Mutton or Chicken: బరువు తగ్గాలనుకునే వారు మటన్, చికెన్లలో ఏది తింటే మంచిది?
Mutton or Chicken: బరువు తగ్గాలనుకునే వారు మటన్, చికెన్ లలో ఏది తింటే మంచిదో అనే సందేహం ఉంటుంది. ఆ విషయంలో స్పష్టత కోసం పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.
మనలో చికెన్ లవర్స్, మటన్ లవర్స్ విడివిడిగా ఉంటారు. కొందరికి కోడి మాంసం అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. మరి కొందరికి మేక మాంసం అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. అందుకనే వీటితో కూరలు, బిరియానీలు, గ్రిల్డ్ మాంసాలు.. లాంటివి చేసుకుని తినేందుకు ఇష్ట పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే చాలా మంది తమ ఎత్తుకు తగ్గ బరువు కాకుండా అతిగా బరువు పెరిగిపోతూ ఉంటారు. తర్వాత దాన్ని తగ్గించుకోవడానికి చాలా తంటాలు పడుతూ ఉంటారు. రకరకాల డైటింగ్‌లు, వ్యాయామాలు, జిమ్ములు చేస్తూ కుస్తీలు పడుతుంటారు. మరి ఇలా బరువు తగ్గాలనుకునే వారు ఏ మాంసం తినొచ్చు? చికెనా? మటనా? అంటే..
చికెన్‌లో పోషక విలువలు :
100 గ్రాముల చికెన్‌లో 140 క్యాలరీలు, 24.11 గ్రాముల ప్రోటీన్, 3.12 గ్రాముల కొవ్వులు ఉంటాయి. వీటితో పాటుగా కాల్షియం, ఐరన్, విటమిన్ ఎ, సీలు లభిస్తాయి. వీటన్నింటి వల్ల చికెన్‌ని ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తుందని యూఎస్‌డీఏ చెబుతోంది.
మటన్ పోషక విలువలు :
100 గ్రాముల మటన్‌లో 143 క్యాలరీలు, 26 గ్రాముల ప్రోటీన్లు, 3.5 గ్రాముల కొవ్వు, 57 మిల్లీ గ్రాముల సోడియం, ఉంటాయి. వీటితో పాటుగా ఐరన్, జింక్, విటమిన్ బీ12 వంటి పోషకాలు మటన్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవీ ఆరోగ్యానికి ప్రయోజనాన్ని చేకూరుస్తాయి.
బరువు తగ్గేందుకు చికెనా తినాలా? మటనా?
మటన్‌తో పోలిస్తే చికెన్‌లో కొవ్వులు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఇది బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్న వారికి సహకరిస్తుంది. అలాగే చికెన్‌లో కంటే మటన్‌లో ప్రొటీన్లు ఎక్కువ ఉంటాయి. క్యాలరీల విషయంలోనూ ఎక్కువగానే ఉంటాయి. అందుకనే ఎలాంటి డైట్ ప్లాన్‌ని పాటిస్తున్న వారైనా సరే మటన్‌కి బదులుగా చికెన్‌ని తినడం వల్ల ప్రభావవంతంగా బరువును తగ్గ గలుగుతారు అని ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు.
బరువు తగ్గాలనుకునే వారు చికెన్‌ని తినొచ్చు. కానీ అందులో ఎక్కువ ఉప్పూ, కారాలు, మసాలాలూ చేర్చి, ఎక్కువ నూనెల్లో వేపించి తీసుకోకూడదు. బదులుగా చికెన్ సూప్, చికెన్ రోల్స్, గ్రిల్డ్ చికెన్... లాంటివి ఆరోగ్యకరంగా తయారు చేసుకుని మాత్రమే తినాలని గుర్తుంచుకోవాలి. తినొచ్చన్నారు కదా అని దీన్ని అతిగా తినడం వల్లా అనర్థమే. అప్పుడు బరువు తగ్గరు సరికదా పెరుగుతారు. వారానికి రెండు సార్లు వంద గ్రాముల చికెన్ చొప్పున తినొచ్చని డైటీషియన్లు సలహా ఇస్తున్నారు. అంతకు మించి తినకపోవడమే మంచిదని చెబుతున్నారు.