Guntur Kaaram: గుంటూరు కారంపై అవి ప్రభావం చూపలేదు, వాళ్లకు మాత్రం నిరాశ కలగవచ్చు: నిర్మాత నాగవంశీ-naga vamsi about guntur kaaram success and collection ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guntur Kaaram: గుంటూరు కారంపై అవి ప్రభావం చూపలేదు, వాళ్లకు మాత్రం నిరాశ కలగవచ్చు: నిర్మాత నాగవంశీ

Guntur Kaaram: గుంటూరు కారంపై అవి ప్రభావం చూపలేదు, వాళ్లకు మాత్రం నిరాశ కలగవచ్చు: నిర్మాత నాగవంశీ

Sanjiv Kumar HT Telugu
Jan 20, 2024 08:31 AM IST

Naga Vamsi About Guntur Kaaram Success: మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా సక్సెస్‌పై తాజాగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టారు. సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయని నాగవంశీ చెప్పుకొచ్చారు.

గుంటూరు కారంపై అవి ప్రభావం చూపలేదు, వాళ్లకు మాత్రం నిరాశ కలగవచ్చు: నిర్మాత నాగవంశీ
గుంటూరు కారంపై అవి ప్రభావం చూపలేదు, వాళ్లకు మాత్రం నిరాశ కలగవచ్చు: నిర్మాత నాగవంశీ

Guntur Kaaram Naga Vamsi: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలై మొదటి వారంలోనే రూ. 212 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత ఎస్. నాగవంశీ ప్రెస్ మీట్ నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకున్నారు.

"మా గుంటూరు కారం సినిమా విడుదలై నిన్నటితో వారం రోజులు అయింది. కొందరి అంచనాలను తప్పని నిరూపిస్తూ ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టిందని తెలుపుదామని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కొందరు మీడియా వారు ఎందుకో ఈ చిత్రాన్ని ఎక్కువగా ప్రేమించారు. డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్లకు ఫోన్ చేసి కూడా కలెక్షన్ల గురించి ఆరా తీశారు. ఈ సినిమా చాలా బాగా పర్ఫామ్ చేసింది. బయ్యర్లు అందరూ బ్రేక్ ఈవెన్‌కి చేరువయ్యారు. సినిమాకి ఇంత మంచి ఆదరణ లభిస్తుండటంతోనే ఈ ప్రెస్ మీట్ నిర్వహించాను" అని నాగవంశీ అన్నారు.

"రివ్యూలు సినిమాపై ఎటువంటి ప్రభావం చూపలేదు. విడుదలైన రోజు ఉదయం కొందరు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేశారు. కానీ కుటుంబ ప్రేక్షకులు, సాధారణ ప్రేక్షకులు ఎప్పుడైతే సినిమాకి రావడం మొదలుపెట్టారో సాయంత్రానికి ఒక్కసారిగా టాక్ మారిపోయింది. ఇది నేను చెప్పడం కాదు.. ఇప్పటిదాకా సాధించిన వసూళ్లే చెబుతున్నాయి. కుటుంబ ప్రేక్షకులు సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తల్లీకొడుకుల సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. అందుకే ఈ స్థాయి వసూళ్లు వస్తున్నాయి" అని నాగవంశీ తెలిపారు.

సినిమాకి మొదట వచ్చిన టాక్ పై మీ అభిప్రాయం?

కొందరు కావాలని టార్గెట్ చేశారనే అభిప్రాయాలున్నాయి. అర్ధరాత్రి ఒంటి గంట షోలు చేయడం వల్ల కూడా కాస్త మిస్ లీడ్ అయ్యారని అనిపించింది. దీనిని ఫ్యామిలీ సినిమాగా ముందు మేము ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకెళ్లలేదు. 'గుంటూరు కారం'ని పక్కా మాస్ ఫిల్మ్ అనుకొని, అభిమానులు ఏమైనా కాస్త నిరాశ చెందరేమో అనిపించింది. ఇప్పుడు సినిమా పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. మా సినిమాని ఈ స్థాయి వసూళ్లతో ఆదరిస్తూ, బయ్యర్లను నిలబెట్టిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు.

ఈ స్థాయి వసూళ్లు రావడానికి కారణం సంక్రాంతి పండగ అనుకోవచ్చా?

గతంలో మా బ్యానర్ నుంచి పండగకి ఒక సినిమా వచ్చింది. సినిమా బాలేదని రివ్యూలు వచ్చాయి. వసూళ్లు కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. కానీ, ఇప్పుడు గుంటూరు కారం చిత్రం రివ్యూలతో సంబంధం లేకుండా భారీ వసూళ్లు రాబడుతోంది. పండగ కారణమైతే అన్ని సినిమాలు హిట్ కావాలి కదా. పండగకు వచ్చి ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి.

మహేష్ బాబు గారి స్పందన ఏంటి?

మహేష్ బాబు గారు మొదటి నుంచి ఈ సినిమా పట్ల చాలా నమ్మకంగా ఉన్నారు. మొదటి రోజు కొందరి నుంచి నెగటివ్ రివ్యూలు వచ్చినా మహేష్ బాబు గారు ఏమాత్రం ఆందోళన చెందలేదు. రేపటి నుంచి ఈ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయో చూడండి అంటూ మాకు భరోసా ఇచ్చారు. ఆయన అంచనానే నిజమైంది. ఆయన ధైర్యమే ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు రావడానికి కారణమైంది అనిపించింది.

ఇది మాస్ సినిమా అని అందరూ భావించారు. త్రివిక్రమ్ గారి శైలిలో ఉండే ఫ్యామిలీ సినిమా అని ముందుగా ప్రేక్షకులకు తెలిసేలా చేయలేకపోయాము. అయినా జానర్ ను బట్టి ఒక్కో సినిమా ఒక్కో ప్రాంతంలో ఎక్కువ వసూళ్లు రాబడుతుంది. కేవలం ఒక ఏరియా వసూళ్లను చూసి సినిమా ఫలితాన్ని నిర్ణయించలేం. సినిమా విజయం అనేది మొత్తం వసూళ్లపై ఆధారపడి ఉంటుంది.

WhatsApp channel