CBN Election: ఏపీ అసెంబ్లీలో ఎన్డీఏ పక్ష నాయకుడిగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక, మద్దతిచ్చిన బీజేపీ, జనసేన-andhra pradesh nda legislators elected chandrababu naidu as their lp leader ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn Election: ఏపీ అసెంబ్లీలో ఎన్డీఏ పక్ష నాయకుడిగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక, మద్దతిచ్చిన బీజేపీ, జనసేన

CBN Election: ఏపీ అసెంబ్లీలో ఎన్డీఏ పక్ష నాయకుడిగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక, మద్దతిచ్చిన బీజేపీ, జనసేన

Sarath chandra.B HT Telugu
Jun 11, 2024 11:44 AM IST

CBN Election: ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే శాసనసభ్యులు చంద్రబాబు నాయుడిని శాసనసభా పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చంద్రబాబు పేరును అచ్చెన్నాయుడు ప్రతిపాదించగా జనసేన, బీజేపీలు మద్దతిచ్చాయి.

ఎన్డీఏ కూటమి నాయకుడిగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక
ఎన్డీఏ కూటమి నాయకుడిగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక

CBN Election: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ శాసనసభ్యులు మంగళవారం చంద్రబాబును శాసనసభా పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఎన్డీఏ పక్ష నాయకుడిగా ఎన్నుకున్నందుకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. తాను గతంలో చాలా ఎన్నికలు చూశానని, రాష్ట్ర ,చరిత్రలో ఎప్పుడు చూడని తీర్పును ప్రజలు ఇచ్చారని, రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజలకు శిరస్సు వహించి పాదాభివందనం చేస్తున్నానని చంద్రబాబు చెప్పారు. 

ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలని  ప్రచారం చేశామని, ఎన్నికల్లో ప్రజలు గెలిచారని, రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత గెలిచిన శాసనసభ్యులపై ఉందన్నారు. కూటమిలు ఏర్పాటు తర్వాత ఎలాంటి ఫిర్యాదులు లేకుండా జరిగిన ఎన్నికలు ఇవేనని చంద్రబాబు చెప్పారు. నూటికి నూరు శాతం నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారన్నారు. 

ప్రజల మనోభావానికి అనుగుణంగా మూడు పార్టీల కార్యకర్తలు పనిచేశారన్నారు. మూడు పార్టీల కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని బాబు చెప్పారు. 1994లో  ఏకపక్ష ఎన్నికలు జరిగినా ఇన్ని సీట్లు , ఓట్లు రాలేదన్నారు. 175లో 164గెలిచామని, 11మాత్రమే ఓడిపోయామని, స్ట్రైకింగ్ రేట్ 93శాతం ఉందన్నారు. ఓట్లు కూడా 57శాతం  వచ్చాయని, 50శాతం వస్తే చాలా ఎక్కువని భావిస్తామని, అంతకంటే రెట్టింపు వచ్చాయని చెప్పారు.

శ్రీకాకుళంలో 7, విజయనగరంలో 7, అరకులో ఏడుకు ఐదు స్థానాలు గెలిచామని, విశాఖలో ఏడు, అనకాపల్లిలో ఏడు, తూర్పు గోదావరి, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు, మచిలీపట్నం, కృష్ణా, గుంటూరు, నరసరావు పేట, బాపట్లలో ఏడుకు ఏడు స్థానాలు గెలిచామన్నారు. ఒంగోలులో రెండు ఓడిపోయామని, నెల్లూరు, తిరుపతిలో ఏడు గెలిచినా పార్లమెంటు ఓడామన్నారు. చిత్తూరులో ఎప్పుడు లేనిది ఏడు స్థానాలు, రాజంపేటలో పార్లమెంటులో  మూడు,కడపలో ఏడుకు ఐదు గెలిచామని,  అనంతపురం, హిందూపురం, నంద్యాలలో ఏడుకు ఏడు, కర్నూలులో ఏడుకు ఐదు సీట్లు గెలిచామన్నారు. 

