Eating Fish and Meat Together | చేపలు, మాంసం కూర కలిపి తినడం మంచిదేనా?
Eating Fish and Meat Together: చేపలు, మాంసం కూర కలిపి తినడం మంచిదేనా? చికెన్, మటన్‌ల కంటే చేపలు, సీఫుడ్ ఆరోగ్యకరమైనవని భావిస్తారు, మరి ఇందులో నిజమెంత తెలుసుకోండి.
ఆరోగ్యకరమైన జీవనం కోసం అన్ని పోషకాలు కలిగిన సమతుల్యమైన ఆహారం తీసుకోవాలని మనకు ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. అయితే ఇక్కడే ఒక చిక్కుముడి కూడా ఉంది. మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది, చేపల కూరతో పాటుగా పెరుగు తినకూడదని. ఒక్క పెరుగే కాదు పాలు, మజ్జిగ, తేనె, మినపపప్పు, మొలకెత్తిన ధాన్యాలు కూడా చేపలతో తినకూడదు. ఇలా తింటే ఇది సమతుల్య ఆహారం కాకుండా, విషతుల్యం అయ్యే ఆస్కారం ఉంటుంది. అయితే ఇంకో సందేహం ఏమిటంటే చేపలు, చికెన్, మటన్ ఇలా వివిధ రకాల మాంసాహారాలు ఒకేసారి తింటే ఏమవుతుంది? సాధారణంగా ఏదైనా విందుకు లేదా హోటెల్‌కు వెళ్లినపుడు ఇలా అన్ని రకాలు ఒకే చోట ఉంటాయి. మరి ఇలా కలిపి తింటే మంచిదేనా తెలుసుకుందాం.
Eating Fish and Meat Together- చేపలు, మాంసం కూర కలిపి తినడం మంచిదేనా?
చేపలు జలచరాలు, చికెన్, మటన్ ఇతర మాంసాలు భూమి మీద పెరిగిన వాటి నుంచి వచ్చేవి. చేపలను, మాంసాన్ని వేర్వేరుగా విక్రయిస్తారు, విక్రయదారులు కూడా పూర్తిగా ఒకరితో ఒకరు సంబంధం లేనివారు. కాబట్టి తినేటపుడు కూడా వేర్వేరుగానే తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
మసాలాలు లేకుండా ఏదైనా మితంగా తినడం ఆమోదయోగ్యమైనదే, కానీ ఇలా అన్నీ కలిపి తినడం ద్వారా జీర్ణవ్యవస్థలో ఇబ్బందులు తలెత్తుతాయి. రోజుల తరబడి చిన్నది జీర్ణం కాకుండా కడుపు నొప్పి ఇతర అనారోగ్య సమస్యలు తల్లెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
చేపలు, చికెన్ వంటి పౌల్ట్రీ సంబంధిత ఆహార పదార్థాలలో సమానమైన ప్రోటీన్లు ఉంటాయి. ఇవి కండరాల పెరుగుదలకు తోడ్పడే అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి. చేపలన్నింటిలో ట్యూనా రకం చేపలు అత్యధిక ప్రోటీన్ కంటెంట్‌ను కలిగి ఉంటాయి. ట్యూనా చేపలు, చికెన్ బ్రెస్ట్‌లో దాదాపు 27 గ్రా ప్రోటీన్ ఉంటుంది.
ఇక, మటన్ లాంటి ఎర్రమాంసంలో ప్రోటీన్ కంటే మరింత అధికంగా ఉన్నప్పటికీ కొవ్వు శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. చేపల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ముఖ్యంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి, కంటి చూపును మెరుగుపరచడానికి, ఆందోళన, నిరాశను తగ్గించడానికి సహాయపడతాయి. చేపల విషయానికి వస్తే, ఇతర రకాల సీఫుడ్‌లతో పోలిస్తే సాల్మన్ చేపల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల అత్యధిక సాంద్రత ఉంటుంది.
మరోవైపు పంది మాంసంలో మేక, బీఫ్ లతో పోల్చితే అతి తక్కువ అసంతృప్త కొవ్వును కలిగి ఉంటుంది. కావున చేపల మాదిరిగానే పందిమాంసంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి.
మటన్ అనారోగ్యకరమా?
మటన్ లాంటి ఎర్రమాంసంలో అనారోగ్యకరమైన కొవ్వు ఉన్నప్పటికీ, ఈ ఎర్రమాంసంలో మిగతా మాంసాలలో దొరకని పోషకాలు ఉంటాయి. మటన్ లో విటమిన్ B12, నియాసిన్ , ఇనుము, సెలీనియం వంటి పోషకాలను కలిగి ఉంటుంది. విటమిన్ B12 న్యూరాన్లు, రక్త కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది, అలాగే రక్తహీనతను నివారిస్తుంది. సెలీనియం రోగనిరోధక వ్యవస్థ, జీవక్రియ, థైరాయిడ్ పనితీరును ప్రేరేపిస్తుంది, నియాసిన్ ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. ఈ మాంసంలో ఇనుమును మానవ శరీరం సులభంగా గ్రహిస్తుంది. అయితే మటన్ మితంగా తిన్నప్పుడు, దీనిలోని సంతృప్త కొవ్వులు కూడా మెదడు పనితీరు, ఊపిరితిత్తులు, కాలేయ ఆరోగ్యానికి సహాయపడతాయి.
చివరగా చెప్పేదేమిటంటే చికెన్, మటన్‌ల కంటే సీఫుడ్ ఆరోగ్యకరమైనది అని పోల్చి చెప్పలేం. వేటిలో లభించే పోషకాలు వాటివే. అన్నీ తినాలి, కానీ కలిపి తినకూడదు. మసాలాలు తక్కువగా మితంగా తింటే ఈ మాంసాహారాలన్నీ చాల ఆరోగ్యకరం. ముర్గ్ ముసల్లం, మటన్ పాయా, చేపల కూర, రొయ్యల వేపుడు, కోడిగుడ్లు ఇలా ఒక్కొక్క సారి ఒక్కొటి తింటూ జీవితాన్ని ఆనందించండి.
సంబంధిత కథనం