Carrot Methi Rice । క్యారెట్ మెంతి రైస్ ఎంతో రుచికరం, ఆరోగ్యకరం.. వన్ పాట్ రెసిపీ ఇదిగో!
Carrot Methi Rice Recipe: భోజనంలోకి త్వరత్వరగా, రుచికరంగా ఏదైనా వండుకొని తినాలనుకుంటున్నారా? క్యారెట్ మెంతికూర రైస్ ట్రై చేయండి, రెసిపీ ఇక్కడ ఉంది చూడండి.
Healthy Recipes: ఎండాకాలంలో వంట చేయాలంటే చాలా మందికి బద్ధకంగా ఉంటుంది. వేడి వాతావరణంలో వంటగదిలో తక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. అయితే తక్కువ సమయంలోనే రుచికరంగా చేయగలిగే వన్ పాట్ రెసిపీలు చాలానే ఉన్నాయి. ఇందులో క్యారెట్ మెంతి రైస్ ఎంతో రుచికరమైనది. క్యారెట్ మెంతి రైస్ అనేది క్యారెట్లు, మెంతికూర కలిపి అన్నంతో పాటు వండే వంటకం.
క్యారెట్లలో బీటా-కెరోటిన్‌లో పుష్కలంగా ఉంటుంది, ఇది మీ కళ్ళను సూర్యుని నుండి రక్షించడంలో సహాయపడుతుంది. కంటిశుక్లం, ఇతర కంటి సమస్యలను తగ్గించి కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. మెంతికూర ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుతుంది, రక్తంలో చక్కెర తగ్గిస్తుంది, గ్యాస్ట్రిక్ సమస్యలను నివారిస్తుంది. ఇన్ని పోషక గుణాలు కలిగిన క్యారెట్ మెంతి రైస్ ఎలా చేయాలో ఇక్కడ చూడండి.
Carrot Methi Rice Recipe కోసం కావలసినవి
- 1/2 కప్పు బాస్మతి రైస్
- 2 కప్పుల తాజా మెంతికూర
- ½ కప్పు క్యారెట్లు ముక్కలు
- 1 బిరియానీ ఆకు
- 1 ఆకుపచ్చ ఏలకులు
- 1 నల్ల ఏలకులు
- 4 లవంగాలు
- 1/2 స్పూన్ ఉప్పు
- 3-4 కప్పుల నీరు
- 2 స్పూన్ నూనె
- 2 స్పూన్ నెయ్యి
- 3-4 జీడిపప్పు
- 8-10 ఎండుద్రాక్ష
- 1 స్పూన్ జీలకర్ర
- 1 ఉల్లిపాయ
- 2 పచ్చిమిర్చి
- 1/2 స్పూన్ గరం మసాలా
- రుచికి తగినంత ఉప్పు
- 1 టేబుల్ స్పూన్ తరిగిన కొత్తిమీర
క్యారెట్ మెంతికూర రైస్ తయారీ విధానం
- ముందుగా బియ్యం కడిగి, 5-10 నిమిషాలు నానబెట్టండి. ఆపైన అదనపు నీటిని తీసివేసి పక్కన పెట్టండి
- ఒక వంట పాత్రలో కొంత నీటిని వేడి చేయండి. అందులో బిరియానీ ఆకు, పచ్చి ఏలకులు, నల్ల ఏలకులు, లవంగాలు వేసి ఉడికించండి.
- నీరు మరుగుతుండగా నానబెట్టిన బియ్యం, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపండి, ఉడికించండి.
- మరోవైపు కడాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయండి. అందులో జీడిపప్పును బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో ఎండు ద్రాక్షను ఉబ్బిపోయే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి
- అందులోనే జీలకర్ర, ఉల్లిపాయలు, మిరపకాయలు వేసి వేయించాలి
- ఇప్పుడు క్యారెట్ ముక్కలు, కొద్దిగా ఉప్పు, గరం మసాలా వేసి 3-4 నిమిషాలు వేయించాలి, ఆపైన మెంతి ఆకులు వేసి కొద్దిగా ఉడికించండి, ఆకులు మాడిపోకుండా జాగ్రత్తపడండి.
- ఇప్పుడు ఉడికించిన అన్నం, వేయించిన జీడిపప్పు , ఎండుద్రాక్ష వేసి బాగా కలపాలి
- చివరగా కొత్తిమీర తరుగు వేసి గార్నిష్ చేయాలి.
అంతే, క్యారెట్ మెంతి రైస్ రెడీ. రైతాతో కలిపి తింటూ రుచికరమైన అన్నాన్ని ఆస్వాదించండి.
సంబంధిత కథనం