Vishwak Sen: విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బ్యాడ్ సాంగ్.. చీకటి ప్రపంచంలోని పాత్రలను పరిచయం చేస్తూ!
Vishwak Sen Gangs Of Godavari Bad Theme: విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి బ్యాడ్ థీమ్ సాంగ్ రిలీజయింది. చీకటి ప్రపంచంలోని పాత్రలను పరిచయం చేస్తూ లోతైనా భావాలతో పాటను చిత్రీకరించారు.
Vishwak Sen Gangs Of Godavari Bad Song: తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభ గల యువ కథానాయకులలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకరు. కథలు, పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ.. వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటూ.. ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు.
ఇప్పుడు విశ్వక్ సేన్ మరో విభిన్న చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి"తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో ఆయన "లంకల రత్న" అనే శక్తివంతమైన పాత్రలో కనువిందు చేయనున్నారు. ఈ గ్యాంగ్‌స్టర్ సినిమాకి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే, ఈ చిత్రం నుంచి విడుదలైన 'సుట్టంలా సూసి' (Suttamla Soosi Song) పాట యూట్యూబ్‌లో 50 మిలియన్లకు పైగా వీక్షణలతో సంచలనం సృష్టించింది. అలాగే "మోత" గీతం మాస్‌ని ఉర్రూతలూగిస్తోంది. ఈ చార్ట్‌బస్టర్ల తర్వాత, మేకర్స్ ఇప్పుడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' నుంచి "బ్యాడ్" థీమ్ (Bad Theme Song) సాంగ్‌ను మే 10న ఆవిష్కరించారు.
సంగీతంలో ఎప్పటికప్పుడు వైవిధ్యం చూపిస్తూ.. సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు యువన్ శంకర్ రాజా. ముఖ్యంగా చిత్ర కథా నేపథ్యాన్ని తెలుపుతూ సాగే థీమ్ పాటలను స్వరపరచడంలో ఆయన దిట్ట. ఇప్పుడు "బ్యాడ్" గీతంతో మరోసారి తన అత్యుత్తమ సంగీత ప్రతిభను ప్రదర్శించారు.
యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) తనదైన ప్రత్యేక శైలిలో స్వరపరిచిన ఈ పాట.. సంగీత ప్రియుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం ఖాయమని చెప్పవచ్చు. ఈ "బ్యాడ్" గీతం చిత్రంలోని చీకటి ప్రపంచాన్ని, అందులోని పాత్రలను పరిచయం చేస్తూ సాగింది.
'లంకల రత్న' పాత్ర తీరుని తెలియజేస్తూ సాగిన "బ్యాడ్" గీతంలోని సాహిత్యం అద్భుతంగా ఉంది. బలమైన పదాలతో, లోతైన భావాలను పలికిస్తూ కళ్యాణ్ చక్రవర్తి అందించిన సాహిత్యం కట్టిపడేసింది. ముఖ్యంగా ప్రముఖ రచయిత-దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కలం నుంచి జాలువారిన సాకి.. ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాకి వెంకట్ ఉప్పుటూరి, గోపీ చంద్ ఇన్నమూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
యువ అందాల నటి నేహా శెట్టి (Neha Shetty) కథానాయికగా నటిస్తున్న "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" చిత్రంలో ప్రముఖ హీరోయిన్ అంజలి (Anjali) కీలక పాత్ర పోషిస్తున్నారు. అనిత్ మధాడి కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మే 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.
ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ ఇటీవలే గామి సినిమాతో ప్రేక్షకులను అలరించగా.. నేహా శెట్టి టిల్లు స్క్వేర్ మూవీలో అతిథి పాత్రలో దర్శనం ఇచ్చింది. ఆమె కనిపించిన కొద్దిసేపటికీ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక హీరోయిన్ అంజలి గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ చేసింది. ఈ హారర్ కామెడీ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.