Nagarjuna Mahesh Babu: మహేశ్ బాబుతో నాగార్జున మల్టీ స్టారర్ మూవీ.. అదెప్పుడో చెప్పిన కింగ్
Nagarjuna In Naa Saami Ranga Interview: సూపర్ స్టార్ మహేశ్ బాబుతో మల్టీ స్టారర్ మూవీపై తాజాగా కింగ్ నాగార్జున స్పందించారు. అది ఎప్పుడు వస్తుందో నా సామిరంగ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీంతో నాగార్జున కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Nagarjuna Mahesh Babu Multistarrer: అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ మూవీ నా సామిరంగ. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్న ఈ సినిమాను జనవరి 14న సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేస్తున్నారు. నా సామిరంగ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు నాగార్జున. ఈ ఇంటర్వ్యూలో మహేశ్ బాబుతో మల్టీ స్టారర్ మూవీపై ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు నాగార్జున.
‘నా సామిరంగ’మీ కెరీర్ లో వేగంగా పూర్తి చేసుకున్న సినిమా అనుకోవచ్చా?
షూటింగ్ డేట్ నుంచి మొదలు పెడితే రిలీజ్ డేట్ కి చిత్రీకరణ వేగంగా జరుపుకున్న సినిమా అనొచ్చు. వర్కింగ్ డేస్ లో మాత్రం కాదు. చాలా సినిమాలు 35 రోజుల్లో చేశాం. ‘నా సామిరంగ’ 72 రోజుల పాటు చిత్రీకరణ చేశాం. నేను 60 రోజులు పని చేశాను. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కాగా చేసుకుంటే.. ఇంత ఫాస్ట్ వర్క్ చేయడం సాధ్యపడుతుంది. ఈ చిత్రానికి చాలా మంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాం. కీరవాణి గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉండటం మా అదృష్టం. మూడు పాటలు షూటింగ్ కి ముందే ఇచ్చేశారు. అలానే ఫైట్ సీక్వెన్స్ కి కూడా నేపథ్య సంగీతం చేశారు. బీజీఎమ్ పెట్టుకొని ఫైట్ షూట్ చేశాం. ఇంత ఫాస్ట్ గా, ఇంత పెద్ద స్కేల్ లో చేశామంటే దానికి కీరవాణి గారు ఒక కారణం. ఇందులో ప్రతి పాట అద్భుతంగా ఉంటుంది. మా సినిమాకి కీరవాణి గారే స్టార్.
‘నా సామిరంగ’ కథలో మిమ్మల్ని ఎట్రాక్ట్ చేసిన అంశాలు ఏమిటి ?
అన్ని ఎలిమెంట్స్ నచ్చాయి. మంచి స్నేహం, ప్రేమ, త్యాగం, విశ్వాసం.. ఇలా హ్యూమన్ ఎమోషన్స్ కూడిన చాలా అద్భుతమైన కథ ఇది. భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజుల్లో జరిగే కథ ఇది. మనకి సంక్రాంతిపెద్ద పండగ. ఇది 80వ నేపథ్యంలో జరిగే కథ. ఇది పండక్కి అందరూ చూడాల్సిన సినిమా. ఇది మలయాళీ మూలకథ. వారి కథలు, పాత్రలు స్లోగా మొదలౌతాయి. తెలుగులో కథ సోల్ మిస్ అవ్వకుండా చేశాం. ఈ విషయంలో దర్శకుడు బిన్నీకి క్రెడిట్ ఇస్తాను. చాలా చక్కగా డిజైన్ చేశాడు. ప్రసన్న తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా చక్కగా మార్చాడు.
ఆషికా రంగనాథ్, నరేష్, రాజ్ తరుణ్ గురించి ?
ఇందులో చాలా టిపికల్ లవ్ స్టొరీ ఉంది. నేను కిష్టయ్య పాత్రలో కనిపిస్తాను. మా ఇద్దరి మధ్య 12 ఏళ్ల నుంచి ఒక ప్రేమకథ నడుస్తుంది. 30 ఏళ్లు వచ్చిన తర్వాత మళ్లీ పరిచయమై మాట్లాడకుండానే వాళ్ల ప్రేమకథ నడుస్తుంది. చాలా డిఫరెంట్ లవ్ స్టొరీ ఇది. ఆషికా చాలా చక్కగా నటించింది. విజయ్ బిన్నీ ప్రాజెక్ట్ లోకి రాకముందే నరేష్ పాత్రని అనుకున్నాం. సోదరభావం ఉన్న ఆ పాత్రకు నరేష్ కరెక్ట్ గా సూట్ అవుతారనిపించింది. అలాగే రాజ్ తరుణ్‌ది కూడా కథలో కీలకమైన పాత్రే.
దర్శకుడు విజయ్ బిన్నీ, టైటిల్ గురించి ?
విజయ్ కి చాలా మంచి విజువల్ సెన్స్ ఉంది. తను కొరియోగ్రఫీ చేసిన పాటలు చూశాను. డ్యాన్స్‌లా కాకుండా పాటలోనే మంచి కథని చెప్పే నేర్పు తనలో ఉంది. అది నాకు చాలా నచ్చింది. ఇది కథ తనకి ఇచ్చి ఎలా చేస్తావని చెప్పమన్నప్పుడు.. తను అనుకున్న పద్దతిలో చెప్పాడు. అది మా అందరికీ నచ్చింది. బిన్నీ చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. నాన్న గారి పాట నుంచి వచ్చిన టైటిల్ ఇది. మన కథకు బాగా నప్పుతుందనిపించింది. సినిమాలో చాలా చోట్ల ఈ టైటిల్ వినిపిస్తూనే ఉంటుంది.
అనుకున్న సమయానికి రెడీ చేయడం సవాల్‌గా అనిపించిందా ?
నా కంటే ఎక్కువగా డైరెక్టర్, కెమెరా డిపార్ట్మెంట్ రౌండ్ ది క్లాక్ పని చేశారు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్, మ్యూజిక్, ఎడిటింగ్, ఇలా అన్నీ విభాగాలు మంచి సమన్వయంతో పని చేశాయి. శ్రీనివాస చిట్టూరి వండర్ ఫుల్ ప్రొడ్యూసర్. మా మధ్య మంచి బాండింగ్ ఉంది. ఎక్కడా వెనకడుగు వేయరు. సినిమాకి కావాల్సిన ప్రతిది రాజీపడకుండా సమకూరుస్తారు. యాక్షన్ సీక్వెన్స్‌లు చాలా మ్యాసీగా ఉంటాయి. నా సినిమాల వరకూ నా సామిరంగ వెరీ మ్యాసీ అనే చెప్పాలి.
మహేష్ బాబు గారితో కలసి సినిమా చేసి, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు లెగసిని కొనసాగించాలని గతంలో ఓ ట్వీట్ చేశారు కదా. ఆ సినిమా చర్చలు జరుగుతున్నాయా ?
మహేశ్ బాబు.. రాజమౌళి గారితో సినిమా పూర్తి చేసిన తర్వాతే దాని గురించి ఆలోచించాలి.(నవ్వుతూ). ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాను.