Fish Curry | ఘుమ ఘుమలాడే కమ్మటి చేపల కూర, కేవలం 10 నిమిషాల్లో రెడీ!-traditional pomfret curry here is quick a 10 minute recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Traditional Pomfret Curry Here Is Quick A 10-minute Recipe

Fish Curry | ఘుమ ఘుమలాడే కమ్మటి చేపల కూర, కేవలం 10 నిమిషాల్లో రెడీ!

HT Telugu Desk HT Telugu
Jun 07, 2022 07:45 PM IST

మీకు చేపలకూర ఇష్టమేనా? కారం, ఉప్పు వేసి కొబ్బరిపాలలో ఉడికించుకొని.. కమ్మటి చేపకూర పులుసును కేవలం 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో కలుపుకొని తినాలంటే ఈ రెసిపీ చూసి నేర్చుకోండి..

Fish Curry
Fish Curry (Unsplash)

చేపల కూర అంటే మాంసాహారుల్లో ఎవరికి ఇష్టం ఉండదు? మంచిగా పులుసుపెట్టుకుంటే రెండు రోజుల పాటు కుమ్మేయొచ్చు. ఫ్రై చేసుకొని పప్పు చారులో కలుపుకొని తింటే యమ రుచిగా ఉంటుంది. చేపల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. కాబట్టి చేపకూర ఆరోగ్యానికి ఎంతో మంచిది. మృగశిర కార్తె రోజున చేపకూర తినాలని ఎంతో మంది ఉత్సాహం చూపిస్తారు.

ఈ సందర్భంగా మీ కోసం ఒక ప్రత్యేకమైన రెసిపీని పరిచయం చేస్తున్నాం. ఈ చేపకూరను కేవలం 10 నిమిషాల్లోనే వండుకోవచ్చు. ఉప్పు, కారం, సుగంధ దినుసులు, కొబ్బరిపాలతో తయారు చేసే ఈ చేపకూర రుచికి తిరుగే ఉండదు. ఈ వంటకం గోవా, కొంకణి, మలబార్, ఇంకా పశ్చిమ మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో ఎంతో ప్రసిద్ధి. మరి ఇంకా ఊరించడం ఎందుకు? కొబ్బరి చేపకూరకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ తెలుసుకోండి.

సాంప్రదాయ పాంఫ్రెట్ కర్రీకి కావాల్సినవి

  • 1 మీడియం పాంఫ్రెట్, సుమారు 400 గ్రా
  • రుచికి తగినంత ఉప్పు
  • పావు టీస్పూన్ పసుపు పొడి
  • అరకప్పు తురిమిన తాజా కొబ్బరి
  • 1 టీస్పూన్ ముడి బియ్యం
  • సన్నగా తరిగిన ఉల్లిపాయ
  • 4 నల్ల మిరియాలు
  • 3-4 ఎర్ర మిరపకాయలు (పచ్చివి, ఎండినవి)
  • 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె
  • 1 టీస్పూన్ చింతపండు గుజ్జు
  • అల్లం పేస్ట్ అర టీస్పూన్
  • అరకప్పు కొబ్బరి పాలు

తయారీ విధానం

  1. ముందుగా పాంఫ్రెట్‌ చేపను 6-7 ముక్కలుగా కోసుకొని ఉప్పు, పసుపు పొడిని వేసి బాగా రుద్దండి, ఆ తర్వాత నీటితో శుభ్రపరచండి.
  2. ఇప్పుడు కొబ్బరి తురుము, పచ్చి బియ్యం, తరిగిన ఉల్లిపాయ, మిరియాలు, మిరపకాయలను గ్రైండర్ జార్‌లో వేసి అరకప్పు నీరు పోసుకొని మెత్తని పేస్ట్ చేయాలి.
  3. పాన్‌లో కొబ్బరి నూనెను వేడి చేయండి. కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
  4. ఆ తర్వాత ఇదివరకు చేసుకున్న మెత్తని పేస్టును నూనెలో వేసి బాగా కలపాలి. ఆపై ఈ మిశ్రమానికి ఒక కప్పు నీళ్లు పోసి బాగా కలిపి తక్కువ మంట మీద ఒక నిమిషం పాటు ఉడికించాలి.
  5. ఇప్పుడు చింతపండు గుజ్జు వేసి కలపాలి. కొద్దిగా మరిగిన తర్వాత పాంఫ్రెట్ చేప ముక్కలు వేసి, మృదువుగా కలపండి. ఒక నిమిషం పాటు అధిక వేడి మీద ఉడికించండి. ఆ వెంటనే మంటను తగ్గించి రెండు మూడు నిమిషాలు ఉడికించాలి.
  6. ఇప్పుడు అల్లం పేస్ట్, కొబ్బరి పాలు వేసి, బాగా కలపండి అనంతరం ఒక నిమిషం పాటు ఉడికించాలి.

అంతే రుచికరమైన కొబ్బరిపాల చేపల కూర సిద్ధం అయింది, వేడివేడి అన్నంలో కలుపుకొని కమ్మకమ్మగా తినండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్