Mahesh Babu: ఇదే నా చివరి సినిమా అవ్వొచ్చు.. మహేశ్ బాబు కామెంట్స్ వైరల్
Mahesh Babu Guntur Kaaram Suma Interview: సూపర్ స్టార్ మహేశ్ బాబు, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా గుంటూరు కారం. తాజాగా వీరిద్దరిని యాంకర్ సుమ ఇంటర్వ్యూ చేయగా.. అందులో ఇదే తన లాస్ట్ సినిమా అవ్వొచ్చు అని మహేశ్ బాబు ఊహించని కామెంట్స్ చేశాడు.
Mahesh Babu In Guntur Kaaram Suma Interview: సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన మూవీ గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తర్వాత కాంబినేషన్‌లో మూడోసారి వచ్చిన గుంటూరు కారంపై టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే జనవరి 12న సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమాకు పబ్లిక్ టాక్ మరోలా వచ్చింది.
గుంటూరు కారం మూవీకి మొదటి షో నుంచి మిక్స్‌డ్ టాక్, రివ్యూలు వస్తున్నాయి. సినిమా ఎలా ఉన్న మహేశ్ బాబు పర్ఫామెన్స్ మాత్రం అదిరిపోయిందని జనాలు అంటున్నారు. ముఖ్యంగా డ్యాన్స్ ఇరగదీశాడని, డ్యాన్స్‌లో మహేశ్ బాబు విశ్వరూపం చూపించాడని ప్రంశంసలు కురిపిస్తున్నారు. ఇక సినిమాపై టాక్ ఎలా ఉన్నా గుంటూరు కారం సినిమాను జనాల్లోకి తీసుకునేందుకు ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.
అందులో భాగంగానే తాజాగా మహేశ్ బాబు, శ్రీలీలను పాపులర్ యాంకర్ సుమ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో తన డ్యాన్స్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు మహేశ్ బాబు. "మీ పర్ఫామెన్స్ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. డ్యాన్స్ గురించి విడిగా చెప్పక్కర్లేదు" అని శ్రీలీలతో అన్న సుమ.. ఒక్కసారిగా.. "అయితే, మహేశ్ బాబు గారు.. మీరైతే డ్యాన్సులు ఈసారి చించి ఇరగదీశారు. టూ.. టూ.. టూ గుడ్ అండి" అని అంది. దానికి "చించి అవతల పడేశారు" అని శ్రీలీల చెప్పింది.
"ముందు నుంచి నేను, తివిక్రమ్ ఒకటి అనుకున్నాం. ఈ సినిమాలో రెండు పాటలు అయితే బాగా చేయాలి అని ఫస్ట్ నుంచే ఒకటి ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే.. దీని తర్వాత రెగ్యులర్‌గా తెలుగు సినిమా పాటలు చేస్తానో తెలియదు. నాకు తెలిసినంతవరకు ఇది నా లాస్ట్ తెలుగు ఫిల్మ్ అయి ఉండొచ్చు. అంటే డ్యాన్స్ నెంబర్స్‌లో. డ్యాన్స్ నెంబర్స్ చేసే చివరి సినిమా అవ్వొచ్చు" అని మహేశ్ బాబు అన్నాడు. దానికి సుమ.. "నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా. మళ్లీ మీరు నాకు మూడేళ్ల తర్వాతే ఇంటర్వ్యూ ఇచ్చేది" అని అంది.
"అంటే, అలా కాదు. మళ్లీ ఇలా రెగ్యులర్‌గా తెలుగు సినిమా పాటలు వస్తాయో లేదో తెలియదు. అందుకే దీని కోసం మనస్ఫూర్తిగా ప్రయత్నించాలని అనుకున్నాను. రెండు పాటలు అయితే చాలా బాగా చేద్దామని ఫిక్స్ అయ్యాను. ముందుగా ఇంట్రడక్షన్ సాంగ్ గురించి శేఖర్ మాస్టర్‌తో డిస్కషన్ చేశాం. రీహార్సెల్స్ చేశాం. చాలా బాగా వచ్చింది. ఇక నెక్లెస్ గొలుసు అనే పాట ముందే షూట్ చేశాం. చెప్పవే చిరుగాలి, నెక్లెస్ గొలుసు ఇలా ఐటమ్ ఉంటాయని ముందే అనుకున్నాం" అని మహేశ్ బాబు తెలిపాడు.
"నెక్లెస్ గొలుసు ఎలా చేస్తానా అనే ఒక ఆలోచన ఉంది. ఈ అమ్మాయితో నెక్లెసు గొలుసు ఎలా చేయాలి. ఏంటీ అనుకున్నాను. ఈ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది. దాని దగ్గర నుంచి నెక్లెసు గొలుసుకు వెళ్తుంది. అమ్మాయి వచ్చి చేసేస్తాను అంది. ఫైనల్‌గా షూటింగ్‌కు వచ్చాక ఈ అమ్మాయితో ఎలా చేయాలి అని టెన్షన్ వచ్చేసింది. టెన్షన్ అంటే అసలు ఎలా ముందుకు వెళ్దాం" అని మహేశ్ బాబు చెప్పుకొచ్చాడు.