Chandrababu Swearing : తొడగొట్టిన అంజిరెడ్డి తాతకు చంద్రబాబు ఆహ్వానం, బాధిత కుటుంబాలకు కూడా!-vijayawada chandrababu swearing ceremony punganur anji reddy got invitation ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu Swearing : తొడగొట్టిన అంజిరెడ్డి తాతకు చంద్రబాబు ఆహ్వానం, బాధిత కుటుంబాలకు కూడా!

Chandrababu Swearing : తొడగొట్టిన అంజిరెడ్డి తాతకు చంద్రబాబు ఆహ్వానం, బాధిత కుటుంబాలకు కూడా!

Bandaru Satyaprasad HT Telugu
Jun 11, 2024 10:33 PM IST

Chandrababu Swearing : చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రముఖులతో పాటు సామాన్య కార్యకర్తలకు ఆహ్వానాలు అందాయి. పుంగనూరు అంజిరెడ్డి తాతకు చంద్రబాబు ఆహ్వానం పంపారు.

తొడగొట్టిన అంజిరెడ్డి తాతకు చంద్రబాబు ఆహ్వానం
తొడగొట్టిన అంజిరెడ్డి తాతకు చంద్రబాబు ఆహ్వానం

Chandrababu Swearing : ఏపీ సీఎంగా చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం కేసరపల్లిలో జరిగే ఆ కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, గవర్నర్లు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ , రాజకీయ ప్రముఖులు పాల్గొంటున్నారు. వీటితో పాటు ఓ సామాన్య కార్యకర్తతో పాటు గత ప్రభుత్వంలో దాడులకు గురైన 104 మంది బాధిత కుటుంబాలకు చంద్రబాబు ఆహ్వానం పంపారు. తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా టీడీపీ కార్యకర్త పుంగనూరు అంజిరెడ్డికి చంద్రబాబు ఆహ్వానం పంపారు. వీరితో పాటు అబ్దుల్ సలాం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబం సహా మొత్తం 104 బాధిత కుటుంబాలకు ఆహ్వానం పంపారు.

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త అంజిరెడ్డి తాత గతంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాడు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అప్పటి అధికార పార్టీ బెదిరింపులకు భయపడకుండా నామినేషన్ వేసేందుకు ప్రయత్నించగా...కొందరు ఆయనను అడ్డుకున్నారు. ఆ సమయంలో అంజిరెడ్డి తాత వారిని ఎదిరించి ఎన్నికలు జ‌ర‌పాల‌ంటూ మీసం మెలేసి, తొడ‌కొట్టి ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. పుంగ‌నూరు మండ‌లం మార్లప‌ల్లె గ్రామానికి చెందిన అయ్యమ్మగారి అంజిరెడ్డి టీడీపీ కార్యకర్త. చంద్రబాబు వీరాభిమాని. 70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ప్రత్యర్థులు దాడికి త‌ల‌ప‌డితే మీసం మెలేసి, తొడ‌గొట్టి ఎదురు నిలిచాడు. అప్పట్లో ఈ ఘటన వైరల్ అయ్యింది.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో పుంగనూరు అంజిరెడ్డి తాత మరోసారి వెలుగులోకి వచ్చాడు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవ్వాలని చంద్రబాబు...అంజిరెడ్డికి ఆహ్వానం పలికారు. ఈ విషయంపై అంజిరెడ్డి తాత బిగ్ టీవీతో మాట్లాడారు. పుంగనూరు నియోజకవర్గంలో ఓ మారుమూల గ్రామంలో ఉన్న సాధారణ కార్యకర్త అయిన తనకు చంద్రబాబు ఆహ్వానం పంపారనన్నారు.

"ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు ఆహ్వానం పంపారు. ఆయన ఆహ్వానాన్ని నేను శిరసా వహిస్తారు. చంద్రబాబు పరిపాలన సక్రమంగా జరగాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు మంచితనాన్ని మెచ్చి ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారు. 2019లో చంద్రబాబు మంచితనాన్ని మరిచి వేరొకరి ఓటేశారు. కానీ ఇప్పుడు తెలుసుకున్నారు. ప్రధాని మోదీతో పాటు లక్షలాది మంది ప్రజలు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వస్తున్నారు. చంద్రబాబు న్యాయమైన పరిపాలన చేస్తారు. ఐదేళ్లు చంద్రబాబు పాలన సవ్యంగా సాగాలని ఆ ఏడుకొండల స్వామి వెడుకుంటున్నాను"- బిగ్ టీవీతో అంజిరెడ్డి తాత

Whats_app_banner

సంబంధిత కథనం