జనసేన పోటీ చేసిన మొత్తం 21 స్థానాల్లో గెలిచిందని, బీజేపీ పదిలో ఎనిమిది గెలిచిందని, అభ్యర్థులు గట్టిగా నిలబడిన ప్రతిచోట  విజయం సాధించారని చెప్పారు. ప్రజలు నమ్మకం పెట్టుకుని గెలిపించారని చంద్రబాబు అన్నారు. గాజువాక 95వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారని, రాష్ట్రంలో ఇచ్చిన తీర్పుతో ఢిల్లీలో తమను అంతా గౌరవించారని  చంద్రబాబు చెప్పారు. 

ఏ సీటు ఏ అభ్యర్థి తీసుకుంటే  గెలుస్తారో పూర్తిగా ఆలోచించి కేటాయింపులు చేశామన్నారు. ఎంపికల్లో చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్ద ఇబ్బందులు తలెత్తలేదన్నారు. ఏ సీట్లో ఎవరు గెలుస్తారో ఆ సీట్లనే వారికి కేటాయించినట్టు చెప్పారు. 

పవన్ సహకారం మరువలేనిది…

పవన్ సమయస్ఫూర్తిని ఎప్పుడు మర్చిపోలేనన్నారు. జైల్లో ఉన్నపుడు వచ్చి తనను పరామర్శించారని, బయటకు వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదని అంతకు ముందు  ప్రకటించినా, టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటున్నట్టు జైలు బయట ప్రకటించారన్నారు. బీజేపీ,జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని చెప్పి ఆ ప్రయత్నాలు చిత్తశుద్ధితో చేశారన్నారు. ఆ రోజు నుంచి ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కలిసి పనిచేశారన్నారు. 

ఓటు బదిలీపై తమకు మొదట్లో అనుమానాలు ఉండేవని, కొవ్వూరులో మూడు పార్టీలు కలిసి ప్రచారం చేశామని, ఆరు జిల్లాల్లో ఇద్దరు కలిసి ప్రచారం చేశామని చెప్పారు. అనంతపురంలో అమిత్‌ షా ధర్మవరం ప్రచారానికి వచ్చారని చెప్పారు.

అందరి సహకారంతో బుధవారం నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని, ప్రధాని మోదీ, అమిత్ షా వస్తున్నారని, నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా, ఈసారి ఉన్న ప్రాధాన్యత వేరన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని అమిత్‌షా, మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు.  రాష్ట్రానికి సంపూర్ణంగా సహకరిస్తామని హామీ ఇచ్చారన్నారు. 

తాను రాగద్వేషాలకు అతీతంగా 45ఏళ్లు రాజ్యాంగబద్దంగా పనిచేశానని, ప్రజల కోసం కష్టపడటం, అవిశ్రాంతంగా పనిచేయడం, పోరాడటమే తనకు తెలిసిన విషయాలన్నారు. ప్రజలు తమకు అధికారం ఇవ్వలేదని అత్యున్నతమైన బాధ్యత అప్పగించారన్నారు. 

నిజాయితీ నిరూపించుకుంటా…

ఎన్నో సవాళ్లు, సంక్షోభాలు చూశానని, తన అనుభవం, మిత్రుల సహకారం, పేదల జీవితాలు మార్చడానికి అనునిత్యం ఆలోచిస్తానని చెప్పారు. తమ నిజాయితీ నిరూపించుకుంటానని చెప్పారు. 

రాష్ట్రం పూర్తిగా శిథిలమైపోయింది, దెబ్బతినని వర్గమంటూ లేకుండా పోయారన్నారు. కూలీ పనుల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లిన వ్యక్తులు, సొంత డబ్బులతో ఓటు వేయడానికి  వచ్చారని చెప్పారు. విదేశాల్లో స్థిరపడిన ఎన్నారైలు లక్షలు ఖర్చు పెట్టి వచ్చి ప్రచారం చేశారని చెప్పారు. బాధ్యతతో ఓటర్లు చేసిన కృషిని తెలుగు జాతి గుర్తు పెట్టుకుంటుందన్నారు.

