Cooling Foods । వేడి వాతావరణంలో మిమ్మల్ని చల్లగా ఉంచే ఆహార పదార్థాలు ఇవే!-season changing from spring to summer here are some cooling foods to keep you healthy ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Season Changing From Spring To Summer, Here Are Some Cooling Foods To Keep You Healthy

Cooling Foods । వేడి వాతావరణంలో మిమ్మల్ని చల్లగా ఉంచే ఆహార పదార్థాలు ఇవే!

HT Telugu Desk HT Telugu
Feb 15, 2023 08:02 AM IST

Cooling Foods For Summer: చలికాలం పూర్తిగా వీడకముందే వేడి, ఉక్కపోతలను ఎదుర్కొంటున్నారా? మీ శరీరాన్ని చల్లగా, హైడ్రేట్ గా ఉంచే ఆహార పదార్థాల జాబితాను ఇక్కడ చూడండి.

Cooling Foods For Summer
Cooling Foods For Summer (Pixabay)

Cooling Foods For Summer: శివరాత్రి తర్వాత శివ శివ అంటూ చలి వీడుతుందని అప్పట్లో పెద్దలు అంటుండేవారు. శివరాత్రి ఇంకా రానే లేదు, చలికాలం ఇంకా పూర్తిగా వీడనే లేదు, అప్పుడే వేసవి తాపం మాత్రం మొదలయినట్లే ఉంది. దేశంలో మెల్లిమెల్లిగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా మీ దినచర్యలో మీరు అనేక మార్పులు చేసుకోవాలి.

ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ మీ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం తప్పనిసరి. మీ శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి మీరు రోజులో తాగే నీటి శాతం పెంచడం మాత్రమే సరిపోదు, మీరు నిర్జలీకరణానికి గురికాకుండా ఉండటానికి, వేడిని అధిగమించడానికి, మీ రోజూవారీ డైట్‌లో కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాలను చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందులో కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం.

ఉల్లిపాయలు- Onions

వేసవిలో ఉల్లిపాయలు పచ్చిగా తినడం చాలా అవసరం. ఇవి చల్లదనాన్ని కలిగి ఉంటాయి. మీరు పచ్చిగా తినలేకపోతే కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలిపి సలాడ్ల రూపంలో తీసుకోవచ్చు. మీరు పప్పులు, కూరగాయలు, రైతాలలో ఉల్లిపాయను చేర్చుకోవడం కూడా చేయాలి. తెల్లని ఉల్లిపాయల కంటే ఎర్ర ఉల్లిపాయలలో క్వెర్సెటిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది, ఇది సహజమైన యాంటీ-అలెర్జెన్‌గా పనిచేస్తుంది.

దోసకాయలు- Cucumbers

దోసకాయలు మీరు వేసవిలో తీసుకునే మరొక అద్భుతమైన కూరగాయ. వీటిలో పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేసవిలో వీటిని తినడం ద్వారా మలబద్దకంను నివారిస్తుంది. దోసకాయలు కూడా గణనీయమైన నీటి శాతాన్ని కలిగి ఉంటాయి. వేడి వాతావరణంలో చల్లగా ఉండటానికి, మీరు దీన్ని నేరుగా తినవచ్చు, సలాడ్‌లలో కలపవచ్చు లేదా దోసకాయ రిఫ్రెష్ డ్రింక్‌ని తయారు చేసుకొని తాగవచ్చు.

నిమ్మకాయలు- Lemons

వేసవిలో నిమ్మకాయలు ఖరీదవుతాయి. ఎందుకంటే ప్రతి ఇంట్లో నిమ్మకాయల వినియోగం పెరిగిపోతుంది. వేసవిలో ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం కలిపి తాగటం తప్పనిసరి. ఇది మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. మీకు మరింత శక్తిని ఇస్తుంది, మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది, మీ శరీరంలో విటమిన్ సి మొత్తాన్ని పెంచుతుంది. మీరు పప్పులు, కూరల్లో కూడా కొంచెం నిమ్మరసాన్ని పిండికొని రుచిని ఆస్వాదించవచ్చు.

పుచ్చకాయలు- Watermelons

వేసవిలో ప్రధానంగా ఎదురయ్యే సమస్యలలో డీహైడ్రేషన్ ఒకటి. పుచ్చకాయలలోని అధిక నీటి కంటెంట్ మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది కాబట్టి పుచ్చకాయలు తప్పకుండా తింటూ ఉండాలి. అదనంగా, పుచ్చకాయలో అద్భుతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి, ఇవి శీతలీకరణ ప్రభావాన్ని అందిస్తాయి.

ఆకుపచ్చని కూరగాయలు- Vegetables

ఆకుపచ్చని కూరగాయలు ఏడాది పొడవునా ఏ సీజన్ లో తీసుకున్నా అవి శరీరానికి మేలు చేస్తాయి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ను మీ రెగ్యులర్ డైట్‌లో భాగం చేసుకోవడం ప్రయోజనకరం ఎందుకంటే వాటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ కూరగాయలను ఎక్కువగా ఉడకబెట్టడం వల్ల వాటిలోని నీటి శాతాన్ని కోల్పోయే అవకాశం ఉందని గమనించండి. వీలైతే వీటితో స్మూతీలు చేసుకొని తాగడం ఈ వేసవిలో మంచి అలవాటు.

పెరుగు- Curd

మనం సాధారణంగా ఆహారం తినేటపుడు పెరుగును కలుపుకొని తింటాం. వేసవిలోనూ ఈ అలవాటును కొనసాగించాలి. పెరుగు శరీరంపై శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. వేడి సీజన్ లో పెరుగు వినియోగం పెరిగేలా మీరు రుచికరమైన లస్సీ లేదా మజ్జిగ వంటి వివిధ రూపాలలో పెరుగును తీసుకోవచ్చు. పెరుగుతో రైతాను కూడా తయారు చేసి మీ లంచ్ లేదా డిన్నర్‌తో పాటు తినవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం