Vishwak Sen: విశ్వక్ సేన్‌పై ఆ డౌట్ ఉండేది.. త్రివిక్రమ్ సలహాతోనే కథ చెప్పా: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డైరెక్టర్-gangs of godavari director krishna chaitanya about trivikram and vishwak sen godavari slang ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vishwak Sen: విశ్వక్ సేన్‌పై ఆ డౌట్ ఉండేది.. త్రివిక్రమ్ సలహాతోనే కథ చెప్పా: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డైరెక్టర్

Vishwak Sen: విశ్వక్ సేన్‌పై ఆ డౌట్ ఉండేది.. త్రివిక్రమ్ సలహాతోనే కథ చెప్పా: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డైరెక్టర్

Sanjiv Kumar HT Telugu
May 30, 2024 08:36 AM IST

Gangs Of Godavari Director Krishna Chaitanya Vishwak Sen: విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సూచనతోనే విశ్వక్ సేన్‌కు ఈ మూవీ కథ చెప్పినట్లు, కానీ విశ్వక్‌పై డౌట్ ఉండేదని సినిమా డైరెక్టర్ కృష్ణ చైతన్య తెలిపారు.

విశ్వక్ సేన్‌పై ఆ డౌట్ ఉండేది.. త్రివిక్రమ్ సలహాతోనే కథ చెప్పా: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డైరెక్టర్
విశ్వక్ సేన్‌పై ఆ డౌట్ ఉండేది.. త్రివిక్రమ్ సలహాతోనే కథ చెప్పా: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డైరెక్టర్

Gangs Of Godavari Krishna Chaitanya Trivikram Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు.

నేహా శెట్టి (Neha Shetty), అంజలి (Anjali) హీరోయిన్స్‌గా నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs Of Godavari Movie) సినిమా భారీ అంచనాలతో మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన దర్శకుడు కృష్ణ చైతన్య (Krishna Chaitanya) సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

"గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" ప్రయాణం ఎలా మొదలైంది?

దర్శకుడిగా ప్లానింగ్‌లో ఉన్న చిత్రాలు ఆలస్యం అవటం, మరీ గ్యాప్ ఎక్కువైపోతోంది అనే భయం నాలో మొదలైంది. అదే విషయాన్ని త్రివిక్రమ్ (Trivikram Srinivas) గారితో పంచుకున్నాను. ఆయన సూచనతో విశ్వక్ సేన్‌కి (Vishwak Sen) కథ చెప్పాను. విశ్వక్‌కి కథ నచ్చడంతో అలా ఈ సినిమా ప్రయాణం మొదలైంది.

ఈ సినిమా ఎలా ఉండబోతుంది?

గోదావరి అనగానే కొబ్బరి చెట్లు చూపించి, అంతా ప్రశాంతంగా ఉంది అన్నట్టుగా చూపిస్తారు. కానీ, నిజానికి మా ప్రాంతంలో కూడా నేరాలు జరుగుతాయి. ప్రాంతాలను బట్టి కాకుండా మనుషులను బట్టి నేరాలు జరుగుతాయి. ఆ ఆలోచన నుంచి పుట్టినదే ఈ కథ. అయితే ఇది కల్పిత కథనే. దీనిని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే.. దీని ద్వారా ఒక మంచి కథను చూపించవచ్చు. ఒక మంచి ఎమోషన్‌ను చూపించవచ్చు.

ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ విజువల్‌ని చూపించవచ్చు అని భావించాను. నా ఆలోచనకు తగ్గట్టుగా సితార లాంటి మంచి నిర్మాణ సంస్థ దొరికింది. కొందరు ఇది గ్యాంగ్ స్టర్ మూవీ అనుకుంటున్నారు. కానీ, ఇది గ్యాంగ్ స్టర్ మూవీ కాదు.

విశ్వక్ సేన్ కోసం కథలో ఏమైనా మార్పులు చేశారా?

విశ్వక్ కోసం ఎటువంటి మార్పులు చేయలేదు. మొదట ఏదైతే కథ రాసుకున్నామో.. అదే విశ్వక్‌తో చేయడం జరిగింది. అయితే విశ్వక్ తెలంగాణలో పెరిగిన వ్యక్తి కాబట్టి.. గోదావరి మాండలికాన్ని (Godavari Slang) సరిగ్గా చెప్పగలడా అని కొంచెం సందేహం కలిగింది. కనీసం రెండు మూడు నెలలు ట్రైనింగ్ అవసరమవుతుంది అనుకున్నాను. కానీ, నెల రోజుల లోపులోనే నేర్చుకొని విశ్వక్ సేన్ ఆశ్చర్యపరిచాడు.

అభ్యంతరకర సంభాషణలు ఉన్నాయి. దీనిపై మీ అభిప్రాయం?

మా సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. కుటుంబమంతా కలిసి చూడొచ్చు. సంభాషణల పరంగా రెండు చోట్ల మాత్రమే మ్యూట్ వేశారు. అవే మీరు ట్రైలర్‌లో చూశారు. ట్రైలర్‌కి సెన్సార్ అభ్యంతరాలు ఉండవు. అందుకే ఆ సన్నివేశాల్లోని భావోద్వేగాన్ని బాగా అర్థమయ్యేలా చెప్పడం కోసం ఆ సంభాషణలను ట్రైలర్‌లో అలాగే ఉంచడం జరిగింది. సినిమాలో మాత్రం ఆ రెండు అభ్యంతరకర పదాలు వినిపించవు.

Whats_app_banner