అహంకారంతో విర్రవీగిన  వారు ఎన్నికల్లో కుప్పకూలిపోయారన్నారు. రేపు అనేది లేదని భావిస్తే ఇలాంటి పరిణామాలే జరుగుతాయన్నారు. తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు.  ఐదేళ్లలో కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులు, వేధింపులు, హింసా రాజకీయాలు నడిచాయన్నారు.  మెడపై కత్తి ఉన్నా జై తెలుగుదేశం పార్టీ అంటూ కార్యకర్తలు  ప్రాణాలు వదిలారని గుర్తు చేశారన్నారు. నాకు జరిగిన అవమానాలు, కుటుంబానికి జరిగిన అవమానంతో అసెంబ్లీ నుంచి శపథం చేసి బయటకు వచ్చానన్నారు.

గౌరవ సభలోకి అడుగు పెడుతున్నా….

ప్రజా క్షేత్రంలో గెలిచి గౌరవసభ చేసి అడుగుపెడతానని చెప్పి బయటకు వచ్చానని, ఆ శపథాన్ని ప్రజలు గౌరవించారని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తామన్నారు. గౌరవ సభకు నిలబెట్టి సభను నడిపిస్తామని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వంలో ఎంత అప్పు ఉందో తెలీదని, ఎక్కడెక్కడి నుంచి తీసుకు వచ్చారో ఎవరికి తెలియదని, ఎన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నాయో ఎవరికి తెలియదని, ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సహకరించినా దానిని పూర్తి చేయలేకపోయారన్నారు. 

పదేళ్ల తర్వాత కూడా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ఇవన్నీ గుర్తు చేసుకుంటూ కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మక ప్రభుత్వాన్ని నడుపుతామన్నారు. మూడు రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలాడమని, అమరావతి రాజధాని, విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ప్రత్యేక నగరంగా ఆధునిక నగరంగా తయారు చేసుకుందాం. విశాఖపట్నం జనసేన, బీజేపీ, టీడీపీకి ముఖ్యమని, 2014లో హరిబాబు ఎంపీగా గెలిచారని, 2019లో టీడీపీకి నాలుగు అసెంబ్లీసీట్లను గెలిపించిన నగరం, ప్రజల్లో గణనీయమైన అభిమానం జనసేనకు ఉందని,

ఆనాటి విశాఖపట్నం రాజధాని చేస్తాను, అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తామన్న నువ్వు రావొద్దని ప్రజాతీర్పు ఇచ్చిన నగరం విశాఖ అని, విశాఖను మర్చిపోయే సమస్య లేదని, తగిన గుర్తింపు ఇస్తామన్నారు. కర్నూలును కూడా మర్చిపోయేది లేదన్నారు. జ్యూడిషియల్ క్యాపిటల్ చేస్తామని ఏమి చేయలేదన్నారు. రాయలసీమలో వన్‌సైడ్ ఎన్నికలు జరిగాయని, ఊహించని మెజార్టీని ఇచ్చారన్నారు. ఊహించని మెజార్టీని కట్టబెట్టారన్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వలేదు…

తాడేపల్లి గూడెంలో చంద్రబాబు దార్శనికత రాష్ట్రానికి అవసరమని చెప్పిన మాటకు చివరి వరకు తాను కట్టుబడి ఉన్నానని పవన్ కళ్యాణ్‌ చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదనే మాటకు కట్టుబడి ఘన విజయం సాధించినట్టు చెప్పారు. చంద్రబాబు వంటి అపార అనుభవం, ధైర్యశాలి రాష్ట్రానికి అవసరమన్నారు.

బాంబు పేలినా చొక్కా దులుపుకుని మళ్లీ రాజకీయం చేసిన ధైర్యశాలి చంద్రబాబు అన్నారు. సైబరాబాద్‌ ఉందంటే చంద్రబాబు దార్శనికత దానికి కారణమన్నారు. చంద్రబాబు అనుభవం ఏపీకి అవసరం అన్నారు. ఎన్డీఏ కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు పేరుకు తాము బలపరుస్తున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు.

