Curd for Weigh Loss | బరువు తగ్గాలనుకుంటే పెరుగుతో కలుపుకొని ఇలా తినండి!-simple and tasty curd recipes that can help with weight loss ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Curd For Weigh Loss | బరువు తగ్గాలనుకుంటే పెరుగుతో కలుపుకొని ఇలా తినండి!

Curd for Weigh Loss | బరువు తగ్గాలనుకుంటే పెరుగుతో కలుపుకొని ఇలా తినండి!

HT Telugu Desk HT Telugu
Sep 20, 2022 03:55 PM IST

బరువు తగ్గాలని కోరుకునేవారు ఇష్టమైనవి తినడం మానేయాల్సిన అవసరం లేదు. అందులో పెరుగు కలుపుకుంటే చాలు. బరువు తగ్గేందుకు పెరుగుతో కలిపి చేసుకునే ఉత్తమ రెసిపీలు ఇక్కడ చూడండి.

<p>Curd Recipes for Weight Loss</p>
Curd Recipes for Weight Loss (Pixabay)

బరువు పెరగటం సులువే కానీ, పెరిగిన బరువు తగ్గించుకోవాలంటే మాత్రం అంత సులువేం కాదు. అధిక బరువును తగ్గించుకోవాలనుకుంటే అందుకు మీలో దృఢమైన సంకల్పం ఏర్పర్చుకోవాలి. మంచి శక్తినిచ్చే పోషకభరితమైన ఆహారాలను తీసుకోవాలి అయితే కేలరీలు తక్కువగా ఉండే సరైన ఆహారాన్ని తీసుకోవడంపై దృష్టిపెట్టాలి. ఇష్టారీతిన ఏదిపడితే అది తినేస్తే బరువు పెరగొచ్చు, కానీ తగ్గాలంటే మాత్రం మనకు ఇష్టమైన ఆహారాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. కానీ, మనసుంటే మార్గం ఉంటుంది అని సామెత ఉన్నట్లుగా కొన్ని మార్గాలను అనుసరించటం ద్వారా మనకు ఇష్టమైనవి తింటూ కూడా బరువు తగ్గవచ్చు.

ఎలా అంటే.. మనందరికీ తెలుసు పెరుగు అనేది ఉత్తమ ప్రోబయోటిక్స్‌లో ఒకటి. పెరుగు తింటే అది శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది. అంతేకాదు ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడే అద్భుతమైన పదార్థం.

Curd Recipes for Weight Loss

మీరు బరువు తగ్గాలని కోరుకుంటే పెరుగుతో కలిపి చేసుకొనే కొన్ని రుచికరమైన వంటకాలను ఇక్కడ తెలియజేస్తున్నాం. ఇవి తింటే కడుపుకి తృప్తి లభించటంతో పాటు, అధిక బరువును తగ్గించుకోగలుగుతారు.

ఓట్స్ పెరుగు మసాలాతో అల్పాహారం

ఓట్స్ బరువు తగ్గడానికి ఉత్తమమైనవిగా పరిగణించవచ్చు. బరువు తగ్గే ఆలోచన ఉన్నవారు ప్రతిరోజు బ్రేక్ ఫాస్ట్ కోసం అనేక రకాల ఓట్స్ వంటకాలను తయారు చేసుకోవాలి. ఈ రెసిపీలలో పెరుగు కలుపుకోవడం వలన ఇక్కడే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది.

ఓట్స్ పెరుగు మసాలా రెసిపీని ప్రయత్నించవచ్చు. నానబెట్టిన ఓట్స్‌లో ఇష్టమైన కూరగాయలను కలిపి పెరుగులో వేసి, ఆపై ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, చిటికెడు కారం వేసుకుంటే ఓట్స్ మసాలా రెడీ అయినట్లే. ఇది చేసుకోవటానికి 10-15 నిమిషాలు మాత్రమే పడుతుంది.

పెరుగు కోడికూరతో లంచ్

చికెన్ బటర్ మసాలాకు బదులు, చికెన్ పెరుగు మసాలా ప్రయత్నించండి. ఇది మీరు బరువు తగ్గడానికి అనుకూలమైన లంచ్ రెసిపీ. ఈ వంటకంలో ప్రోటీన్లు ఎక్కువగా, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. పెరుగుతో చేసే ఈ రుచికరమైన చికెన్ కర్రీని ఇలా చేసుకోండి. ముందుగా పెరుగు తీసుకుని అందులో జీలకర్ర పొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పసుపు, కారం వేసి చేతులతో బాగా కలపాలి. దీంట్లో ఫ్యాట్ లేని చికెన్ వేసి, కొన్ని తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. దీనిని 30 నిమిషాల పాటు మెరినేట్ చేయండి. ఇప్పుడు ఒక బాణలిలో 2 టీస్పూన్ల నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు వేసి ఒక నిమిషం ఉడికించండి. ఆపై చికెన్ మిశ్రమం వేసి గ్రేవీ స్థిరత్వాన్ని చేరుకునే వరకు ఉడికించాలి. పైనుంచి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి తింటూ ఆనందించండి.

పెరుగు చాట్‌తో సాయంత్రం స్నాక్స్

పచ్చి బఠానీలలో ప్రోటీన్లు దండిగా ఉంటాయి. ఉడికించిన పచ్చి బఠానీలలో పెరుగు కలుపుకొని చాట్ చేసుకోండి. రుచికోసం ఇందులో మీకు నచ్చిన మసాలా దినుసులను, కొద్దిగా ఉప్పును వేసుకోండి. ఈ చాట్ తో సాయంత్రం వేళ స్నాక్స్ చేసుకొని తినండి. బరువు తగ్గే మీ మీ డైట్‌లో ఈ రెసిపీ కచ్చితంగా ఉండాలి.

వెజిటెబుల్ రైతాతో ముగించండి

మీకు ఇష్టమైన కూరగాయలను కట్ చేసి పెరుగులో కలపాలి. ఆపై పైనుంచి కొద్దిగా మసాలా చల్లుకుంటే వెజిటెబుల్ రైతా సిద్ధమైనట్లే. ఇది ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం. మీరు ఫ్లాక్స్ సీడ్స్ తో కూడా రైతా చేసుకోవచ్చు. అవిసె గింజల్లో ఒమేగా -3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలో సహాయపడటమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. మీ చివరి భోజనాన్ని ఇలా రైతాతో ముగించండి. రాత్రికి భోజనం చేయకపోవటమే మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం