KTR Meets VRA Representatives : వీఆర్ఏలతో కేటీఆర్ భేటీ.. ఏం చెప్పారంటే?
KTR On VRA's Problems : వీఆర్ఏ సమస్యలపై మంత్రి కేటీఆర్ చర్చించారు. వీఆర్ఏ ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు. వారి సమస్యలు, డిమాండ్లపై మాట్లాడారు.
15 మంది వీఆర్ఏల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. అసెంబ్లీ హాలులో వారితో మాట్లాడారు. పే స్కేలు అమలు, ప్రమోషన్, ఉద్యోగ భద్రత వంటి సమస్యల పరిష్కారం కోసం వీఆర్‌ఏలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. 50రోజులుగా సమ్మె జరుగుతోంది. దీంతో వీఆర్‌ఏల సమస్యలకు పరిష్కారంపై ప్రభుత్వం చర్చలు మెుదలుపెట్టింది. ఇందులో భాగంగానే మంత్రి కేటీఆర్ వీఆర్‌ఏలతో మాట్లాడారు. వారి డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు.
పే స్కేల్, పదోన్నతులు, వయసు పైబడిన వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌కు వీఆర్ఏ ప్రతినిధులు విన్నవించారు. అయితే దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. కాస్త సమయం కావాలని కోరారు. 16వ తేది నుంచి ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న కారణంగా మరోసారి చర్చలకు ఆహ్వానిస్తామని చెప్పారు. ప్రస్తుతం కొనసాగిస్తున్న సమ్మెను విరమించాలని కోరారు. మంత్రి కేటీఆర్ తమ విజ్ఞప్తులు వినడంపై వీఆర్ఏ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంతో చర్చలు సఫలమయ్యే దాకా శాంతియుతంగా ఉద్యమం కొనసాగిస్తామని చెబుతున్నారు.
అంతకుముందు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు వీఆర్ఏలు. తెలుగు తల్లి వంతెన దగ్గర పోలీసులు వారిని అడ్డుకున్నారు. అసెంబ్లీ వైపు దూసుకెళ్లిన వారిపై లాఠీ ఛార్జ్ జరిగింది. దీంతో తెలుగు తల్లి వంతెన పై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదించారు. పే స్కేలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధిక సంఖ్యలో వీఆర్‌ఏలు రావడంతో అసెంబ్లీ దగ్గరలో భారీగా పోలీసుల్ని మోహరించారు.
ఈ ఆందోళనల నేపథ్యంలో కేటీఆర్ వీఆర్‌ఏ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని వీఆర్ఏలు నిరసన తెలుపుతున్నారు. సుమారు 23 వేల మంది వీఆర్‌ఏలు ఉన్నారు. వారి డిమాండ్ల పరిష్కారం దిశగా.. ప్రభుత్వం తరపున మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్నారు. పే స్కేలు, ప్రమోషన్‌లు వంటి అంశాలపై మరోసారి మాట్లాడుదామని చెప్పారు. ఈనెల 20తేదిన మరోసారి సమావేశం జరిగే అవకాశం ఉంది.