చంద్రబాబు నలిగిపోయారని, భువనేశ్వరి గారి బాధను తాను చూశానని, మంచిరోజులు వస్తాయని చెప్పానని, మనస్ఫూర్తిగా అభినందనలు, అద్భుతమైన పాలన రాష్ట్రానికి ఇవ్వాలని కోరుకుంటున్నట్టు పవన్ చెప్పారు.

ఇంతటి ఘన విజయాన్ని ఊహించలేదు… పురంధేశ్వరి

ఆంధ్రరాష్ట్రంలో జరిగిన ఎన్నిక, మూడు పార్టీల మధ్య సమన్వయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిందన్నారు. గత ఐదేళ్లలో సాగిన విధ్వంసకర పాలన, కక్ష పూరిత పాలన సాగిందని పురంధేశ్వరి అన్నారు. ప్రజలు విసిగి వేసారి ప్రజలు ఇంతటి ఘన విజయాన్ని అందించారని, ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని భావించినా ఇంత ఘన విజయాన్ని ఊహించలేదన్నారు.

ఈ ప్రజా వ్యతిరేక పాలన అంతమొదించాలని భావనకు ప్రజలు వచ్చారని, మనసులో గూడుకట్టుకున్న అభిప్రాయాన్ని ఎన్నికల్లో వ్యక్తం చేశారన్నారు. అనూహ్య విజయంతో సంతోషంగా ఉన్నా, ఈ విజయం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజలకు నిజమైన సంక్షేమాన్ని దూరం చేస్తే ఏమి చేయాలో ప్రజలకు తెలుసని ఓట్ల ద్వారా హెచ్చరిక ఇచ్చారన్నారు. గెలిచాం, అధికారంలోకి వచ్చామనే భావన కంటే ప్రజా హితం, సుపరిపాలన అందించడంపై దృష్టి పెట్టాలన్నారు. ఈ క్రమంలో మూడు పార్టీల విధానాలు, ఆలోచనలు కలిసి సాగాలన్నారు.

బీజేపీ మొదటి నుంచి సబ్‌కా సత్‌, సబ్‌ కా వికాస్ నినాదంతోనే అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించిన లక్ష్యం, జనసేన ఆవిర్భావం పేదల కోసమేనని గుర్తు చేశారు. పేదలకు నిజమైన సంక్షేమాన్ని అందించాలనే లక్ష్యం, కలయిక ఆలస్యమైనా రాష్ట్రానికి చాలా అవసరమని చెప్పారు. చంద్రబాబు యోక్తి, నరేంద్ర మోదీ స్ఫూర్తి, పవన్ కళ్యాణ్‌ శక్తి కలిసి కట్టుగా పనిచేశాయన్నారు.

కక్ష పూరితంగా ముందుకు వెళ్ళకుండా, గత ఐదేళ్లలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు, సమస్యల నేపథ్యంలో వాటిపై సంయమనం పాటించడంతో పాటు కార్యకర్తల్ని కూడా సంయమనం పాటించేలా చేయాల్సిన బాధ్యత మూడు పార్టీలపై ఉందన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికకు తమ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు.

12న ప్రమాణ స్వీకారం…

ఈ నెల 12న చంద్రబాబుతో పాటు జనసేన, బీజేపీకి చెందిన కొందరు నేతలు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కులో ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన మంత్రివర్గ సహచరులు హాజరయ్యే అవకాశం ఉందని టీడీపీ అధికారిక వార్తా బులెటిన్ తెలిపింది. దక్షిణాది రాష్ట్రంలో ఇటీవల ఏకకాలంలో ముగిసిన లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 164 అసెంబ్లీ, 21 లోక్ సభ స్థానాలతో ఘన విజయం సాధించింది.

 

Whats_app_banner