Watermelon Halwa | హల్వాలకే రాజు.. పుచ్చకాయ హల్వా, దీనిని తయారు చేసుకోవడం ఇలా!
పుచ్చకాయని నెయ్యిలో వేయించి, బాదాం పిస్తా జోడించి చేస్తే ఏదో అవుతుంది. ఇలా కాకుండా మీరు పుచ్చకాయతో హల్వా చేసుకోవాలంటే ఇక్కడ చెఫ్ కునాల్ కపూర్ అందించిన పర్ఫెక్ట్ రెసిపీ ఉంది. అలా ట్రై చేయండి..
వేసవి కాలం అంటే దాహాన్ని తీర్చుకునే కాలం. మండే ఎండల్లో ఎన్నో రకాల పండ్లు, జ్యూసులు, ద్రవాలతో మన దాహాన్ని తీర్చుకుంటాం. ఈ సీజన్ లో మార్కెట్లన్నీ మామిడి పండ్లు, పుచ్చకాయలు, కొబ్బరిబొండాలు, తాటి ముంజలతో నిండుగా ఉంటాయి.
కాబట్టి మనల్ని మనం హైడ్రేటెడ్ గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా ఈ సీజన్ లో పుచ్చకాయలు కడుపు నింపడంతో పాటు మన దాహాన్ని తీరుస్తాయి. పుచ్చకాయను నేరుగా తినవచ్చు, జ్యూస్ చేసుకొని తాగవచ్చు. అయితే పుచ్చకాయతో హల్వా కూడా చేయవచ్చు అని మీకు తెలుసా? పుచ్చకాయతో హల్వా ఏంటి పిచ్చికాకపోతే అని అనుకోకండి. పుచ్చకాయ హల్వా పిచ్చి టేస్టీగా ఉంటుందట.
చెఫ్ కునాల్ కపూర్‌కి ఎలాంటి ఆహార పదార్థాలనైనా సాధారణంగా కాకుండా కాస్త సృజనాత్మకంగా రుచికరమైన వంటకాలుగా తయారు చేయడం ఎలాగో తెలుసు. ఆయనే ఈ పుచ్చకాయ హల్వాకు ప్రాణం పోశారు. మీరూ మీ ఇంట్లో ఇలా పుచ్చకాయతో హల్వా చేసుకొని తియ్యని వేడుక చేసుకోండి.
పుచ్చకాయ హల్వాకి కావాల్సిన పదార్థాలు
- పుచ్చకాయ తొక్కతో - 3 పెద్ద ముక్కలు
- నెయ్యి - 2-3 టేబుల్ స్పూన్లు
- సూజీ రవ్వ (సెమోలినా) - 1 టేబుల్ స్పూన్
- శనగ పిండి - 1 టేబుల్ స్పూన్
- చక్కెర - ½ కప్పు
- యాలకుల పొడి - ½ స్పూన్
- జాజికాయ పొడి - చిటికెడు
- పాలు - 1 కప్పు
- బాదం & పిస్తా - చేతి నిండా
తయారీ విధానం
- గుజ్జు తక్కువగా ఉండే పుచ్చకాయను ముక్కలను తీసుకోండి. ఒక పీలర్ ఉపయోగించి పైభాగంలో ఆకుపచ్చగా ఉండే మందపాటి పొరను పీల్ చేయండి.
- ఆకుపచ్చ పొర క్రింద ఉండే మరొక పొరను కూడా పీల్ చేయండి.
- ఇప్పుడు ఈ పుచ్చకాయ తొక్కలను ముక్కలు ముక్కలుగా కోసి, గ్రైండర్‌లో వేసి నీటిని ఉపయోగించకుండా ప్యూరీ చేయండి.
- పాన్ వేడి చేసి నెయ్యిని కొద్దిగా వేడిచేయండి. ఆ తర్వాత సూజి, శనగపిండి వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు తక్కువ మంట మీద నేతిలో వేయించండి.
- ఇప్పుడు ఇందులోనే పుచ్చకాయ ప్యూరీని వేసి మిశ్రమం చిక్కగా మారేంత వరకు 15-20 నిమిషాల పాటు ఉడికించండి.
- ఇప్పుడు చక్కెర వేసి బాగా కలుపుకొని మళ్లీ సుమారు 10 నిమిషాల పాటు ఉడికించండి
- అనంతరం యాలకుల పొడి, జాజికాయ పొడి, పాలు వేసి మరో 5 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.
పుచ్చకాయ హల్వా రెడీ అయినట్లే బాదం -పిస్తాతో అలంకరించి వేడివేడిగా సర్వ్ చేసుకోండి.
సంబంధిత కథనం