Septmeber 13 Telugu news Updates : ముగిసిన అసెంబ్లీ సమావేశాలు-andhra pradesh telangana telugu live news updates september 13092022 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Andhra Pradesh Telangana Telugu Live News Updates September 13092022

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(tsassembly)

Septmeber 13 Telugu news Updates : ముగిసిన అసెంబ్లీ సమావేశాలు

04:32 PM ISTB.S.Chandra
  • Share on Facebook
04:32 PM IST

  • సికింద్రబాద్‌ పాస్‌పోర్ట్ కార్యాలయం సమీపంలో ఉన్న రూబీ లాడ్జిలో మంటలు చెలరేగి ఎనిమిది మంది చనిపోయారు. హోటల్‌ సెల్లార్‌లో పార్క్‌ చేసిన బ్యాటరీ వాహనాలకు మంటలు అంటుకోవడంతో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో నలుగురు చనిపోగా ఆస్పత్రిలో మరో నలుగురు చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో  ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

Tue, 13 Sep 202204:31 PM IST

పాత పింఛన్ అమలుపై ఆలోచన

ఉద్యోగులకు పాత పింఛన్‌ అమలుపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 2004కు ముందు నోటిఫికేషన్‌లో ఎంపికైన ఉద్యోగులకు పాత పింఛన్‌ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు ఉంది. 2004 సెప్టెంబరు 1 నాటికి ఉద్యోగాల్లో చేరినవారికి పింఛన్‌ వర్తింపజేయడంపై పరిశీలన చేస్తున్నారు. ప్రభుత్వ శాఖలు ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని ఆర్థిక శాఖ కోరింది.

Tue, 13 Sep 202202:41 PM IST

నారా హ‌మారా.. అమ‌రావ‌తి హ‌మారా.. ఇదే మీ లక్ష్యం

రాష్ట్రం అంతా మ‌న‌దే అనే భావ‌న తమ ప్రభుత్వానిదని వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు అన్నారు. అమ‌రావ‌తి మాత్రమే అనే భావ‌న మీది అని టీడీపీని విమర్శించారు. నారా హ‌మారా.. అమ‌రావ‌తి హ‌మారా.. ఇదే పాద‌యాత్ర లక్ష్యం అన్నారు. అమ‌రావ‌తిపై అసెంబ్లీలో చ‌ర్చిద్ధాం.. రండి అని సవాల్ విసిరారు. యాత్రలో జరగకూడనిది జరిగితే సీఎం జగన్ మీద బురదచల్లాలనేదే మీ కుట్ర అని కన్నబాబు ఆరోపించారు.

Tue, 13 Sep 202201:29 PM IST

ఈ బిల్లులకు ఆమోదం

అటవీశాస్త్ర విశ్వవిద్యాలయ ఏర్పాటు బిల్లు, పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ చట్ట సవరణ బిల్లు, డీఎంఈ, అదనపు డీఎంఈల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంపు బిల్లును శాసనసభ ఆమోదించింది. అజామాబాద్ పారిశ్రామిక చట్ట సవరణ బిల్లు, విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లుకులకు పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో మరికొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లులో ప్రతిపాదించారు.

Tue, 13 Sep 202201:29 PM IST

ముగిసిన అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ఈ నెల 6న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, కమలాపూర్‌ మాజీ ఎమ్మెల్యే పరిపాటి జనార్దన్‌రెడ్డిలకు సంతాపం తెలిపారు. అనంతరం 12, 13వ తేదీలకు సభలను వాయిదా వేశారు. ఆ తర్వాత వివిధ అంశాలపై చర్చించారు. శాసనసభలో 8 కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. వాటికి సభ్యులు ఆమోదం తెలిపారు.

Tue, 13 Sep 202212:03 PM IST

తెలంగాణకు ఇచ్చినవి సున్నా

దేశంలో ఏడేండ్లలో కొత్తగా 7 ఐఐఎంలు కేటాయిస్తే అందులో తెలంగాణకు కేటాయించినవి సున్నా అని కేంద్రంపై హరీశ్ రావు కామెంట్స్ చేశారు. 'ఐఐటీలు 7 ఏర్పాటు చేస్తే తెలంగాణకు ఇచ్చినవి సున్నా. ఐఐఎస్‌ఈఆర్‌లు రెండు నెలకొల్పితే.. తెలంగాణలో నెలకొల్పినవి సున్నా. ట్రిపుల్ ఐటీలు దేశవ్యాప్తంగా 16 ఏర్పాటు చేస్తే.. తెలంగాణలో ఏర్పాటుచేసినవి సున్న. ఎన్‌ఐడీలు దేశంలో నాలుగు పెడితే.. తెలంగాణలో పెట్టినవి సున్నా. వివిధ రాష్ర్టాల్లో మొత్తం 157 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటుచేస్తే.. తెలంగాణలో ఏర్పాటు చేసినవి సున్నా.' అని వ్యాఖ్యానించారు.

