US H-1B visa: వీసా అప్లికేషన్ ప్రక్రియలో మార్పులు; హెచ్ 1 బీ వీసా దరఖాస్తులు సగానికి తగ్గే అవకాశం
US H-1B visa: 2024- 2025 ఆర్థిక సంవత్సరానికి హెచ్ -1 బి వీసా దరఖాస్తు సమర్పణ ప్రక్రియ మార్చి 6, బుధవారం నుండి ప్రారంభమవుతుందని యుఎస్ ఫెడరల్ ఏజెన్సీ యూఎస్సీఐఎస్ (USCIS) వెల్లడించింది. ఈ సంవత్సరం హెచ్ 1 బీ వీసా దరఖాస్తు ప్రక్రియలో కీలక మార్పులు చేశారు.
US H-1B visa application process: 2025 ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్-1బీ వీసా కోసం అప్లై చేసుకునే ప్రక్రియ మార్చి 6 వ తేదీన ప్రారంభం కానుంది. అమెరికా ఫెడరల్ ఏజెన్సీ ఈ స్పెషాలిటీ ఆక్యుపేషన్ వీసా కోసం నిర్వహించే వార్షిక లాటరీలో ఈ ఏడాది జనవరిలో భారీ మార్పును ప్రకటించింది.
మార్చి 6 నుంచి మార్చి 22 వరకు..
2025 ఆర్థిక సంవత్సరానికి గాను H-1B visa ప్రారంభ రిజిస్ట్రేషన్ పీరియడ్ మార్చి 6న ప్రారంభమై మార్చి 22 వరకు కొనసాగుతుందని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (US Citizenship and Immigration Services - USCIS) తెలిపింది. ఆసక్తి, అర్హత కలిగిన నిపుణులైన ఉద్యోగులు తమ యాజమాన్యాల ద్వారా యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అధికారిక వెబ్ సైట్ ద్వారా H-1B visa కోసం అప్లై చేసుకోవచ్చు. సంబంధిత రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించడానికి యుఎస్సిఐఎస్ (USCIS) ఆన్లైన్ ఖాతాను ఉపయోగించాలి.
భారత్, చైనాల నుంచే ఎక్కువ..
హెచ్ -1బి వీసా అనేది నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా. ఇది సైద్ధాంతిక లేదా సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక వృత్తులలో విదేశీ కార్మికులను నియమించడానికి యుఎస్ కంపెనీలను అనుమతిస్తుంది. టెక్నాలజీ కంపెనీలు భారత్, చైనా వంటి దేశాల నుంచి ఏటా పదుల సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటాయి.
వీసా అప్లికేషన్ విధానంలో మార్పులు
ఈ సంవత్సరం నుంచి హెచ్ 1 బీ వీసా (H-1B visa) విధానంలో యూఎస్సీఐఎస్ కీలక మార్పులు చేసింది. ఒకే వ్యక్తి తరఫున ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడం వల్ల గత విధానం దుర్వినియోగమవుతోందని భావించిన యూఎస్సీఐఎస్ ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇకపై హెచ్ -1 బి వీసా దరఖాస్తులను వ్యక్తిగత దరఖాస్తుదారుల ఆధారంగా లెక్కించి స్వీకరించాలని నిర్ణయించింది. అంటే, ఒక ఉద్యోగి తరఫున వేర్వేరు సంస్థల నుంచి ఒకటి కన్నా ఎక్కువ దరఖాస్తులు వచ్చినప్పటికీ.. అవన్నీ ఒకే దరఖాస్తుగా పరిగణించి, లాటరీ కి ఎంపిక చేస్తారు. దీనివల్ల హెచ్ 1 బీ ఎంపిక మరింత పారదర్శకంగా మారుతుందని, దరఖాస్తుదారులకు సమాన అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు.
సగానికి తగ్గనున్న అప్లికేషన్లు
ఈ సంవత్సరం సుమారు 3.5 లక్షల హెచ్ 1 బీ వీసా (H-1B visa) దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నారు. ఇది గత సంవత్సరం వచ్చిన సంఖ్య తో పోలిస్తే దాదాపు సగం మాత్రమే. వీసా దరఖాస్తు ప్రక్రియలో చేపట్టిన మార్పు కారణంగానే అప్లికేషన్ల సంఖ్య భారీగా తగ్గుతుందని భావిస్తున్నారు. గత సంవత్సరం, దాదాపు 759,000 రిజిస్ట్రేషన్‌లలో, 400,000 పైగా నకిలీలుగా తేలింది. కాగా, 2022లో భారతీయులకు 77% H-1B వీసాలు లభించాయి.
ఎంప్లాయీస్ కు ఉపయోగమే..
లాటరీలో ఒక ఉద్యోగి ఎంపిక అయితే, వారి కోసం నమోదు చేసుకున్న వారి యజమానులందరూ H-1B వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బహుళ జాబ్ ఆఫర్‌లను కలిగి ఉన్న ఉద్యోగులకు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది, ఎందుకంటే వారు తమకు బాగా సరిపోయే సంస్థను, ఉద్యోగాన్ని ఎంచుకోవచ్చు. అయితే, ఈ కొత్త నిబంధన యజమానులకు కొంతవరకు సవాళ్లను విసురుతోంది.
పెరిగిన వీసా ఫీజులు
అమెరికా వీసా దరఖాస్తు ఫీజులు కూడా ఇటీవల పెరిగాయి. H-1B వీసాల రుసుము 460 డాలర్ల నుండి 780 డాలర్లకి, L-1 వీసా అప్లికేషన్ ఫీజు 460 డాలర్ల నుండి 1,385 డాలర్లకి, O-1 వీసా ఫీజు 460 డాలర్ల నుండి 1,055 డాలర్లకు పెరిగింది.