Aloo Paratha Recipe । రుచిలో ఆహా అనిపించే ఆలూ పరాఠా.. ఆనందంగా తినండి ఈపూట!
రుచికరంగా, త్వరగా ఏదైనా అల్పాహారం సిద్ధం చేయాలనుకుంటే, ఆలూ పరాఠా చేసుకోవచ్చు. రొటీలు చేసుకున్నంత సమయం పడుతుంది. క్లాసిక్ Aloo Paratha Recipe కోసం ఇక్కడ చూడండి.
బ్రేక్‌ఫాస్ట్ అనేది రోజులో చేసే ముఖ్యమైన భోజనంగా పరిగణిస్తారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటపుడు కచ్చితంగా అల్పాహారం చేసే వెళ్లాలి అని పెద్దలు చెప్తారు. అంటే బ్రేక్ ఫాస్ట్ చేయటం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలి. అయితే సాధారణ రోజుల్లో చాలా మందికి ఉదయం చాలా బిజీబిజీగా ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ చేసేంత సమయం కూడా ఉండదు. అయినప్పటికీ సమయం తీసుకొని అల్పాహారం చేయాలి. అది కూడా మంచి పోషకాలతో నిండిన అల్పాహారం తీసుకుంటే శక్తివంతంగా పని చేయగలుగుతారు.
మీకు ఇప్పుడు ఒక రుచికరమైన, పోషక విలువలతో కూడిన అల్పాహారం రెసిపీని పరిచయం చేస్తున్నాం. మనం సాధారణం ఇడ్లీ, దోశ, పూరీ ఎప్పుడూ తినేవే, కొద్దిగా కొత్తదనం కోరుకుంటే ఆలూ పరాఠా ప్రయత్నించండి. ఈ వంటకం ఉత్తర భారతదేశంలో దాదాపు ప్రతీ ఇంట్లో చేసుకుంటారు. స్పైసీ ఆలూ మసాలాతో పరాఠాని స్టఫ్ చేసి పెరుగుతో అద్దుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. కడుపు నిండిపోతుంది. మధ్యాహ్నం వరకు ఆకలి వేయదు. మరి సాంప్రదాయ ఆలూ పరాఠాను ఎలా చేసుకోవాలి? కావలసిన పదార్థాలేమిటో తెలుసుకోవాలంటే ఈ కింద రెసిపీ ఉంది చూడండి.
Aloo Paratha Recipe కోసం కావలసినవి
- 250 గ్రా మొత్తం గోధుమ పిండి
- 1 కప్పు నీరు
- చిటికెడు ఉప్పు
- 50 ml నూనె
- స్టఫింగ్ కోసం:
- 500 గ్రా బంగాళదుంపలు
- 1 ఉల్లిపాయ
- 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
- 2 పచ్చిమిర్చి
- 1/4 టీస్పూన్ పసుపు
- 1/4 టీస్పూన్ కారం
- 10 ml నిమ్మ రసం
- తాజా కొత్తిమీర
ఆలూ పరాఠా తయారు చేసే విధానం
1. గోధుమపిండిలో నీరు కలపండి, అంటుకోకుండా కొద్దిగా నూనెను కలిపి మెత్తని పిండిని తయారు చేయండి.
2. పరాఠాలు చేసుకునేందుకు వీలుగా ఈ పిండి ముద్దను చిన్నచిన్న బంతులుగా విభజించండి.
3. మరోవైపు బంగాళదుంపలు ఉడకబెట్టండి, ఉడికిన తర్వాత వాటి పైచర్మం తొలగించి, మెత్తగా పిసికి మాష్ చేయండి.
4. ఇప్పుడు మెత్తగా పిసుక్కున్న బంగాళాదుంపల్లో చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి. అనంతరం మిగిలిన పదార్థాలను వేసి బాగా కలపాలి.
5. ఇప్పుడు పిండి ముద్దలో ఆలూ మిశ్రమాన్ని స్టఫ్ చేసి, రోటీలు చేసుకున్నట్లుగా గుండ్రంగా, చదునుగా చేయండి.
6. పాన్‌లో కొద్దిగా నూనె వేసి మీడియం మంట మీద వేడి చేయాలి.
7. ఆపై పరాఠాలను రెండు వైపులా బంగారు రంగులోకి వచ్చే వరకు ఉడికించాలి.
8. పైనుంచి కొంచెం వెన్నపూస పూసుకుంటే ఫ్లేవర్ పెరుగుతుంది.
అంతే, రుచికరమైన ఆలూ పరాఠాలు రెడీ, వేడివేడిగా ఆరగించండి మరి. ఈ ఆలూ పరాఠాలను పెరుగుతో లేదా ఏదైనా చట్నీతో అద్దుకొని తినవచ్చు.
సంబంధిత కథనం