Chiranjeevi: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి విశిష్ట అథితిగా చిరంజీవి.. ప్రత్యేక ఆహ్వానం.. రామ్‍చరణ్ కూడా..
Chiranjeevi - Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు. విశిష్ట అతిథిగా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవం రేపు (జూన్ 12) ఉదయం 11 గంటల 27 నిమిషాలకు కృష్ణా జిల్లాలోని కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో జరగనుంది. మెగాస్టార్ చిరంజీవికి ఈ కార్యక్రమంలో కోసం ప్రత్యేక ఆహ్వానం అందింది.
రాష్ట్ర విశిష్ట అథితిగా
సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి చిరంజీవికి విశేషమైన ఆహ్వానం దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశిష్ట అతిథిగా ఆయనకు ఆహ్వానం అందింది. ఆయన ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇందుకే నేటి సాయంత్రమే ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లనున్నారు. రేపు ఉదయం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వెళతారు.
చిరూ వెంటే చరణ్
చిరంజీవితో పాటు ఆయన తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇందుకోసం షెడ్యూల్ కూడా ఖరారు చేసుకున్నారని తెలుస్తోంది.
చిరంజీవి సోదరుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో అన్ని చోట్ల గెలిచింది. అయితే, పవన్ కల్యాణ్ మంత్రి పదవి తీసుకుంటారా.. రేపు ప్రమాణ స్వీకారం చేస్తారా అనేదే ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో బందోబస్తు చేస్తున్నారు పోలీసులు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కొందరు కేంద్ర మంత్రులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
సినిమాలు ఇలా..
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు. సోషియో ఫ్యాంటసీ మూవీగా ఇది రూపొందుతోంది. బింబిసార ఫేమ్ విశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‍తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2025 జనవరి 10న రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. విశ్వంభర చిత్రంలో చిరూకు జోడీగా త్రిష హీరోయిన్‍గా నటిస్తున్నారు.
విశ్వంభర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో వీఎఫ్‍ఎక్స్ కూడా భారీగా ఉండనుంది. ఇప్పటికే ఇంటర్వెల్ సీక్వెన్స్ షూటింగ్ కూడా అయిపోయింది. యూవీ క్రియేషన్స్ పతాకంపై ఈ మూవీని నిర్మిస్తుండగా.. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
కాగా, ఎన్నికలకు ముందు జనసేన పార్టీకి రూ.5కోట్ల విరాళాన్ని కూడా చిరంజీవి అందించారు. విశ్వంభర షూటింగ్ సెట్‍లోనే పవన్ కల్యాణ్‍కు ఈ చెక్ అందించారు. ఎన్నికల్లో విజయం సాధించాక చిరంజీవి వద్ద ఆశీర్వాదం కూడా తీసుకున్నారు పవర్ స్టార్ పవన్.
గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జోరుగా సాగుతోంది. గేమ్ ఛేంజర్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో చరణ్ సరసన కియారా అడ్వానీ హీరోయిన్‍గా నటిస్తున్నారు.