Cabbage Upma Recipe । గోబి ఉప్మా.. మరింత టేస్టీ, మరింత హెల్తీ బ్రేక్‌ఫాస్ట్!
Cabbage Upma Recipe: ఎప్పుడైనా క్యాబేజీ ఉప్మా తిన్నారా? రెగ్యులర్ ఉప్మాకు మరింత రుచికరమైన, పోషకభరితమైన రెసిపీ.
Healthy Breakfast Recipes: ఉప్మా అనేది ఆరోగ్యకరమైన అల్పాహారం, అయినప్పటికీ చాలా మంది ఉప్మా తినడానికి అంతగా ఇష్టపడరు. అయితే ఉప్మాను అనేక రకాలుగా రుచికరంగా చేసుకోవచ్చు. క్యారెట్లు, పచ్చిబఠానీలు వేసి చేసిన ఉప్మా చాలాసార్లు తినే ఉంటారు. అయితే ఎప్పుడైనా క్యాబేజీ ఉప్మా తిన్నారా? క్యాబేజీ ఉప్మా రెసిపీ ఇక్కడ అందిస్తున్నాం. ఇది రెగ్యులర్ ఉప్మాకు మరింత రుచికరమైన, పోషకభరితమైన రెసిపీ.
ఆరోగ్యకరమైన ఆకుకూరల్లో క్యాబేజీ కూడా ఒకటి. క్యాబేజీలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ అలాగే విటమిన్ సి, థయామిన్, నియాసిన్, ఫోలేట్ వంటి పోషకాలు దండిగా ఉంటాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువే. ఇది పిత్త ఆమ్లాలను బంధించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇటువంటి పోషకాలు నిండిన క్యాబేజీ ఉప్మా ఎలా చేయాలో ఈ కింద సూచనలు చదవండి.
Cabbage Upma Recipe కోసం కావలసినవి
- 1 కప్పు రవ్వ
- 1/2 కప్పు క్యాబేజీ తురుము
- 1/4 కప్పు ఉల్లిపాయ ముక్కలు
- 2 టేబుల్ స్పూన్లు టమోటా ముక్కలు
- 1/2 టీస్పూన్ ఆవాలు
- 1/2 టీస్పూన్ మినపపప్పు
- 1/2 స్పూన్ శనగపప్పు
- 5 జీడిపప్పు
- 5 పచ్చి మిరపకాయలు
- 2 కప్పుల నీరు
- 2 tsp వంట నూనె
- 2 స్పూన్ నెయ్యి
- కరివేపాకు ఒక రెమ్మ
- రుచికి తగినంత ఉప్పు
క్యాబేజీ ఉప్మా తయారీ విధానం
- ముందుగా 1 టీస్పూన్ నెయ్యితో నాన్ స్టిక్ పాన్ వేడి చేయండి, అందులో రవ్వ వేసి రంగు మారే వరకు సుమారు 2 నిమిషాలు వేయించాలి. అనంతరం వేయించిన రవ్వను ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
- ఇప్పుడు అదే పాన్ లో నూనె వేడి చేసి, ఆవాలు, మినపపప్పు, శనగపప్పు, జీడిపప్పు వేసి 2 సెకన్ల పాటు వేయించాలి. ఆపైన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
- ఉల్లిపాయలు కొద్దిగా రంగు మారే వరకు ప్రతిదీ వేగించండి, ఆపై తరిగిన క్యాబేజీని వేసి అన్నింటిని కలపండి. అన్నీ బాగా ఉడికిన తర్వాత టొమాటోలు వేసి కలుపుతూ ఉడికించాలి.
- ఇప్పుడు నీరు, ఉప్పు వేసి మరిగించాలి. నీరు మరుగుతుండగా వేయించిన రవ్వ వేసి కలపాలి. తక్కువ మంట మీద 10 నిమిషాలు ఉడికించాలి.
చివర్లో నెయ్యి వేయాలి. అంతే, క్యాబేజీ ఉప్మా రెడీ. మీకు నచ్చిన చట్నీలతో వేడిగా వడ్డించండి.
సంబంధిత కథనం