Trivikram: స్టార్ డైరెక్టర్ కొడుకు హీరోగా ఉషా పరిణయం.. ఐటమ్ సాంగ్ షూట్‌లో దర్శకుడు త్రివిక్రమ్
Trivikram At Usha Parinayam Set: గుంటూరు కారం సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్న స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉషా పరిణయం సినిమా సెట్‌లో సందడి చేశారు. ప్రముఖ దర్శకుడు కె విజయభాస్కర్ కుమారుడు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా యూనిట్‌తో ముచ్చటించారు.
Trivikram At Usha Parinayam Set: తెలుగు సినీ రంగంలో దర్శకుడిగా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్లలో ఒకరు కె. విజయ భాస్కర్. ఎన్నో సూపర్ హిట్స్ అందించిన విజయ భాస్కర్ అగ్ర దర్శకుడిగా వెలుగొందారు. ఇప్పుడు మళ్లీ ఓ సరికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రానికి శ్రీకారం చుట్టాడు.
నువ్వేకావాలి, మన్మథుడు, మల్లీశ్వరి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలను తెరకెక్కించిన విజయ భాస్కర్ స్వీయ దర్శకత్వంలో ఉషా పరిణయం అనే బ్యూటిఫుల్ టైటిల్‌తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉపశీర్షిక. విజయ భాస్కర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కె. విజయ భాస్కర్ స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో ఆయన తనయుడు శ్రీ కమల్ హీరోగా నటిస్తున్నారు.
శ్రీ కమల్‌కు జోడీగా తాన్వీ ఆకాంక్ష అనే అచ్చ తెలుగమ్మాయి హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రంతోనే తాన్వీ ఆకాంక్ష హీరోయిన్‌గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. గత కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఐటమ్ సాంగ్‌ను హీరో శ్రీకమల్, ప్రముఖ కథానాయిక సీరత్ కపూర్‌పై చిత్రీకరిస్తున్నారు. ఘల్లు.. ఘల్లు అనే ఈ సాంగ్‌కు విజయ్ పొల్లంకి కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఆర్.ఆర్. ధ్రువన్ సంగీతం అందించారు.
అయితే ఈ సాంగ్ చివరి రోజు, చిత్రీకరణకు చివరి రోజు శుక్రవారం (ఏప్రిల్ 26) ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్న సెట్‌కు స్టార్ రైటర్ అండ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విచ్చేసి టీమ్‌కు ఆల్ దబెస్ట్ చెప్పారు. త్రివిక్రమ్, విజయ భాస్కర్ కలయికలో ఎన్ని సూపర్ హిట్ సినిమాలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సూపర్ హిట్ కాంబినేషన్ చాలా రోజుల తరువాత కలవడం విశేషంగా మారింది.
ఉషా పరిణయం మూవీలోని ఈ ఐటమ్ సాంగ్ చిత్రీకరణతో షూటింగ్ పూర్తయినట్లుగా మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల వారిని అలరిస్తుందనే నమ్మకం ఉందని మేకర్స్ తెలిపారు.
కాగా ఉషా పరిణయం సినిమాలో శ్రీ కమల్, తాన్వి ఆకాంక్షతోపాటు సూర్య, రవి, శివతేజ, అలీ, వెన్నెల కిశోర్, శివాజీ రాజా, ఆమని, సుధ, ఆనంద్ చక్రపాణి, రజిత, బాలక్రిష్ణ, సూర్య, మధుమణి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకి ఆర్ ఆర్ ధ్రువన్ సంగీతం అందిస్తున్నారు. సతీష్ ముత్యాల డీవోపీ చేయగా ఎమ్ ఆర్ వర్మ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.
కాగా, రన్ రాజా రన్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సీరత్ కపూర్ ప్రస్తుతం సైడ్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ చేస్తోంది. ఇటీవలే సేవ్ ది టైగర్స్ సీజన్ 2 వెబ్ సిరీస్‌లో హీరోయిన్ పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు ఉషా పరిణయం సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా గ్లామర్‌తో అలరించనుంది.
ఇక స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో మూడో సినిమాగా వచ్చిన గుంటురు కారం అంచనాలను అందుకోలేకపోయింది.