Chandrababu Naidu : ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కేసరపల్లిలోని ఐటీటవర్‌ వద్ద ఉదయం 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబుతో గవర్నర్ ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

ప్రధానమంత్రి మోదీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రధాన సభ వేదిక వద్దకు రాకపోకలు, గవర్నర్ రాకపోకల కాన్వాయ్ కు ఎలాంటి అడ్డంకులు లేకుండా పకడ్బందీగా ప్రణాళికా బద్దంగా ఏర్పాట్లు చేపట్టారు. ప్రధాన వేదికతో పాటు వివిధ ప్రయాణ మార్గాలు, పార్కింగ్ ప్రదేశాలు అన్నిచోట్ల సీసీటీవీ ఏర్పాట్లు చేశారు. వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన మందులు అంబులెన్స్ సిద్ధంగా ఉంచారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ లింక్ ద్వారా అన్ని జిల్లాలలో ప్రజలు వీక్షించేందుకు వీలుగా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాట్లు చేశారు.

చంద్రబాబు ప్రస్థానం,...

చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో ఓ సాధారణ రైతు ఇంట జన్మించారు. డిగ్రీ చదివే రోజుల్లోనే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. పీజీ చేసే రోజుల్లోనే రాజకీయంగా క్రియాశీలక అడుగులు వేశారు. కృష్ణా జిల్లా దివిసీమ ఉప్పెన సమయంలో చంద్రబాబు నాయకత్వంలో చేపట్టిన సహాయక చర్యలు ఆయన నాయకత్వ పటిమకు బాటలు పడ్డాయి.

  • చంద్రబాబు మొదటగా యూత్ కాంగ్రెస్‌లో చేరారు. 1978 ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు చంద్రబాబు. జనతా పార్టీ నుంచి బలమైన అభ్యర్థిగా ఉన్న పట్టాభి చౌదరిని ఓడించి 26 ఏళ్ల ప్రాయంలోనే ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు చరిత్ర సృష్టించారు.
  • కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. NTR కుమార్తె భువనేశ్వరిని చంద్రబాబు పెళ్లి చేసుకున్నారు.
  • తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో 1982లో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించారు. ఈ సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ లోనే కొనసాగారు.
  • 1983 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మరోసారి చంద్రబాబు పోటీచేసి ఓడిపోయారు. ఆ తరువాత ఏడాదిలోనే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో అత్యంత క్రియాశీలకంగా మారారు.
  • తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్న అనేక రాజకీయ సంక్షోభాలను తిప్పికొట్టడంలో చంద్రబాబు తన మార్క్ ను చూపించారు.
  • 1995లో మొదటిసారిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. పరిపాలనలో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ కార్యాలయాలకే పరిమితమైన ఉద్యోగులను ప్రజల వద్దకు పాలన పేరుతో క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లారు. జన్మభూమి, శ్రమధానం వంటి వినూత్న నిర్ణయాలతో పాలనలోనూ ప్రత్యేక గుర్తింపు సాధించారు.
  • 1996లో యునైటెడ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడంలో చంద్రబాబు కీలకంగా పనిచేశారు. ఈ సమయంలో కేంద్రంలో టీడీపీ కీలకంగా పని చేసింది. దేవెగౌడను ప్రధాని కావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఎన్డీయేలో చేరారు. ఎన్డీయే కన్వీనర్ గా కూడా చంద్రబాబు పని చేశారు.
  • 1995 నుంచి 2004వ సంవత్సరం వరకు 9 సంవత్సరముల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొనసాగారు. అత్యధిక కాలం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా చరిత్ర సృష్టించారు.
  • 2004లో పార్టీ ఓటమితో చంద్రబాబు ఎన్డీయే కూటమి నుంచి బయటికి వచ్చారు.
  • 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నారు . 2009 తర్వాత రాష్ట్ర విభజన అంశం తెరపైకి రావటంతో తెలంగాణలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది.
  • 2014లో రాష్ట్ర విభజన జరగటంతో నవ్యాంధ్రలో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు మరోసారి విజయం సాధించారు. ఈ ఎన్నికల ముందు ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు 208 రోజులు, 2817 కిలోమీటర్ల మేర 'వస్తున్నా మీ కోసం' పాదయాత్రతో ప్రజల చెంతకు వెళ్లారు.
  • 2014లో బీజేపీతో కలిసి ఏపీలో పోటీ చేశారు. మరోవైపు ఎన్డీయే కూటమిలో కూడా భాగస్వామ్యం అయ్యారు.
  • ప్రత్యేక హోదాతో పాటు విభజన సమస్యలపై బీజేపీని విభేదిస్తూ 2018 మార్చిలో ఎన్డీయే నుంచి వైదొలిగారు. మోదీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఓ దశలో జాతీయస్థాయిలో కాంగ్రెస్ కు దగ్గర అయ్యారు.
  • 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన టీడీపీ ఘోరంగా ఓటమి చెందింది. కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించటంతో జగన్ సీఎం అయ్యారు. మరోసారి చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా పని చేశారు.
  • 2024 ఎన్నికల వేళ మళ్లీ బీజేపీతో జట్టు కట్టారు. ఎన్డీయేలో చేరటమే కాకుండా... ఈ ఎన్నికల్లో భారీ విజయాన్ని చంద్రబాబు సొంతం చేసుకున్నారు. కేంద్రంలో మరోసారి తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా మారింది. సొంతంగా 16 ఎంపీ స్థానాలు సాధించి… ఎన్డీయే కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
  • జూన్ 12, 2024వ తేదీన నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయన్నున్నారు.

తదుపరి వ్యాసం