Ts Assembly : పార్లమెంటుకు అంబేడ్కర్ పేరు పెట్టాలని టీ అసెంబ్లీలో తీర్మానం
తెలంగాణ అసెంబ్లీలో పలు బిల్లులకు అమోదం లభించింది. శాసనసభా సమావేశాల చివరి రోజు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై వేటు పడింది. స్పీకర్ పోచారంపై అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పేందుకు ఈటల నిరాకరించడంతో ఆయన్ని సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. మరోవైపు కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనానికి బిఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. దీంతో పాటు పలు కీలక బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ అమోదం తెలిపింది.
Ts Assembly బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై తెలంగాణ శాసనసభలో సస్పెన్షన్ విధించారు. సమావేశాలు ముగిసే వరకు సభ నుంచి సస్పెన్షన్ విధించారు. అసెంబ్లీ సబ్ రూల్ 2, రూల్ 340 ప్రకారం బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను సస్పెండ్ చేయాలని ప్రతిపాదిస్తూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. క్షమాపణలు చెప్పడానికి ఈటల రాజేందర్ నిరాకరించారని, అందుకే ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి వేముల ప్రకటించారు. స్పీకర్ పోచారంను మరమనిషి అని రాజేందర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో టిఆర్‌ఎస్ నేతలు చర్యలకు డిమాండ్ చేశారు.
Ts Assembly ఈటల రాజేందర్ సస్పెన్షన్‌తో తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సస్పెండ్ అయ్యాక సభ నుంచి బయటకు వచ్చిన ఈటలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఈటలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్‌పై ఈటల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీస్ వాహనంలో ఎక్కేందుకు ఈటల వ్యతిరేకించారు. బలవంతంగా ఈటలను పోలీస్ వాహనంలో తరలించారు. సొంత వాహనంలో బయటకు వెళతానని బీజేపీ ఎమ్మెల్యే చెప్పినా పోలీసులు పట్టించు కోలేదు. ఈ క్రమంలో అసెంబ్లీ వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. శాసనసభ నుంచి ఈటల రాజేందర్‌ను పోలీసులు శామీర్‌పేట్‌లోని తన నివాసానికి తరలించారు.
Ts Assembly ఉదయం సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ పై ఈటల వ్యాఖ్యలను నిరసిస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలను ఈటల వెంటనే వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. స్పీకర్‌పై ఈటల అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. బీజేపీ సభ్యులు చర్చ కన్నా రచ్చ చేసేందుకే వస్తున్నారని మండిపడ్డారు. ఈటల వెంటనే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్ నేతలకు బదులిస్తూ ఈటల 12ఏళ్లుగా సభలో ఉన్నానని, సభా మర్యాదలు తనకు తెలుసని సభ నుంచి తనను బయటకు పంపాలని చూస్తున్నారా, మీ ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.
నేటితో ముగియనున్న సమావేశాలు….
Ts Assembly తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. సమావేశాల వ్యవధి తక్కువగా ఉండటంతో ఉభయసభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. అసెంబ్లీలో రెండు అధికారిక తీర్మానాలు ప్రవేశపెట్టారు. విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ, ఉపసంహరించుకోవాలని ఓ తీర్మానం, కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టారు.
Ts Assemblyఏడు బిల్లులపై అసెంబ్లీలో చర్చించారు. జీఎస్టీ, మోటార్ వాహనాల పన్ను, పురపాలక బిల్లులపై చర్చించారు. అజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్టసవరణ బిల్లులపై కూడా చర్చించారు. వర్సిటీలకు ఉమ్మడి నియామక మండలి ఏర్పాటు బిల్లులపై చర్చించారు. కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనిపై తీర్మానం చేస్తూ ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందన్నారు.
అంబేద్కర్ చూపిన బాటలోనే తాము నడుస్తున్నామని తెలిపారు. స్వేచ్ఛ, సమానత్వం కోరిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ తత్వాన్ని టీఆర్ఎస్ ఆచరణలో చూపిందని మంత్రి తెలిపారు. అంబేద్కర్ లక్ష్యం సమానత్వం అన్నారు. తాను రాసిన రాజ్యాంగం దుర్వినియోగం అయితే, దాన్ని తానే ముందుగా తగులబెడుతానని అన్నారని మంత్రి గుర్తు చేశారు. అంబేద్కర్ చూపిన బాటలోనే తాము నడుస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. భాషా ఆధిపత్యాన్ని, ప్రాంతీయ ఆధిపత్యాన్ని అంబేద్కర్ వ్యతిరేకించినట్లు మంత్రి తెలిపారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక పార్లమెంట్, టెంపుల్ ఆఫ్ డెమాక్రసీకి పేరు పెట్టడానికి ఇంతకు మించిన వ్యక్తి లేరు కాబట్టి.. అందుకే అంబేద్కర్ పేరును పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ తన తీర్మానంలో కోరారు.
అజమాబాద్ ఇండస్ట్రీయల్ ఏరియా లీజుల రద్దు బిల్లును తెలంగాణ శాసన సభలో ప్రవేశపెట్టినపుడు భూముల్ని లీజుదారులకు అప్పగించడంపై కాంగ్రెస్ నేత భట్టి అభ్యంతరం తెలిపారు. హైదరాబాద్ నడిబొడ్డున ముషీరాబాద్‌లో లీజు ప్రాతిపదికన స్థలాలు కేటాయించిందని వాటి విలువ ఎక్కువగా ఉన్నందున ఫ్రీ హోల్డ్ ఇవ్వడంపై భట్టి అభ్యంతరం తెలిపారు. లీజ్ హోల్డ్ నుంచి ఫ్రీ హోల్డ్‌కు మార్చడానికి బిల్లును ప్రవేశపెడుతున్నట్లు కేటీఆర్ ప్రకటించడంపై భట్టి అభ్యంతరం తెలిపారు.
అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా గురించి చాలా సందేహాలు ఉన్నాయని, గతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడానికి లీజులు ఇచ్చారని, కొన్ని పరిశ్రమలు ఏర్పాటై తర్వాతి కాలంలో మూతబడ్డాయని భట్టి చెప్పారు. అజామాబాద్ చుట్టూ పట్టణీకరణ జరగడంతో నగరం విస్తరించిందని, ప్రస్తుతం లీజుల నుంచి వారికి శాశ్వతంగా వారికి అప్పగిస్తే ప్రభుత్వానికి నష్టం వస్తుందన్నారు.
130.4 ఎకరాల్లో అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు.58మంది లీజుదారుల్లో 36 అసలు లీజు దారుల వద్దే ఉన్నాయని, మిగిలినవి చేతులు మారాయని చెప్పారు. హిందుజా భూముల వ్యవహారంలో వైఎస్సార్ ఇచ్చిన జీవోలను మాత్రమే తాము అమలు చేశామని కేటీఆర్ వివరణ ఇచ్చారు. న్యాయస్థానాల్లో సమస్యలు తలెత్తకుండా ఉండటానికే ఫ్రీ హోల్డ్ చేయాలని భావిస్తున్నామన్నారు. ఫ్రీ హోల్డ్ ఇవ్వడం ద్వారా జిహెచ్‌ఎంసికి పన్నుల ఆదాయం వస్తుందని చెప్పారు. నివాసాల నడుమ కాలుష్యకారక పరిశ్రమల్ని ఉంచడం సరికాదని చెప్పారు.
టాపిక్