Kajal Aggarwal: పర్సనల్ లైఫ్‌లోకి వెళ్లి వచ్చా.. ఒత్తిడి అనుకోవడం కంటే.. కాజల్ అగర్వాల్ కామెంట్స్
Kajal Aggarwal About Lady Oriented Movies: బ్యూటిఫుల్ చందమామ కాజల్ అగర్వాల్ లేడి ఒరియెంటెడ్ సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. సత్యభామ ప్రెస్ మీట్‌లో పర్సనల్ లైఫ్, ఒత్తిడి, బాధ్యతకు సంబంధించిన విషయాలు గురించి చెప్పుకొచ్చింది.
Kajal Aggarwal About Satyabhama Movie: క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న సినిమా సత్యభామ. కాజల్ అగర్వాల్ తొలిసారిగా చేస్తున్న ఈ లేడి ఒరియెంటెండ్ మూవీకి సుమన్ చిక్కాల కథ, దర్శకత్వం వహించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో హీరో నవీన్ చంద్ర మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు మేజర్ డైరెక్టర్ శశికిరణ్ తిక్క సమర్పకులుగా ఉన్నారు.
అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్న సత్యభామ సినిమా జూన్ 7న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల సినిమా విశేషాలు పంచుకునేందుకు ప్రెస్ మీట్ నిర్వహించింది మూవీ టీమ్. ఈ కార్యక్రమంలో కాజల్ అగర్వాల్ ఆసక్తికర విశేషాలు చెప్పారు.
"సత్యభామ సినిమాతో నా కెరీర్‌లో కొత్త ప్రయత్నం చేశా. ఇలాంటి క్యారెక్టర్, మూవీ చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా కథ వినగానే నచ్చింది. కొత్తగా అనిపించింది. అందుకే సినిమా చేసేందుకు ముందుకొచ్చా. నేను ఇలాంటి కథల్లో, క్యారెక్టర్స్‌లో నటించాలి అనేది మైండ్‌లో పెట్టుకోలేదు. మంచి కంటెంట్ ఉంటే ఏ జానర్ అయినా చేస్తాను" అని కాజల్ అగర్వాల్ తెలిపింది.
"సత్యభామ కంటే ముందు ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ కోసం ఆఫర్స్ చాలా వచ్చాయి. అయితే నేను ఆ మూవీస్ చేసేంత కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పుడే ఒప్పుకోవాలని అనుకున్నా. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్నప్పుడు నా మీద ప్రెజర్ ఉంది అనుకోవడం కంటే రెస్పాన్సిబిలిటీ ఉందని అనుకుంటా. ఈ సినిమాలో చాలా కొత్త ఎమోషన్స్ ఉన్నాయి" అని చందమామ కాజల్ అగర్వాల్ పేర్కొంది.
"ఫస్ట్ టైమ్ నా కెరీర్‌లో యాక్షన్, భారీ స్టంట్స్ చేశాను. వాటి కోసం చాలా కష్టపడ్డాను. సత్యభామ నా సెకండ్ ఇన్నింగ్స్ కాదు నా కెరీర్ మరో కొత్త దిశలో వెళ్తుందని అనుకోవచ్చు. యాక్టింగ్ నా ప్యాషన్ అందుకే నా పర్సనల్ లైఫ్‌లోకి వెళ్లిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండూ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది" అని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది.
"ఈ సినిమా మేకింగ్ టైమ్‌లో ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్‌ను కలిసినప్పుడు ఆయన నేడు క్రిమినల్స్ గేమింగ్, వర్చువల్ రియాలిటీ వంటి టెక్నాలజీ ద్వారా క్రైమ్స్ ఎలా చేస్తున్నారో వివరించారు. ఆయన చెప్పిన అంశాలు మాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. వాటిని కథలో పార్ట్ చేశాం. నేను ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. సత్యభామతో ఆ కోరిక తీరిందని అనుకుంటున్నా" అని కాజల్ అగర్వాల్ తెలిపింది.
సత్యభామ ప్రొడ్యూసర్ బాబీ తిక్క మాట్లాడుతూ.. "క్రైమ్ థ్రిల్లర్ కథతో మా సత్యభామ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొందింది. జూన్ 7న థియేటర్స్‌లోకి తీసుకొస్తున్నాం. మా మూవీకి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాం" అని పేర్కొన్నారు. కాగా కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలు చేస్తోంది. సత్యభామతో పాటు ఇండియన్ 2 మూవీలో కూడా కాజల్ యాక్ట్ చేస్తోంది.