H-1B visa: హెచ్-1బీ వీసా ఆన్ లైన్ ఫైలింగ్ పై కీలక అప్ డేట్; ఆర్గైనైజేషనల్ అకౌంట్స్ తో అక్రమాలకు అడ్డు..
H-1B visa update: 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హెచ్ 1 బీ వీసా ఆన్ లైన్ ఫైలింగ్ పై యూఎస్సీఐఎస్ (USCIS) కీలక ప్రకటన చేసింది. ఈ ప్రక్రియ ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందని వెల్లడించింది.
2025 ఆర్థిక సంవత్సరానికి గానూ హెచ్ -1 బీ (H-1B visa) దరఖాస్తుల కోసం ఆన్ లైన్ దరఖాస్తు ఫైలింగ్ ప్రక్రియ ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందని యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ప్రకటించింది. ఈ సంవత్సరం నుంచి యూఎస్సీఐఎస్ ఆర్గైనైజేషనల్ అకౌంట్స్ ను ప్రవేశపెట్టడంతో హెచ్-1బీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం కానుంది.
ఏంటీ ఆర్గైనైజేషనల్ అకౌంట్స్?
హెచ్ 1 బీ వీసా అప్లికేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఈ ఆర్గనైజేషనల్ అకౌంట్స్ (organisational accounts) విధానాన్ని ప్రారంభించారు. ఒక కంపెనీ లేదా వ్యాపార సంస్థ లోని ఉద్యోగులకు హెచ్ 1 బీ వీసా అప్లికేషన్ ను రూపొందించే ప్రక్రియలో ఆయా వ్యాపార సంస్థలు, న్యాయ సలహాదారులు ఈ అకౌంట్స్ ద్వారా సమన్వయం చేసుకునే వీలు లభిస్తుంది. ఈ అకౌంట్ ద్వారా, నాన్ ఇమిగ్రంట్ వర్కర్ కోసం సమర్పించే ఫామ్ ఐ 129 (I-129), ప్రీమియం ప్రాసెసింగ్ సర్వీస్ కు అవకాశం కల్పించే ఫామ్ ఐ 907 (I-907) లను సులభంగా అప్లై చేయవచ్చు.
మంచి ముందడుగు
ఈ విధానం ద్వారా మరింత మెరుగైన సేవలు అందుతాయని, ఇది హెచ్ 1 బీ వీసా (H-1B visa) ఆన్ లైన్ అప్లికేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయడంలో ఒక ముందడుగు గా భావిస్తున్నామని యూఎస్సీఐఎస్ డైరెక్టర్ ఎం జాడౌ తెలిపారు. ఆర్గనైజేషనల్ అకౌంట్స్ ను ప్రారంభించిన తర్వాత, ఐ -129, హెచ్ -1 బి పిటిషన్ల ఆన్ లైన్ ఫైలింగ్ ను ప్రారంభించిన తర్వాత, మొత్తం హెచ్ -1 బీ అప్లికేషన్ విధానం పూర్తిగా ఎలక్ట్రానిక్ అవుతుందన్నారు. రిజిస్ట్రేషన్ నుంచి, అప్లికేషన్ పై తీసుకున్న తుది నిర్ణయాన్ని విదేశాంగ శాఖకు తెలియజేసే వరకు అంతా ఆన్ లైన్ అవుతుందన్నారు.
మూడు వేర్వేరు పద్ధతులు
ఆర్గనైజేషనల్ అకౌంట్స్ వివరాలు, హెచ్ -1బీ రిజిస్ట్రేషన్ తేదీలకు సంబంధించిన సమాచారాన్ని ఈ జనవరి నెలాఖరుకల్లా యూఎస్ సీఐఎస్ అధికారికంగా వెల్లడించనుంది. కాగా, హెచ్-1బీ వీసా కోసం మూడు వేర్వేరు పద్ధతుల్లో అప్లై చేసుకోవచ్చు. అవి 1. ఆర్గనైజేషనల్ అకౌంట్స్ ద్వారా; 2. పిటిషనర్ లీగల్ రిప్రజెంటేషన్ ద్వారా; 3. గతంలో అప్లై చేసుకున్న సంప్రదాయ విధానంలో. కాగా, హెచ్ -1బీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించడానికి ముందు, సంస్థలు మరియు న్యాయ సలహాదారులకు సహాయపడటానికి యుఎస్ సీఐఎస్ జనవరి 23, జనవరి 24 తేదీల్లో ఆర్గనైజేషనల్ అకౌంట్స్ పై రెండు దేశవ్యాప్త అవగాహన కార్యక్రమాలను నిర్వహించనుంది.
60,000 వీసాలు..
60,000 వీసా వార్షిక పరిమితిని కొనసాగిస్తూనే హెచ్ -1బీ వ్యవస్థ పనితీరును మరింత మెరుగుపరచడానికి బైడెన్ ప్రభుత్వం పలు మార్పులు చేసింది. అందులో భాగంగానే ఆర్గనైజేషనల్ అకౌంట్స్ ను ప్రారంభించింది. ఈ విధానం వల్ల హెచ్ 1 బీ వీసా అప్లికేషన్ విధానంలో మోసాలకు, అక్రమాలకు కూడా తెరపడుతుందని యూఎస్సీఐఎస్ భావిస్తోంది. ఒకే ఎంప్లాయీ కోసం అనేక రిజిస్ట్రేషన్లను సమర్పించకుండా ఈ విధానం అడ్డుకుంటుంది.