KTR Tweet War : కేంద్రమంత్రితో కేటీఆర్ ట్వీట్ వార్….-tweet war between ktr and union minister mansukh over medical colleges ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Tweet War Between Ktr And Union Minister Mansukh Over Medical Colleges

KTR Tweet War : కేంద్రమంత్రితో కేటీఆర్ ట్వీట్ వార్….

HT Telugu Desk HT Telugu
Aug 30, 2022 06:42 AM IST

మెడికల్‌ కాలేజీల మంజూరు విషయంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి, తెలంగాణ ఐటీ శాఖ మంత్రికి మధ్య ట్విట్టర్‌ వేదికగా గట్టి యుద్ధమే నడిచింది. తెలంగాణ నుంచి ప్రతిపాదనలే రాలేదని కేంద్ర మంత్రి ఆరోపిస్తే, గతంలో కేంద్రానికి రాసిన లేఖలను కేటీఆర్‌ బయటపెట్టారు.

మంత్రి కేటీఆర్(ఫైల్ ఫొటో)
మంత్రి కేటీఆర్(ఫైల్ ఫొటో) (twitter)

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ , కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్దం కొనసాగుతోంది. మెడికల్ కాలేజీల మంజూరుపై వీరిమధ్య హాట్ హాట్ గా చర్చ కొనసాగుతోంది. తెలంగాణకు కేంద్రం ఎనిమిదేండ్లలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. అందుకు సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయా చాలా ఘాటుగా స్పందిస్తూ రీట్వీట్ చేశారు.

తెలంగాణ నుంచి ఎన్ని మెడికల్ కాలేజీలు పంపారో చెప్పాలని అడిగారు. మీరు పంపించింది సున్నా అంటూ ట్వీట్ చేశారు. ప్రతిపాదనలు పంపిన రాష్ట్రాలకు అత్యున్నత ప్రభుత్వ వైద్య కాలేజీలను అతి తక్కువ సమయంలోనే ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంజూరు చేశారని ఈ సందర్భంగా కేంద్రమంత్రి పేర్కొన్నారు. దీనికి మంత్రి కేటీఆర్ సైతం అదే స్థాయిలో రీట్వీట్ చేశారు.

తెలంగాణకు ఏది అడిగినా, రాష్ట్రం నుంచే ఎలాంటి ప్రపోజల్ రాలేదని అబద్దాలు చెప్పడం కేంద్రానికి అలవాటుగా మారిందన్నారు. 2019 ఆగస్టు 30 అప్పటి కేంద్రమంత్రి హర్షవర్దన్ కు పంపిన ప్రపోజల్ లెటర్ తో పాటుగా 2015 నవంబర్ 26న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని రాసిన లేఖలను కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. దీనికి సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు కేటీఆర్.

విభజన హామీల అమలు కోసం తెలంగాణ సర్కార్ ఎన్నోసార్లు అడిగినా కేంద్రం స్పందించ లేదని కేటీఆర్‌ ఆరోపించారు. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వాలని అడిగినా పట్టించుకోలేదన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ లో ఖాళీగా ఉన్న 544 పోస్టుల భర్తీ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఘాటుగా ట్వీట్ చేశారు కేటీఆర్. బీబీనగర్ ఎయిమ్స్ ను యూపీఏ హయంలో మంజూరు చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణకు ఒక్క విద్యా సంస్థను కూడా మీ సర్కార్ మంజూరు చేయలేకపోయిందని ట్వీట్ చేశారాయన. కేటీఆర్‌, కేంద్రమంత్రి మాన్సూఖ్‌ల మధ‌్య మెడికల్ కాలేజీల మంజూరుపై ట్విట్టర్‌ వేదికగా చర్చ చాలా తీవ్ర స్థాయిలోనే జరిగింది. కేటీఆర్‌ ట్వీట్లకు మద్దతుగా పెద్ద ఎత్తున కేంద్ర మంత్రిని ట్రోల్ చేశారు. మొత్తానికి కేంద్రమంత్రి ట్వీట్ కు కేటీఆర్ ఇచ్చిన కౌంటర్ వర్కౌట్ అయితే బాగుంటుంది.

IPL_Entry_Point

టాపిక్