అక్కడ పంది బిర్యానీ చాలా ఫేమస్.. పోర్క్ వంటకాలను ఇష్టపడే వారికి మాత్రమే!-pork biryani must try when you travel these places ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Pork Biryani, Must Try When You Travel These Places

అక్కడ పంది బిర్యానీ చాలా ఫేమస్.. పోర్క్ వంటకాలను ఇష్టపడే వారికి మాత్రమే!

HT Telugu Desk HT Telugu
Mar 27, 2022 02:06 PM IST

బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అయితే పంది బిర్యానీకి మాత్రం ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. బాగా కొవ్వుపట్టిన మెత్తటి పంది మాంసానికి ఒత్తుగా మసాల దట్టించి సన్నని సెగ మీద, సలసల మరిగే నూనెలో వేయించి బిర్యానీ చేసుకుని తింటే నరనరాలు జివ్వుమని లాగేస్తాయని పంది బిర్యానీ ప్రియులు చెప్తారు.

Biryani
Biryani (Stock Photo)

ఆహార ప్రియులు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తే ముందుగా అక్కడ పాపులర్ వంటకాలేంటి అని అణ్వేషిస్తారు. వారు కళ్లతో కాకుండా ముక్కుతో చూసుకుంటూ నడుస్తారు. ఎక్కడ్నించైతే ఘుమఘుమల వాసన వస్తుందో నేరుగా అక్కడకి వెళ్లి వాలిపోతారు. తమకు ఇష్టమైన వంటకాలను రుచిచూసి తరించిపోతారు.

హైదరాబాద్‌లో దమ్ బిర్యానీ ఎలా అయితే పాపులరో ఇండియాలోని కొన్ని ప్రదేశాలలో పంది బిర్యానీ పాపులర్. ముఖ్యంగా ఈశాన్య భారత దేశంలో చాలా వరకు పాపులర్ వంటకాలు పోర్క్‌తో చేసినవే అయి ఉంటాయి.

ఈ వేసవి కాలంలో విహారయాత్ర కోసం చాలా మంది డార్జిలింగ్ వెళ్లేవారు ఉంటారు. డార్జిలింగ్‌లోని అత్యంత ప్రసిద్ధ మాంసాహార వంటకాలలో పంది కూర ఒకటి. ఎంతో రుచికరంగా ఉండే ఈ వంటకాన్ని కొన్ని ప్రత్యేక మసాల దినుసులను ఉపయోగించి ప్రత్యేకంగా తయారు చేస్తారు. పోర్క్ చిల్లీ, పోర్స్ గ్రిల్ ఇలా రకరకాల వెరైటీలు కూడా ఇక్కడ లభిస్తాయి. డార్జిలింగ్‌లో వీచే శీతల పవనాల మధ్య వేడివేడి పందికూరను, అన్నంతో కలుపుకొని తింటే నోట్లో వేస్తే కరిగిపోతుందట. కోల్‌కతా లాంటి నగరాల్లో కూడా పంది బిర్యానీ చాలా ఫేమస్.

ఇక, దక్షిణ భారత దేశంలో అయితే మలబార్ ప్రాంతంలో పంది బిర్యానీని ఎక్కువగా తింటారు. అలాగే బెంగళూరు నగరంలో చంద్రప్ప అనే హోటెల్ పంది బిర్యానీతో చాలా పాపులర్ అయింది. గత 20 ఏళ్లకు పైగా ఇక్కడ పంది బిర్యానీని వండి వడ్డిస్తున్నారు. కర్ణాటకలో దొన్నె బిర్యానీ గురించి వినే ఉంటారు. అయితే ఈ చంద్రప్ప హోటెల్లో పూర్తిగా నాటు స్టైల్లో వండిన పంది దొన్నె బిర్యానీ వేడివేడిగా వడ్డిస్తారు. ఇది ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే సర్రున అలా జారిపోతుందని ఈ వంటకం మెచ్చిన అభిమానులు చెప్తారు. దీనితో పాటు ఐస్ క్రీమ్ తింటే ఇక ఈ జన్మకు ఇది చాలు అన్నంత తృప్తిగా ఉంటుందట.

మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రదేశాలకు వెళ్లి, అక్కడి ప్రసిద్ధ వంటకాలు తినాలనిపిస్తే మీకు పోర్క్‌తో వండినవి మీకు ఇష్టం ఉంటే ఒకసారి రుచిచూడండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్