Tue, 13 Sep 202210:54 AM IST

సూర్యాపేట జిల్లాలో తప్పిన పెద్ద ప్రమాదం

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్, లింగగిరి రోడ్డులో పెద్ద ప్రమాదం తప్పింది. ట్రాలీ ఆటోను ట్రాక్టర్​ ఢీ కొట్టింది. రోడ్డు పక్కనే ఉన్న చిన్న హోటల్​ బయట ఉన్న కాగుతున్న నూనె కడాయికి ట్రాలీ రాసుకుంటూ వెళ్లింది. రెండు బైక్​లను ధ్వంసం చేసింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయలు అయ్యాయి. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని.. వివరాలు సేకరిస్తున్నారు.

Tue, 13 Sep 202209:37 AM IST

అన్నింటిలో బీజేపీ ఫెయిల్.. అసెంబ్లీలో హరీశ్ రావు

బీజేపీ పాలనలో హమీలు నెరవేరదలేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. అన్నింటిలో ఫెయిల్ అయిందని విమర్శించారు. విదేశాల నుంచి నల్లధనం తెస్తామన్నారు కానీ ఫెయిల్ అయిందన్నారు. పేదల ఖాతాల్లో 15 లక్షలు, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, పెద్ద నోట్ల రద్దు, రైతుల ఆదాయం రెట్టింపు, ఎం.ఎస్.ఎం.ఈలకు గంటలోపల రుణాలు, అర్హులందరికీ ఇళ్లు.. ఇలా అన్నింటిలో ఫెయిల్ అయిందన్నారు.

Tue, 13 Sep 202209:35 AM IST

ఇక పండుగే పండుగ

తెలంగాణలో పాఠశాలలకు ఈ నెల 26 నుంచి వచ్చే నెల 8 వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాధికారులకు సర్క్యులర్ పంపించింది. వచ్చే నెల 5న దసరా పండుగ. అందుకు 10 రోజుల ముందుగానే పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ నెల 25, అక్టోబరు 9వ తేదీ ఆదివారాలు కావడంతో మొత్తం 15 రోజుల పాటు సెలవులు కొనసాగనున్నాయి. పాఠశాలలు తిరిగి అక్టోబరు 10న ప్రారంభమవుతాయి.

Tue, 13 Sep 202207:38 AM IST

విశాఖ రైతుల పాదయాత్రపై వైవీసుబ్బారెడ్డి స్పందన

అమరావతి పాదయాత్రలో రైతులు ఉన్నారా అని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే యాత్ర చేస్తున్నారని ఆరోపించారు.  అమరావతిని రాజధాని చేయాలని చూశారని, ఇప్పుడు  ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పాదయాత్ర పేరుతో దండయాత్ర  చేపట్టారని విమర్శించారు.  విశాఖను పరిపాలన రాజధాని కాకుండా చేస్తున్న పాదయాత్రను ఉత్తరాంధ్ర ప్రజలు తిప్పికొడతారని  వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

Tue, 13 Sep 202207:14 AM IST

టీడీపీలో ఫ్లెక్సీల గోల

విజయవాడలో ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ విస్తృతస్థాయి సమావేశం జరుగుతోంది. సమావేశం వద్ద ఏర్పాటు చేసిన ప్లెక్సీలో బుద్దా వెంకన్న ఫోటో లేకపోవడంపై అనుచరుల అసంతృప్తికి దిగారు. సమావేశం నుంచి మధ్యలోనే  బుద్దా వెంకన్నవెళ్లిపోయారు.  స్టేజిపై నుంచి బుద్దా వెంకన్నను ఆపేందుకు  వర్ల రామయ్య ప్రయత్నించారు.  ఇక్కడ పరిస్థితులు చూసి మొదటిసారి కన్నీళ్లు పెట్టుకున్నానని బుద్దా చెప్పారు.  ప్లెక్సీలో ఫోటో లేనందుకు వెళ్లిపోతున్నాననేది అవాస్తవమన్నారు.  విశాఖలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు  వెళ్తున్నానని చెప్పారు. 

Tue, 13 Sep 202206:51 AM IST

వైసీపీపై సోము వీర్రాజు విసుర్లు….

