VRAs Regularization: త్వరలోనే వీఆర్ఏల క్రమబద్ధీకరణ..?
VRAs Regularization: వీఆర్‌ఏలకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. క్రమబద్దీకరణపై కసరత్తు మొదలుపెట్టింది.సెప్టెంబరు మొదటి వారం నాటికి ప్రక్రియను పూర్తి చేయాలని చూస్తోంది.
Regularization VRAs in Telanagana: రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు ఆందోళనలను ఉద్ధృతం చేస్తున్నారు. మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో నిరసలు చేపడుతున్నారు. తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఫలితంగా వారి నిర్వర్తించే విధులను నిలిచిపోవటంతో... ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీరి ఆందోళనపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. త్వరలోనే తగిన ఉత్తర్వులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
వీఆర్‌ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ క్రమబద్ధీకరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సీనియర్ అధికారి శేషాద్రి నేతృత్వంలో ఏర్పాటైన ఐఏఎస్ అధికారుల కమిటీ దీనిపై తమ సిఫార్సుల దస్త్రాన్ని సీఎం కార్యాలయానికి పంపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సెప్టెంబరు మొదటి వారంలో క్రమబద్ధీకరణ పూర్తిచేయాలని ప్రభుత్వ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 21 వేల మంది వీఆర్‌ఏలు ఉన్నారు. వీరిలో పలు రకాల విద్యా అర్హతలు కలిగిన ఉన్నవారు ఉన్నారు. ఆయా అర్హతల ఆధారంగా పోస్టులు కేటాయించే అవకాశం ఉంది. క్రమబద్ధీకరణలో భాగంగా వీఆర్‌ఏలకు పేస్కేలు చెల్లిస్తారు. తగిన అర్హత ఉన్న వారికి వెంటనే పదోన్నతులు కల్పించే అవకాశం ఉంది. ఉన్నత విద్యార్హతలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన వారిని ధరణి ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లుగా నియమిస్తారు. తహసీల్దారు కార్యాలయాల్లోని ఖాళీ పోస్టుల్లో ఎక్కువ మందిని సర్దుబాటు చేసే అవకాశాలున్నాయి.
Regularization VRAs: రెవెన్యూశాఖకు విద్యార్హతలకు సంబంధించిన ఆధారాలేవీ అందించని వారు 5,226 మంది ఉన్నారు. వీరి ఉద్యోగాలను కూడా క్రమబద్ధీకరించనున్నారు. 50 ఏళ్ల వయసు దాటిన వారి వారసులకు ఉద్యోగావకాశం లేదా సుమారు రూ.10 లక్షల వరకు ఇచ్చి ఉద్యోగ విరమణ చేసేలా అవకాశం కల్పించనున్నారు. మరికొందరిని డ్రైవర్లు, అటెండర్లు తత్సమానమైన పోస్టుల్లో నియమించనున్నారు. మరోవైపు కనీస విద్యార్హత లేని వారిలో 3600 మందిని సాగునీటి పారుదలశాఖలో లస్కర్లుగా నియమించడానికి కూడా ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే వీఆర్ఏ సంఘాలు మాత్రం ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తమను తక్షణమే క్రమబద్ధీకరించాలని.. జాప్యం చేయటం సరికాదని అంటున్నారు.
'మా సమస్యలను పరిష్కారించాలంటూ 35 రోజులుగా నిరసనలు చేస్తున్నాం. ప్రభుత్వం మాత్రం స్పందించటం లేదు. తమకు వెంటనే పదోన్నతులు కల్పించాలి. వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలి. 55 ఏళ్లు దాటి పని చేస్తున్న వీఆర్ఏల వారసులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. ఐదేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారికి కూడా ప్రమోషన్లు ఇవ్వాలి. సమ్మె కాలంలో ఉన్న జీతాలు కూడా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం' - నాగరాజు, మంచాల మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు, రంగారెడ్డి జిల్లా
మొత్తంగా కొద్దిరోజులుగా వీఆర్ఏలు చేస్తున్న ఆందోళనకు పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో... ఎలాంటి ఉత్తర్వులు వస్తాయన్న ఆసక్తి వీఆర్ఏల్లో నెలకొంది.