Aloo Uttapam | అల్పాహారంలో ఆలూ ఊతప్పం.. దీని రుచి ఎంతో అద్భుతం!
మీరు బ్రేక్‌ఫాస్ట్‌లో ఊతప్పం చాలా సార్లు తినే ఉంటారు. అయితే ఎప్పుడైనా ఆలూ ఊతప్పం తిన్నారా? ఇలా ఊతప్పం చేసుకుంటే ఇంకా రుచిగా, నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉంటుంది. ఇక్కడ రెసిపీ ఇచ్చాం, మీరు చేసుకొని తినండి మరి.
బ్రేక్‌ఫాస్ట్‌లో సాధారణంగా మనం ఇడ్లీ, దోశ వంటివి తినటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. అప్పుడప్పుడు దోశకు ప్రత్యామ్నాయంగా ఊతప్పం లాంటిది చేసుకుంటాం. అయితే దోశలో ఎన్నో రకాల వెరైటీలు ఉన్నట్లే ఊతప్పంలో కూడా వెరైటీలు చేసుకోవచ్చు. మీరెప్పుడైనా ఆలూ ఊతప్పం తిన్నారా? ఈ ఆలూతో చేసే ఊతప్పం ఇంకా టేస్టీగా ఉంటుంది. వాస్తవానికి బంగాళదుంపలతో చేసే ఎలాంటి రెసిపీ అయినా రుచిగా ఉంటుంది. ఇక ఆలూతో కలిపి చేసే ఊతప్పం మంచి ఆకృతిలో వస్తుంది. దీనికి కొన్ని క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు జోడిస్తే రుచితో పాటు పోషకాలు అందుతాయి.
ట్రెండింగ్ వార్తలు
ఈ ఆలూ ఊతప్పం చేసుకోవటానికి పెద్ద శ్రమించాల్సిన పని లేదు, సమయం కూడా ఎక్కువ తీసుకోదు. తక్కువ సమయంలోనే త్వరితంగా చేసుకోవచ్చు. ఇందులో కూరగాయలు కలుపుతున్నాం కాబట్టి మంచి పోషకాలు, శక్తి లభిస్తాయి. చాలా సేపటి వరకు ఆకలిగా కూడా అనిపించదు. మీరు ఈ ఆలూ ఊతప్పం ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లాగానే కాకుండా రాత్రి వేళ అల్పాహారంగా, ఉపవాసం సమయంలో కూడా తీసుకోవచ్చు. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? ఆలూ ఊతప్పం తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ అందిస్తున్నాం. మీరూ ఒక సారి చేసుకొని చూడండి.
కావాల్సిన పదార్థాలు
1 కప్పు నానబెట్టిన బియ్యం
2 ఉడికించిన బంగాళదుంపలు
1 తరిగిన ఉల్లిపాయ
1 తరిగిన క్యారెట్
1 తరిగిన క్యాబేజీ
1 తరిగిన క్యాప్సికమ్
2 పచ్చిమిర్చి
2 టేబుల్ స్పూన్ల అల్లం
1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్
1/2 స్పూన్ మిరియాలు
రుచి ఉప్పు
వేయించేందుకు నూనె
తయారీ విధానం
- ముందుగా బియ్యాన్ని ఒక నాలుగైదు గంటలపాటు నానబెట్టుకొని ఉండాలి. అనంతరం ఈ నాన బెట్టిన బియ్యంలో, ఉడకబెట్టిన బంగాళదుంపలు, నీరు, అల్లం, పచ్చి మిరపకాయలను మిక్సర్ బ్లెండర్‌లో వేసి మిక్స్ చేసుకోవాలి. కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండి బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి.
- ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద గిన్నెలోకి మార్చండి. ఉతప్పం వేయటానికి తగినట్లుగా చేసుకున్న బ్యాటర్లో తరిగిన క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయలను ముక్కలను వేసి కలపండి.
- అనంతరం చిల్లీఫ్లేక్స్, ఉప్పు, మిరియాలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఆలూ ఊతప్పం చేసేందుకు కావాల్సిన ముఖ్య పదార్థాలు సిద్ధం అయినట్లే.
- ఇప్పుడు పెనం వేడిచేసి ఒక టీస్పూన్ నూనెను పెనం అంత వేసి ఊతప్పంలాగా వేసుకోవాలి. ఉతప్పం రెండువైపులా బాగా కాల్చుకోవాలి.
అంతే, రుచికరమైన ఆలూ ఊతప్పం రెడీ అయినట్లే సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీ లేదా సాంబార్ తో కలిపి తీసుకొని దీని రుచిని ఆస్వాదించండి.