ఏపీలో ఫ్యామిలీ పార్టీలకు అధికారం అంటే రూలింగ్ కాదని  ట్రేడింగ్‌గా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు.   పోలవరానికి రూ. 55 వేల కోట్లు ఇస్తే , తినేయొచ్చని ఇక్కడి నేతలు ఆశ పడుతున్నారని ఆరోపించారు.  ఏపీలో ఇసుక కంటే బంగారం ఈజీగా దొరుకుతుందని,  గత ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం పేరుతో దోపిడీ చేశారని ఆరోపించారు.  గత ప్రభుత్వ నిర్మించిన టిడ్కో ఇళ్లను ఇప్పటికీ కేటాయించలేదని,  ఇళ్ల నిర్మాణానికి కేంద్రం తన వాటా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా,  జగన్ ప్రభుత్వం తన వాటా ఇవ్వడం లేదని ఆరోపించారు. 

Tue, 13 Sep 202206:50 AM IST

సికింద్రబాద్‌ ప్రమాదంపై పవన్ ఆవేదన

సికింద్రాబాద్ లోని ఓ హోటల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారని తెలిసి ఆవేదనకు లోనయ్యానని పవన్ కళ్యాణ్‌ చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యటకులు ఈ విధంగా ప్రమాదం బారినపడి ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు  ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.  అగ్ని ప్రమాదంలో పలువురు క్షతగాత్రులయ్యారని, కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందిందని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ఆర్థికంగా ఆదుకోవాలని పవన్ కోరారు. 

Tue, 13 Sep 202206:33 AM IST

పాదయాత్రకు కాంగ్రెస్ మద్దతు

రైతుల మహాపాదయాత్రకు  పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌  మద్దతు తెలిపారు.  మంగళగిరిలో రైతుల పాదయాత్రలో  శైలజానాథ్‌ పాల్గొన్నారు.  రైతులు చేసిన త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలని,  3 రాజధానుల పేరిట 30 వేల మంది రైతులను బలి చేయవద్దని,  అమరావతిని రాజధానిగా నిర్మించాలని డిమాండ్ చేస్తున్నామని  పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ చెప్పారు. 

Tue, 13 Sep 202206:26 AM IST

సాగునీటి రంగాన్ని చంద్రబాబు పట్టించుకోలేదు.

చంద్రబాబు ఏనాడూ సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదని  ప్రతి ప్రాజెక్టు పూర్తిచేయాలనేది సీఎం జగన్ ధ్యేయమన్నారు మంత్రి అంబటి రాంబాబు.  పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ రాయలసీమకు వరమని,  పోలవరంను పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని  మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. 

Tue, 13 Sep 202206:25 AM IST

టీడీపీ అధినేత దిగ్బ్రాంతి

సికింద్రాబాద్ అగ్నిప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.  అగ్నిప్రమాదంలో పర్యాటకులు మృతి చెందడం బాధాకరం అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Tue, 13 Sep 202206:24 AM IST

రేషన్ షాపుపై విజిలెన్స్‌ దాడులు

నెల్లూరు జిల్లా కోవూరు బస్టాండ్ కూడలిలో రేషన్ షాపుపై విజిలెన్స్ దాడులు జరిపారు. విజిలెన్స్ అధికారుల దాడుల్లో పట్టుబడిన 20 బస్తాల రేషన్ బియ్యం  పట్టుబడింది.  జగనన్న రేషన్ వాహనంలో తరలిస్తూ పట్టుబడిన రేషన్ బియ్యాన్ని  విజిలెన్స్ డీటీ  సీజ్ చేశారు. 

Tue, 13 Sep 202205:56 AM IST

అసెంబ్లీ నుంచి ఈటల సస్పెన్షన్

బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్‌పై తెలంగాణ అసెంబ్లీలో స‌స్పెన్ష‌న్ విధించారు. స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు ఆయ‌న‌పై స‌స్పెన్ష‌న్ విధించారు. అసెంబ్లీ స‌బ్ రూల్ 2, రూల్ 340 కింద బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్‌ను సస్పెండ్ చేస్తూ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు రాజేంద‌ర్‌ను స‌స్పెండ్ చేశారు. క్షమాపణ చెప్పేందుకు ఈట‌ల నిరాక‌రించార‌ని, అందుకే ఆయ‌న్ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు మంత్రి వేముల తెలిపారు. స్పీక‌ర్ పోచారంను మ‌ర‌మ‌నిషి అని రాజేంద‌ర్ చేసిన‌ వ్యాఖ్య‌ల నేపథ్యంలో ఆ‍యనపై సస్పెన్షన్ వేటు పడింది.

