Curd and Bad cholesterol: అధిక బరువుతో ఉన్నవారికి పెరుగు మిత్రుడా? శత్రువా? పెరుగు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగ-is curd a friend to overweight people eating curd increases cholesterol in the body ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Curd And Bad Cholesterol: అధిక బరువుతో ఉన్నవారికి పెరుగు మిత్రుడా? శత్రువా? పెరుగు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగ

Curd and Bad cholesterol: అధిక బరువుతో ఉన్నవారికి పెరుగు మిత్రుడా? శత్రువా? పెరుగు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగ

Haritha Chappa HT Telugu
Aug 22, 2024 02:00 PM IST

Curd and Bad cholesterol: పెరుగు ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం అని అందరికీ తెలుసు. దీనిలో ప్రోబయోటిక్స్, క్యాల్షియం, ప్రోటీన్లు నిండి ఉంటాయి. అయితే అధిక కొలెస్ట్రాల్తో పోరాడుతున్నవారు అధిక బరువుతో ఉన్నవారికి పెరుగు తినవచ్చా? లేదా? అనే సందేహం ఉంది.

పెరుగు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా?
పెరుగు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా? (Pixabay)

Curd and Bad cholesterol: ప్రతిరోజూ కప్పు పెరుగు తినడం వల్ల శారీరక, మానసిక సమస్యలు చాలా వరకు తగ్గుతాయని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. మానసిక స్థితిని మెరుగుపరచడంలో పెరుగులోని పోషకాలు ఎంతో ఉపయోగపడతాయి. అయితే అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న వారు, ఊబకాయంతో సతమతమవుతున్న వారు ప్రతిరోజూ పెరుగు తినవచ్చా? లేదా? అనే సందేహం ఉంది. పెరుగు వారికి మిత్రుడా లేక శత్రువా అని ఆలోచించేవారు ఉన్నారు. ఎందుకంటే పెరుగు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు మరింతగా పెరుగుతాయని ఎంతోమంది భావన. కొలెస్ట్రాల్ మీ శరీరంలోని కొలెస్ట్రాల్ పై పెరుగు ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కొలెస్ట్రాల్ అంటే ఏమిటి?

కొలెస్ట్రాల్ అనేది శరీరంలోని ప్రతి కణంలో ఖచ్చితంగా ఉండాల్సిన ఒక కొవ్వు పదార్థం. ప్రతి వారికి ఈ కొవ్వు పదార్ధం అత్యవసరం. ఎందుకంటే ఇదే హార్మోన్లను, విటమిన్ డిని, బైల్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే మాత్రం అది హానికరంగా మారుతుంది. కొలెస్ట్రాల్‌లో రెండు రకాలు ఉంటాయి. HDL ను మంచి కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. LDLను చెడు కొలెస్ట్రాల్ గా పిలుస్తారు. ఎందుకంటే LDL ధమనులలో ఫలకాలు ఏర్పడటానికి దారితీస్తుంది. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ రక్త ప్రవాహంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడానికి సహాయపడుతుంది. అందుకే దీన్ని మంచి కొలెస్ట్రాల్ అని పిలుస్తారు.

ఇక పెరుగు విషయానికి వస్తే పెరుగు కచ్చితంగా తినాల్సిన ఆహారాల్లో ఒకటి. దీన్ని పాలను పులియబెట్టడం ద్వారా తయారు చేస్తారు. పెరుగులో ప్రోటీన్, క్యాల్షియం, ప్రోబయోటిక్స్, విటమిన్లు నిండుగా ఉంటాయి. పేగు ఆరోగ్యాన్ని కాపాడే బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి. వెన్న తీసిన పాలను పెరుగుగా మార్చడం వల్ల పెద్దగా కొలెస్ట్రాల్ ఉండదు. కానీ వెన్న తీయని పాలను తోడుపెట్టడం వల్ల ఆ పెరుగులో ఎక్కువ సంతృప్త కొవ్వు ఉండే అవకాశం ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే అవకాశం ఉంది.

పెరుగు కొలెస్ట్రాల్‌ను పెంచుతుందా?

కొన్ని అధ్యయనాల ప్రకారం పెరుగు వినియోగం, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం మధ్య సంబంధం ఉంది. కానీ ఖచ్చితంగా పెరుగు చెడు కొలెస్ట్రాల్‌ను పెంచే అవకాశం ఉందని మాత్రం చెప్పలేము. అలాగని పెంచదని చెప్పలేము. పెరుగు తక్కువ కొవ్వు లేదా నాన్ ఫ్యాట్ పాలతో తయారైతే.. అది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాకాకుండా పూర్తిగా వెన్నతో నిండిన పెరుగు కొలెస్ట్రాల్‌ను పెంచే ప్రమాదం ఉంది.

2012లో బ్రిటీష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం పెరుగును క్రమం తప్పకుండా తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అయితే అది కచ్చితంగా వెన్న తీసిన పాలతో చేసిన పెరుగు అయి ఉండాలి. పెరుగులోని ప్రోబయోటిక్స్ పేగులు కొలెస్ట్రాల్ ను శోషించుకోకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల రక్తంలో కొలెస్ట్రాల్ చేరకుండా ఉంటుంది. కాబట్టి వెన్న తీసిన పాలతో తయారు చేసిన పెరుగును తినడం అన్ని విధాలా మంచిదే.

ఎలాంటి పెరుగు తినాలి?

వీలైనంతవరకు కొవ్వులేని పాలను తీసుకుని ఇంట్లోనే పెరుగుగా తోడుపెట్టుకుని, ఆ పెరుగును తింటే శరీరానికి అంతా మేలే జరుగుతుంది. వెన్న తీయని పాలను లేదా వెన్న తీయని పాలతో చేసిన పెరుగును తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎంతో కొంత పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి వెన్న తీసిన పాలతో చేసిన పెరుగును అధిక బరువుతో ఉన్నవారు, ఊబకాయంతో బాధపడుతున్నవారు, అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో సతమతమవుతున్నవారు కూడా తినవచ్చు.

Whats_app_banner