Vishwak Sen: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో బూతులపై విశ్వక్ సేన్ క్లారిటీ.. సినిమా విలువ తెలిసిదంటూ!
Vishwak Sen About Gangs Of Godavari Abusive Dialogue: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ట్రైలర్‌లో వినిపించిన బూతు డైలాగ్‌లపై హీరో విశ్వక్ సేన్ క్లారిటీ ఇచ్చాడు. అలాగే సినిమా విలువ తెలిసిందంటూ ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు.
Vishwak Sen Naga Vamsi Gangs Of Godavari: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి". శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి హీరోయిన్స్‌గా నటించారు.
ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా ఇవాళ అంటే మే 31న థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్, నిర్మాత నాగవంశీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఆసక్తికర విశేషాలు తెలిపారు.
ట్రైలర్ లో కొన్ని ఇబ్బందికర సంభాషణలు ఉన్నాయి కదా?
"మా సినిమాలో కేవలం రెండు మూడు మాత్రమే అటువంటి సంభాషణలు ఉన్నాయి. అవి కూడా ట్రైలర్‌కే పరిమితం. సినిమాలో మ్యూట్ చేయబడ్డాయి. అందుకే మా సినిమాకి సెన్సార్ వారు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ట్రైలర్‌లో కూడా ఆ సంభాషణలు ఎందుకు పెట్టామంటే.. ఆ పాత్రలలోని భావోద్వేగాలను ప్రేక్షకులకు నిజాయితీగా పరిచయం చేయడం కోసమే" అని విశ్వక్ సేన్ అన్నారు.
"నిజానికి నేను ఈ సినిమా చేస్తున్న సమయంలో.. ఇది యువతకి మాత్రమే నచ్చేలా ఉంటుంది అనుకున్నాను. కానీ, మొత్తం సినిమా పూర్తయ్యి ఫైనల్ కాపీ చూసిన తరువాత.. నాకు ఈ సినిమా విలువ తెలిసింది. ఎక్కడా ఇబ్బందికర సన్నివేశాలు ఉండవు. చిన్న పిల్లలతో కలిసి చూడొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కుటుంబ ప్రేక్షకుల సినిమా" అని విశ్వక్ సేన్ తెలిపారు.
"కొందరు ట్రైలర్‌లోని కేవలం ఆ రెండు సంభాషణలను ఎందుకు పట్టించుకుంటున్నారో అర్థంకావడం లేదు. ఒక స్లమ్ కుర్రాడు ఎలా మాట్లాడతాడో దానిని నిజాయితీగా చూపించడం కోసం మాత్రమే అలాంటి డైలాగ్‌లు పెట్టడం జరిగింది. సినిమాల పట్ల ఎంతో అవగాహన ఉన్న అన్నపూర్ణ సుప్రియ గారు ఫోన్ చేసి ట్రైలర్ బాగుంది అన్నారు. కథని, పాత్రలను ఫాలో అయితే.. అందులోని ఎమోషన్ మనకి అర్థమవుతుంది" అని నాగ వంశీ వివరణ ఇచ్చారు.
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా ఎలా ఉండబోతుంది?
విశ్వక్ సేన్: కమర్షియల్ అంశాలు ఉంటూనే కొత్తగా ఉంటుంది. తెలుగులో ఇదొక కొత్త ఫార్ములాతో వస్తున్న సినిమా. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' చూశాక ఒక మంచి సినిమా చేశానని సంతృప్తి కలిగింది. నా కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది.
నాగవంశీ: గోదావరి ప్రాంతానికి చెందిన లంకల రత్న అనే ఒక స్లమ్ కుర్రాడు.. రాజకీయాలను వాడుకొని ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమా కథ. కమర్షియల్ అంశాలు ఉంటూనే.. ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా సినిమా ఉంటుంది. లంకల రత్న పాత్ర అందరికీ నచ్చుతుంది.
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' కథ మీ దగ్గరకు ఎలా వచ్చింది?
నాగవంశీ: మొదట కృష్ణ చైతన్య ఈ కథని వేరే హీరోతో అనుకున్నారు. కానీ, ఏవో కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. అప్పుడు చైతన్య వచ్చి త్రివిక్రమ్ గారిని కలిశారు. అలా త్రివిక్రమ్ గారు ఈ కథ వినమని నాకు చెప్పారు. కథ వినగానే చాలా నచ్చింది. వెంటనే సినిమా చేయాలి అనుకున్నాము.