Tue, 13 Sep 202205:37 AM IST

రైతులకు బీజేపీ మద్దతు

రైతుల మహాపాదయాత్రకు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మద్దతు తెలిపారు.  మంగళగిరిలోని రైతుల మహాపాదయాత్రలో బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.  రాజధానిని మార్చడం ద్వారా సీఎం నియంతృత్వ ధోరణి చాటుకున్నారని కన్నా విమర్శించారు.  మూడు రాజధానుల ప్రకటనతో జగన్.. చరిత్రహీనుడిగా నిలిచిపోతారని,  సీఆర్డీఏ చట్టం మార్చవద్దని హైకోర్టు స్పష్టంగా చెప్పిందని కన్నా  లక్ష్మీనారాయణ అన్నారు. 

Tue, 13 Sep 202205:37 AM IST

సికింద్రబాద్‌ ప్రమాదంపై ప్రధాని దిగ్బ్రాంతి

సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి  వ్యక్తం చేశారు. ప్రాణనష్టం జరగడంపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ,  మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా  ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్ గ్రేషియా  చెల్లించనున్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ప్రధాని,  క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

Tue, 13 Sep 202205:37 AM IST

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద కొనసాగుతోంది.  9 గేట్లు 10 అడుగుల మేర ఎత్తిన అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం  ఇన్‍ఫ్లో 2,69,288 క్యూసెక్కులు ఉండగా  ఔట్‍ఫ్లో 3,14,034 క్యూసెక్కులుగా ఉంది.  పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులకు చేరుకుంది.  శ్రీశైలం పూర్తిస్థాయి నీటినిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం  214.3637 టీఎంసీలుగా ఉంది.

Tue, 13 Sep 202205:37 AM IST

తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం

తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. ్రీవారి సర్వదర్శనానికి 29 కంపార్టుమెంట్లలో  భక్తులు  వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 74,231 మంది భక్తులు దర్శించుకున్నారు.   తిరుమలలో శ్రీవారికి 33,591 మంది భక్తులు దర్శించుకున్నారు.  తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.14 కోట్లు లభించింది. 

Tue, 13 Sep 202205:37 AM IST

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు  నేటితో ముగియనున్నాయి. అసెంబ్లీలో రెండు తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు.  విద్యుత్ సంస్కరణలు వెనక్కి తీసుకోవాలని తీర్మానం చేయనున్నారు.  కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కోరుతూ మరో  తీర్మానం  చేయనున్నారు.  మొత్తం ఏడు  బిల్లులపై చర్చించనున్నారు.   జీఎస్టీ, మోటార్ వాహనాల పన్ను, పురపాలక బిల్లులపై చర్చ  జరుగనుంది. వర్సిటీలకు ఉమ్మడి నియామక మండలి ఏర్పాటు బిల్లులపై చర్చిస్తారు.

Tue, 13 Sep 202205:37 AM IST

రెండో రోజుకు చేరుకున్న అమరావతి రైతుల పాదయాత్ర

అమరావతి రైతుల మహాపాదయాత్ర రెండో రోజుకు చేరుకుంది. మంగళగిరి నుంచి దుగ్గిరాల వరకు మహాపాదయాత్ర నిర్వహించనున్నారు.  మంగళగిరిలోని లక్ష్మి నరసింహస్వామి దేవస్థానం నుంచి పాదయాత్ర  ద్వారకానగర్, రేవేంద్రపాడుల మీదుగా దుగ్గిరాల వరకు సాగనుంది

Tue, 13 Sep 202205:37 AM IST

రెండో రోజుకు చేరుకున్న ప్రజా సంగ్రామ యాత్ర

బండి సంజయ్ "ప్రజా సంగ్రామ యాత్ర" రెండో రోజుకు చేరుకుంది. రెండో రోజు చంద్రగిరి నగర్ నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమైంది. చంద్రగిరి నగర్ నుంచి శ్రీనివాస నగర్ లాస్ట్ బస్ స్టాప్, జగద్గిరిగుట్ట, రంగారెడ్డి నగర్, అస్బెస్టర్స్ కాలనీ, చిత్తారమ్మ టెంపుల్ కూకట్పల్లి, వెంకట్రావు నగర్, కూకట్పల్లి విలేజ్, కెపిహెచ్బి కమ్యూనిటీ సెంటర్ వరకు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. ఇవాళ కెపిహెచ్ బి కమ్యూనిటీ సెంటర్ సమీపంలో బండి సంజయ్ రాత్రి బస చేయనున్నారు.